అన్నిటిపైనా నేనే మాట్లాడాలా..?
ABN , Publish Date - Feb 03 , 2026 | 05:05 AM
పదవులిచ్చింది అనుభవించడానికి కాదు.. పని చేయడానికని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. లడ్డూ వ్యవహారంపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా పార్టీ నేతలెవరూ మాట్లాడడం లేదని ఆక్షేపించారు.
అలాగైతే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు ఎందుకు: పవన్
మనోళ్లు మాట్లాడరేం?: జనసేనాని
పదవులిచ్చింది అనుభవించడానికి కాదు.. పని చేయడానికని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తేల్చిచెప్పారు. లడ్డూ వ్యవహారంపై ఇంత రాద్ధాంతం జరుగుతున్నా పార్టీ నేతలెవరూ మాట్లాడడం లేదని ఆక్షేపించారు. వైసీపీ దుష్ప్రచారాలను ఎందుకు తిప్పికొట్టడం లేదని నిలదీశారు. ‘ప్రతి అంశంపై నేనే మాట్లాడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పీఏసీ సభ్యులు ఎందుకు’ అని ప్రశ్నించారు. వైసీపీ ట్రాప్‌లో పడొద్దని జనరల్ బాడీ సమావేశంలో స్పష్టం చేశారు. జనసేన.. చాలా మంది రక్తం చిందించి.. వారు తిన్న దెబ్బలపై నిలిచిన పార్టీ అని.. వారి త్యాగాలను మనం గుర్తుంచుకోవాలని సూచించారు. కొందరు నేతల పేర్లు ప్రస్తావించి మరీ క్లాస్ తీసుకున్నారు. పరోక్షంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ.. ప్రతిఒక్కరూ తమ వ్యక్తిగత వ్యవహారాలపై జాగ్రత్తగా ఉండాలని, వారి వల్ల పార్టీకి నష్టం కలిగిస్తే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. ‘ఎవరు ఏం చేస్తున్నారో నేనొచ్చి చూడను కదా! ఎవరి వ్యక్తిగత జీవితం వారిది. దానిని పార్టీకి ఆపాదించడం కరెక్టు కాదు. నాయకులు ఏదైనా తప్పు చేస్తే పార్టీపరంగా విచారణ చేస్తాం. తప్పుందని తేలితే యాక్షన్ తీసుకుంటాం. ఇలాంటి విషయాల్లో పార్టీకి చెడ్డ పేరు రాకుండా చూడాల్సిన బాధ్యత మీదే’ అని చెప్పారు. జనసేన నాయకులు కూటమి ధర్మాన్ని పాటించాలన్నారు. గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో కూటమి సమావేశాల్లో పాల్గొనాలన్నారు. టీడీపీ నాయకులు సమావేశాలకు పిలిస్తే వెళ్లి, అక్కడి పరిస్థితులను అర్థం చేసుకోవాలని.. కానీ ఆ పార్టీ నాయకుల వ్యక్తిగత సమావేశాల్లో పాల్గొనవద్దని.. దూరంగా ఉండాలని సూచించారు.
మనం కేవలం పొత్తులోనే ఉన్నామన్నది గుర్తుంచుకోవాలన్నారు. తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ జోక్యం చేసుకుని.. ఆయా పార్టీల సోషల్ మీడియా టీమ్ బలంగా ఉందని చెప్పారు. పవన్ స్పందిస్తూ.. సోషల్ మీడియా పరంగా మనం కూడా బలంగానే ఉన్నామని.. మీరు గట్టిగా మాట్లాడితే అదే ప్రచారంలోకి వస్తుందని తెలిపారు. ‘సోషల్ మీడియా గెలుపోటములను నిర్ణయించదు. మన పార్టీపై వచ్చిన నెగిటివ్ న్యూస్‌ను మనమే వైరల్ చేయడం వల్ల దానికి బలం చేకూరుతోంది. మనం ఆ పద్ధతి మార్చుకోవాలి’ అని సూచించారు.
నాగబాబుపైనా సీరియస్
కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, తన అన్న, ఎమ్మెల్సీ నాగబాబుపై పవన్ కొంత సీరియస్ వ్యాఖ్యలు చేశారు. కాకినాడ ఎంపీని ఉద్దేశించి.. ‘మీకు లండన్ టూర్లకు వెళ్లేందుకు సమయం ఉంది.. కానీ పవిత్రమైన తిరుపతి లడ్డూ అంశంపై మాట్లాడడానికి టైమ్ లేదా’ అని నిలదీశారు. అమ్మాయిల వస్త్రధారణపై మాట్లాడడం, సోషల్ మీడియాలో స్పందిస్తున్న నాగబాబు.. తిరుమల లడ్డూ వ్యవహారంపై ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. ‘సోషల్ మీడియాలో, బహిరంగంగా పార్టీ గురించి, నా గురించి అనేక ఆరోపణలు చేస్తున్నారు. కానీ ఎవరూ వీటిని సీరియ్‌సగా తీసుకోవడం లేదు, కౌంటర్ చేయడం లేదు. ప్రతి ఒక్కరూ తిప్పికొట్టాలి’ అని స్పష్టంచేశారు.