Share News

గోదావరి పుష్కరాల బాధ్యత నాదే!

ABN , Publish Date - May 26 , 2026 | 05:10 AM

గోదావరి పుష్కరాలను పర్యావరణ హితంగా నిర్వహించే బాధ్యతను తాను తీసుకున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

గోదావరి పుష్కరాల బాధ్యత నాదే!

  • దేశం గర్వించేలా పర్యావరణ హితంగా నిర్వహిస్తాం

  • పరీవాహక గ్రామాల అభివృద్ధికి రూ.100కోట్లు

  • పుష్కర ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ సమీక్ష

రాజమహేంద్రవరం, మే 25(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను పర్యావరణ హితంగా నిర్వహించే బాధ్యతను తాను తీసుకున్నానని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఆయన సోమవారం విస్తృతంగా పర్యటించారు. ఉదయం 6 గంటల నుంచే ఆయన పర్యటన మొదలైంది. పునర్నిర్మాణంలో ఉన్న పుష్కరఘాట్‌ నుంచి బోటులో బయల్దేరి కోటి లింగాల ఘాట్‌ వరకూ వివిధ స్నానాల రేవులను పరిశీలించారు. మురుగునీటి నిర్వహణ కేంద్రమైన నల్లా చానల్‌ వద్ద ఆ ప్రాంతంలోని నీటి నమూనాలను అక్కడికక్కడే పరీక్షలు చేయించారు. నీటి పరిస్థితిని వీడియో తీసుకున్నారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్కరాలను దేశం గర్వించేలా నిర్వహిస్తామన్నారు. కాలుష్య రహిత గోదావరి థీమ్‌తో ఏర్పాట్లు చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. పర్యావరణ విభాగం తాను చూస్తున్న శాఖ పరిధిలోనే ఉన్నా నిధులు లేవని చెప్పారు. గోదావరి పుష్కరాలకు చేసే ఖర్చు నుంచే రాబడి వచ్చే విధంగా ప్రణాళికలు ఉండాలన్నారు. తల్లిలాంటి గోదావరిని కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉందన్నారు. ఈ రోజు (సోమవారం) నుంచి రాజమహేంద్రవరాన్ని ప్లాస్టిక్‌ రహిత సిటీగా ప్రకటిస్తున్నామని చెప్పారు. పుష్కరాలు నిర్వహించే 6 జిల్లాల పరిధిలోని 274 గ్రామాల్లో రూ.8,600 కోట్ల ప్రతిపాదనలతో 7,360 పనులు చేపట్టాల్సి ఉందని చెప్పారు.


ఆ గ్రామాల్లో రేవులు అభివృద్ధి చేయాలి

గోదావరి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది వస్తారనే అంచనా ఉండడంతో నదీ పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల్లో రేవులను కూడా అభివృద్ధి చేయాలని పవన్‌ కల్యాణ్‌ సూచించారు. గోదావరి పరీవాహక ప్రాంతాల్లోని గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్‌ శాఖ నుంచి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. అనంతరం మున్సిపల్‌ కార్పొరేషన్‌కు చేరుకున్న పవన్‌ కల్యాణ్‌... పుష్కరాల నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. పుష్కరాల నేపథ్యంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, తమ ప్రణాళికలను కలెక్టర్‌ కీర్తి చేకూరి వివరించారు. కాగా, అంతకుముందు నల్లా చానల్‌ను పరిశీలిస్తున్న సమయంలో పవన్‌ కల్యాణ్‌ స్థానిక మత్స్యకారులతో మాట్లాడారు. వారితో సెల్ఫీలు దిగారు. విజ్జేశ్వరం-సిద్ధాంతం ఏటిగట్టును కూడా పరిశీలించారు. సాయంత్రం జిల్లాకు చెందిన పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. మంగళవారం పార్టీలో చేరికలపై సమీక్షించి అనంతరం కాకినాడ వెళ్లనున్నారు.

Updated Date - May 26 , 2026 | 05:11 AM