Share News

ప్రాంతాలవారీగా ‘స్థానిక’ వ్యూహాలు

ABN , Publish Date - Aug 21 , 2026 | 04:12 AM

‘గత ప్రభుత్వ దాష్టీక పాలనను ముగించేందుకే జనసేన 21 స్థానాలకు పరిమితమై పోటీచేసింది. ఆ వ్యూహం ఆ సార్వత్రిక ఎన్నికలకే పరిమితం. స్థానిక ఎన్నికల కు ప్రాంతాలవారీగా...

ప్రాంతాలవారీగా ‘స్థానిక’ వ్యూహాలు

  • 21 సీట్లలో పోటీ సార్వత్రిక ఎన్నికలకే పరిమితం

  • క్షేత్రస్థాయి సమస్యలు నాకూ తెలుసు

  • శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం

  • పొత్తు అంశం నేను చూసుకుంటా.. ఎవరూ పార్టీ లైన్‌ దాటొద్దు

  • పొత్తు ధర్మాన్ని పాటిస్తూ స్థానిక పోరుకు సిద్ధంకండి

  • జనసైనికులు, వీరమహిళలను రాజకీయంగా బలోపేతం చేద్దాం

  • పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలకు డిప్యూటీ సీఎం పవన్‌ దిశానిర్దేశం

అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): ‘గత ప్రభుత్వ దాష్టీక పాలనను ముగించేందుకే జనసేన 21 స్థానాలకు పరిమితమై పోటీచేసింది. ఆ వ్యూహం ఆ సార్వత్రిక ఎన్నికలకే పరిమితం. స్థానిక ఎన్నికల కు ప్రాంతాలవారీగా... ఆ ప్రాంత రాజకీయ, సామాజిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలు ఉంటాయి. స్థానిక ఎన్నికల్లో జనసేన ప్రభావశీలంగా, మెరుగైన స్థాయిలో నిలబడుతుంది’ అని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. గురువారం అసెంబ్లీలోని జనసేన ఎల్పీ కార్యాలయంలో మంత్రులు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీలతో కీలక సమావేశం నిర్వహించారు. మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలపై రెండున్నర గంటల పాటు సుదీర్ఘంగా చర్చించారు. ప్రతి ఎమ్మెల్యే నుంచి వారివారి నియోజకవర్గాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎంతమంది అభ్యర్థులు సంసిద్ధంగా ఉన్నారో అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యేలు వారి నియోజకవర్గాలకే పరిమితం కాకుండా సమీప ప్రాంతాల్లో జనసేన బలాబలాలను బేరీజు వేసి, పోటీ చేసేందుకు తగిన స్థానాలను గుర్తించి పార్టీ కేంద్ర కార్యాలయానికి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి ఒక్కరూ సంసిద్ధులు కావాలని, పొత్తు ధర్మాన్ని పాటిస్తూ ఎన్నికల బరిలోకి వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన ఎంత బలంగా నిలబడితే అంత మెరుగైన ఫలితం ఉంటుందన్నారు. స్థానిక ఎన్నికల్లో పార్టీ అనుసరించాల్సిన విధివిధానాల రూపకల్పనకు ప్రత్యేకంగా కమిటీని ఏర్పాటు చేద్దామన్నారు. ఎమ్మెల్యేలతో పాటు సీనియర్‌ నాయకులు 9నుంచి 11మంది వరకూ కమిటీలో ఉంటారని తెలిపారు. ‘మన పార్టీ ఎమ్మెల్యేలు లేని కొన్ని ప్రాంతాల్లో కూటమి ధర్మానికి భిన్నంగా వెళ్తుండడంపై శ్రేణుల్లో అసహనం ఉంది’ అని పలువురు ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేశారు.


స్పందించిన అధినేత... ‘ఆ అంశాలు నా దృష్టికీ వచ్చాయి. శ్రేణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటాం. నియోజకవర్గాల్లో పార్టీ బలాబలాలపై దృష్టి సారించాలి. పొత్తు అంశం నేను చూసుకుంటా. ఎవరూ పార్టీ లైన్‌ దాటి మాట్లాడవద్దు. జనసైనికులను, వీరమహిళలను రాజకీయంగా బలోపేతం చేసేవిధంగా ముందుకు వెళ్దాం’ అని స్పష్టంచేశారు. సమావేశంలో మంత్రులు మనోహర్‌, కందుల దుర్గేశ్‌, ఎమ్మెల్సీ నాగబాబు, ఎంపీ లింగమనేని రమేశ్‌ పాల్గొన్నారు.

రేపు కేరళకు పవన్‌..

కేరళలోని ప్రకృతి వైద్య చికిత్సా కేంద్రానికి పవన్‌ కల్యాణ్‌ వెళ్లనున్నారు. రేపటి నుంచి 20రోజుల పాటు ఆయన అక్కడే ఉంటారు. తరచూ ఇబ్బంది పెడుతున్న ఆరోగ్యంపై దృష్టి సారించిన ఆయన ప్రకృతి వైద్యం చేయించుకోవాలని నిర్ణయించుకొని, కేరళ పయనమవుతున్నారు.

Updated Date - Aug 21 , 2026 | 04:13 AM