గ్రామాల భవిత మార్చే మిషన్!
ABN , Publish Date - Jul 03 , 2026 | 04:45 AM
‘వీబీ-జీరామ్‌జీ’ అనేది ఒక పథకం కాదు.. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్‌ను మార్చే మిషన్’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
వీబీ-జీరామ్‌జీ కింద ఏపీకే భారీగా నిధులు
రైల్వేకోడూరులో ప్రారంభించడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవం: పవన్
ఉపాధి 125 దినాలకు పెంపు
శ్రామికులకు అదనంగా 25 రోజులు భరోసా
గ్రామ సభలూ ఇదే ప్రాంతంలో జరిపి ప్రపంచ రికార్డు సృష్టించాం: డిప్యూటీ సీఎం
తిరుపతి/రైల్వేకోడూరు, జూలై 2(ఆంధ్రజ్యోతి): ‘వీబీ-జీరామ్‌జీ’ అనేది ఒక పథకం కాదు.. గ్రామీణ ప్రాంతాల భవిష్యత్‌ను మార్చే మిషన్’ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా 100 రోజుల ఉపాధిని 125 రోజులకు పెంచడం గొప్ప నిర్ణయమన్నారు. అదనంగా 25 రోజుల ఉపాధి భరోసాతో శ్రామికుల కుటుంబాలకు మరింత ఆర్థిక భద్రత లభిస్తుందని చెప్పారు. వ్యవసాయ సీజన్‌లో 60 రోజుల విరామం కల్పించడం రైతులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. కొత్త పథకం కింద 2026-27 సంవత్సరంలో కేంద్రం తన వాటా కింద రూ.7,707 కోట్లు కేటాయించిందని, దేశంలోనే ఇది మూడో అతి పెద్ద కేటాయింపని స్పష్టం చేశారు. తిరుపతి జిల్లా ముక్కావారిపల్లెలో గురువారం జరిగిన వీబీ-జీరామ్‌జీ పథకం ప్రారంభోత్సవంలో పవన్ మాట్లాడారు. ‘ప్రతి గ్రామం అభివృద్ధి చెందితేనే ప్రతి కుటుంబం ఆర్థికంగా బలపడుతుంది. ఈ లక్ష్య సాధనలో రాష్ట్రంపై విశ్వాసం ఉంచి దేశంలోనే మూడో అతిపెద్ద కేటాయింపులు అందించిన కేంద్రానికి ధన్యవాదాలు’ అని తెలిపారు. ప్రధాని మోదీ కలలుకంటున్న వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగమైన ఈ పథకాన్ని రైల్వేకోడూరు నియోజకవర్గంలో ప్రారంభించడం మన రాష్ట్రానికి దక్కిన గౌరవమన్నారు. ‘ఇదే ప్రాంతంలో మైసూరావారిపల్లె నుంచి రాష్ట్రవ్యాప్తంగా 13,326 గ్రామ సభలను నిర్వహించి ప్రపంచ రికార్డు సృష్టించాం. అదే స్ఫూర్తితో తాజా కార్యక్రమానికీ రైల్వేకోడూరును ఎంచుకున్నాం.
రాష్ట్రాభివృద్ధికి అండగా నిలుస్తున్న ప్రధాని మోదీకి, కోరిన వెంటనే ఈ జాతీయ కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రారంభించేందుకు ముందుకొచ్చిన కేంద్ర మంత్రి చౌహాన్‌కు ధన్యవాదాలు. గత రెండేళ్లలో పల్లె పండుగతోపాటు మరో కార్యక్రమం ద్వారా రూ.16,695 కోట్ల ఉపాధి హామీ నిధులను సమర్థంగా వినియోగించాం. 7 వేల కిమీ సీసీ రోడ్లు, 40 వేల గోకులాలు, 15,500 నీటి తొట్టెలు, 1.07 లక్షల పంట కుంటలు, అడవితల్లి బాట కార్యక్రమం ద్వారా 1,373 కిమీ గిరిజన రహదారులను అభివృద్ధి చేశాం. 1.66 లక్షల ఉద్యాన పంటల సాగు చేపట్టాం. 55.40 కోట్ల పనిదినాలు కల్పించి గ్రామీణ కుటుంబాలకు ఉపాధి భద్రత కల్పించాం. స్వచ్ఛ రథాల ద్వారా స్వచ్ఛ గ్రామం, ఆరోగ్య గ్రామం లక్ష్య సాధన దిశగా పరిశుభ్రమైన గ్రామాలను అందిస్తున్నాం. 2026-27లో పల్లె పండుగ సాధించిన విజయాల స్ఫూర్తిగా.. రైతుల పండించిన పంటలు/ఉద్యాన పంటలు సకాలంలో మార్కెట్‌కు చేరవేసి వారి ఆదాయాన్ని పెంచే లక్ష్యంతో 10 వేల కిమీ డొంక రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టాం. దీంతోపాటు 1500 బీటీ రోడ్లు, 500 కిమీ మ్యాజిక్ డ్రెయిన్ల పూర్తి లక్ష్యంగా పెట్టుకున్నాం. గ్రామీణ పాలనలో దేశానికి ఏపీ ఆదర్శంగా నిలిచింది. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద మన రాష్ట్రం వైసీపీ హయాంలో 24వ స్థానంలో ఉండేది. ఈ రోజు సీఎం చంద్రబాబు నేతృత్వంలో అందరి సహకారంతో, అధికారుల నిర్దేశకత్వంలో మొదటి స్థానానికి చేరుకుంది. 2025లో ఐదు జాతీయ పంచాయతీ అవార్డులు సాధించి దేశంలో రెండో స్థానంలో నిలిచాం. మన మ్యాజిక్ డ్రెయిన్లకు జాతీయ స్థాయిలో గుర్తింపు రావడం గర్వకారణం’ అని తెలిపారు.
తొలుత హిందీలో..
పవన్ కల్యాణ్ తొలుత హిందీలో మాట్లాడి.. రాష్ట్రానికి అత్యధిక నిధులు కేటాయిస్తూ, అండగా నిలుస్తున్న ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి చౌహాన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘మనందరినీ ఆదరించే భాష.. మన జాతీయ భాషల్లో ఒకటైన రాజభాష హిందీ. విభిన్న భాషలున్నా భావం ఒక్కటే.. భారతీయత ఒక్కటే’ అంటూ హిందీలో మాట్లాడడానికి కారణాలు వివరించారు.
శ్రామికులకు భరోసా..
‘అభివృద్ధి అంటే కేవలం పనులు చేయడమే కాదు. ఆ పనులు చేసే శ్రామికుల జీవితాల్లోనూ భరోసా నింపడం. ఇది మా ప్రభుత్వ బాధ్యత. అందుకే ఉపాధి కూలీలో కూలీకి బదులుగా శ్రామికుడు అనే పదాన్ని తీసుకొచ్చాం. ప్రమాదవశాత్తు మరణించే శ్రామికుడి కుటుంబానికి అందించే పరిహారం రూ.50 వేలు ఉండేది. దీనిని ప్రఽధానమంత్రి సురక్ష బీమా యోజన, ప్రఽధాన మంత్రి జీవన బీమా యోజన కింద రూ.4 లక్షల నుంచి రూ.6 లక్షల వరకు పెంచగలిగాం. భారత్ భవిష్యత్ నగరాల్లోనే కాదు.. అభివృద్ధి చెందిన ప్రతి గ్రామంలోనూ రూపుదిద్దుకుంటుంది’ అని పవన్ కల్యాణ్ అన్నారు. వీబీ-జీరామ్‌జీ పథకాన్ని దేశానికే ఆదర్శంగా నిర్వహిస్తామన్నారు. మ్యాజిక్ డ్రెయిన్లను తన నియోజకవర్గంలో అభివృద్ధి చేస్తామన్నందుకు చౌహాన్‌కు ధన్యవాదాలు తెలిపారు.