Share News

కులాన్ని దాటి వెళ్లలేరా!

ABN , Publish Date - May 27 , 2026 | 05:09 AM

‘నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ.. 12 ఏళ్ల తర్వాత మౌనం వీడి చెబుతున్నాను. నేను వచ్చింది ఒక కులం కోసం కాదు’ అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు.

కులాన్ని దాటి వెళ్లలేరా!

  • కాపు నేతలకు పవన్‌ సూటిప్రశ్న

  • నేను వచ్చింది కులం కోసం కాదు

  • మాట్లాడితే వంగవీటి రంగాను తెస్తారు

  • ఆయన భార్య కమ్మ సామాజిక వర్గం

  • చంద్రబాబు ఒకరి నాశనం కోరే వ్యక్తి కాదు

  • మనోహర్‌ కులాల ఐక్యత అర్థం చేసుకున్నారు

  • కాపు నేతలను నేనొక్క మాటా అనలేదు

  • కానీ వారంతా ఇష్టానికి మాట్లాడారు

  • నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు

  • అక్కడిదాకా తీసుకురావొద్దు: జనసేనాని

  • జనసేన సాధకుల భేటీలో ప్రసంగం

మాజీ సీఎం వద్ద 100 మంది.. 150 మంది రౌడీలు ఉంటారని అంటుంటారు. 20 వేల మంది ముందు వాళ్లు నిలబడగలరా.. తెగించగలరా? మనల్ని తట్టుకోలేరు.

కాపు కుల నాయకులందరూ నన్ను అకారణంగా మీ ఇష్టానికి మాట్లాడారు. ఒక్క మాట కూడా నేను అనలేదు. మీరు జనసేన భావజాలానికి మద్దతిస్తే మంచిది. లేకుంటే నేను తెగిస్తే మీకు మూలాలు ఉండవు. అక్కడిదాకా నన్ను తీసుకురావద్దు.

నా విషయంలో కుల ప్రస్తావన తెస్తారు. నేను సోషల్‌ ఐడియాలజీ కలిగినవాడిని. మురుగునీరు గోదావరిలో కలిసిపోతుంటే ఒక్కొక్కరినీ కూర్చోబెట్టి ఒక్కో కులానికీ చేయమని చెప్పగలమా? గోదావరి అందరిదీ కదా!

- ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

రాజమహేంద్రవరం, మే 26 (ఆంధ్రజ్యోతి): ‘నన్ను విమర్శించే కాపు నాయకులందరికీ.. 12 ఏళ్ల తర్వాత మౌనం వీడి చెబుతున్నాను. నేను వచ్చింది ఒక కులం కోసం కాదు’ అని జనసేనాని, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. సీఎం చంద్రబాబు ఒకరు నాశనం కావాలని కోరుకునే వ్యక్తి కాదని చెప్పారు. రెండోరోజు రాజమహేంద్రవరంలో పర్యటన అనంతరం మంగళవారం సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ జనసేన సాధకుల ఆత్మీయ సమావేశంలో మాట్లాడారు. ‘నన్ను కులపరంగా తిట్టింది చాలు. మాట్లాడితే వంగవీటి రంగా గారిని మధ్యలోకి తీసుకొస్తారు.


ఆయన సతీమణి కమ్మ సామాజికవర్గం. వారి బిడ్డలిద్దరూ ఈ రెండు కులాలకు చెందినవారు. మీ చూపు తీరు చాలా దారుణంగా ఉంది. కుల ప్రస్తావనతో నేనెప్పుడూ రాలేదు. చిన్నప్పుడు నేను స్కూలుకు వెళ్లినప్పుడు నా సహ విద్యార్థి తల్లి మీది ఏ కులమని అడిగితే.. ఇంటికొచ్చి నా తల్లిని అడిగాను. నా తల్లి నన్ను తిట్టింది. అందుకే నాకు కులం ముఖ్యం కాదు. చాలామంది ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. నా పక్కనున్న నాదెండ్ల మనోహర్‌ను కమ్మ అంటారు. మరొకరిని మరో కులం అంటారు. ఎందు కు..? ఆ కులాన్ని దాటి వెళ్లలేరా? ఓట్లు ఉంటే ఉంటాయి.. పోతే పోతాయి. కానీ ఇలాంటి పనికిమాలిన విశ్లేషణలు, విమర్శలు చేస్తే.. మీ నోళ్లు మూతపడే వరకూ అందరి చేతా మాట్లాడిస్తాను. జగన్‌ కులంలో గానీ, ఇతర కులాల్లో గానీ.. ఓడిపోతే కులం మార్చుకుంటానని ఎవరైనా అన్నారా? అసలు లోపల మీరు ఆలోచిస్తున్నారా? 2014 తర్వాత కులా ల ఐక్యత అనే సామాజికతను అర్థం చేసుకున్న వ్యక్తి నాదెం డ్ల మనోహర్‌. నా భావాలు నచ్చి మీతో ప్రయాణం చేస్తానని వచ్చారు’ అని స్పష్టంచేశారు. ఇంకా ఏమన్నారంటే..


ప్రధానితో అదే మాట్లాడతా..

మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలని నేను ప్రధాని వద్దకు పోతే.. నా వేలి ఉంగరం కూడా నాతోపాటు రాదు. దేశ భవిష్యత్‌ గురించే నా ఆలోచన.. ప్రధానితో అదే మాట్లాడతా. అంతేతప్ప.. మోదీగారూ! మా రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయండి సార్‌.. అమిత్‌షా గారూ చర్యలు తీసుకోండి సార్‌ అని అడుగుతానా? హాస్యాస్పదంగా లేదూ! సనాతన ధర్మం అంటే ఏదో మూర్ఖత్వం అన్నట్లుగా కొంతమంది అంటున్నారు. 33 వేల మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారంటే నన్ను విమర్శించారు. అదే కేంద్ర హోం శాఖ నిర్ధారించింది కదా! దేశం కోసం పోరాడతాం. ఎవడి వ్యక్తిగత జీవితమో మాకెందుకు? మేం నలిగి నలిగి ఇక్కడిదాకా వస్తే మీ పర్సనల్‌ కాంటాక్ట్స్‌తో దిగజార్చొద్దు. ఎమ్మెల్యేలకు అదే చెప్పాను. ప్రతిష్ఠ దిగజార్చొద్దని చెప్పాను. మీకు సమాజహితం ఆశయం లేకపోతే పార్టీలోకి రావొద్దు. తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణల్లో స్థానిక సంస్థల్లో మనవాళ్లు జెండా పెటుకుని గెలిచారు. కనీసం వాళ్లు నన్ను కలవలేదు. యుద్ధనౌక గద్దర్‌ దళిత కులానికి చెందిన గొప్ప కవి. ఆయనంటే నాకిష్టం. నా భావజాలం అలా ఉంటుంది.


మోదీ, ఆడపడుచులు నన్ను అర్థం చేసుకున్నారు

నా కోసం పనిచేసిన యువత బైక్‌ సైలెన్సర్లు పీకి హడావుడి చేసేవారు. ఈరోజు పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నారు. షేక్‌ హసీనాలాంటి మహిళలు, ఇళ్లలో నుంచి బయటకు రాని గృహిణులు నాకోసం పని చేస్తున్నారు. నన్ను నమ్మి నా వెంట నిలిచిన వీరమహిళలకు ధన్యవాదాలు. సగటు ఆడపడుచులు నన్ను అర్థం చేసుకున్నంతగా మోదీ నన్ను అర్థం చేసుకున్నారు. మళ్లీ ఎవరూ అంత అర్థం చేసుకోలేకపోయారు. రెండేళ్లుగా నా నవ్వు పోయింది. బాధ్యత అప్పగించిన తర్వాత బరువు పెరిగింది. 12 ఏళ్ల పోరాటం తర్వాత కూడా నన్ను విమర్శిస్తున్నారు. నేను ఏమి చేసినా సమస్యే. జుట్టు పెంచుకుంటే సమస్య.. గడ్డం పెంచితే సమస్య.. వాళ్ల టీఆర్‌పీలకు నేను రా మెటీరియల్‌ అయ్యాను. 12 ఏళ్లు నలిగిన తర్వాత వచ్చిన బలం, ఆత్మవిశ్వాసంతో తట్టుకుని నిలబడ్డాను. ఎన్నో లక్షల పెట్టుబడులు తెస్తున్నాను. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ మొదలుకొని ఫైటర్‌ ప్లేన్స్‌, గూగుల్‌ వంటి కంపెనీలు వస్తున్నాయంటే రాజమండ్రిలోనే దానికి మూలాలు పడ్డాయి.


నా స్ట్రక్చర్‌ని ఫాలో అవ్వండి..

జనసేన భావజాలం ఉన్న వాళ్లను రిక్రూట్‌ చేస్తాను. 2007-08లో అప్పటి యూత్‌కు రూపొందించిన స్ట్రక్చర్‌ ఈరోజు పార్టీకి దోహదపడింది. ఈరోజు ప్రతి నియోజకవర్గం, మండలంలో ఈ వ్యవస్థను ఎస్టాబ్లిష్‌ చేయబోతున్నాను. మండలంలో, నియోజకవర్గంలో ఇన్‌చార్జిగా పెట్టాలంటే చాలామంది సాధక్‌లు గానీ, ఉద్యమిలు గానీ ఇచ్చే ఫీడ్‌బ్యాక్‌ను బట్టే నిర్ణయం తీసుకుంటాను. 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఒక్కో స్థానానికి పక్క జిల్లా నుంచి చీఫ్‌ అబ్జర్వర్‌గా పంపిస్తాను. వాళ్లతోపాటు ముగ్గురు సాధకులు, సపోర్టుగా మరో 20 మంది సాధకులను పెడతాం. వీళ్లందరినీ కూర్చోబెట్టి విభాగాలవారీగా అభిప్రాయాలు సేకరిస్తాం. దానికి సంబంధించిన ఫార్మాట్‌ను పంపిస్తాం. ప్రతి నియోజకవర్గానికీ ఒక ఇన్‌చార్జి, సపోర్టింగ్‌ టీమ్‌గా నలుగురు కార్యదర్శులు, కోశాధికారితో ఒక టీమ్‌ నియమిస్తాం. కొద్దిరోజుల్లోనే ఈ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇది కేవలం దరఖాస్తులు స్వీకరించడానికి నియమించిన కమిటీ. దీనికి ఎటువంటి అథారిటీ ఉండదు. మీరు నిలకడగా ఉండి నేను చెప్పిన స్ట్రక్చర్‌ ఫాలో అవ్వండి, సామాజిక మార్పు ఎందుకు రాదో చూద్దాం. ఈ రోజు ఒక్కొక్కరూ 200 సభ్యత్వాలను తీసుకురాగలిగారు. నాదెండ్ల మనోహర్‌ నియోజకవర్గంలో టైలర్‌ నాగరాజు ఉదయం నుంచి సాయంత్రం 4 వరకూ పనిచేసుకుని, అటుపై ఇంటింటికీ వెళ్లి పార్టీ గురించి వివరించి సభ్యత్వాలు చేశారు. నాకు అందరూ గుర్తు. పదివేలు మొదలుకుని 2 వేల సభ్యత్వం చేసిన వారి వరకూ నాకు గుర్తే. మాకు 20 వేల మంది సాధకులు, 10 వేల మంది ఉద్యోగులు ఉన్నారు చాలు.


కుల ఆధారిత రాజకీయాలు..

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలు క్యాస్ట్‌ బేస్డ్‌ రిటన్‌ పాలిటిక్స్‌. ఇటువంటి వాటి మధ్య నేను మిమ్మల్ని కూర్చోబెట్టి సూచన ఇస్తున్నాను. అది ఫాలో అవ్వండి. లోపాలను ఎత్తి చూపి చర్చించే విభాగ విమోచన కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం. ఏదీ సంతలా ఉండకూడదు. క్రమశిక్షణ ఉండాలి. మీరు నన్ను నమ్మండి. మీరు అనుకున్నది జరుగుతుంది.. అంతేగానీ.. అలాకాదండీ.. మనకు కమ్యూనిటీలో చాలా చెడ్డపేరు వచ్చేస్తున్నదండీ అనే మాటలొద్దు. నేరాలు-ఘోరాలు మాదిరిగా ఆరోజు రాత్రి ఏం జరిగిందంటే.. అనొద్దు. 20 వేలకు పైబడి సాధకులు ఉన్నారు. మీ అందరి మొబైల్స్‌కు వాట్సాప్‌ గ్రూపులకు నా నుంచి మెసేజ్‌లు వస్తాయి. పార్టీ సెంట్రల్‌ ఆఫీసు నుంచి ఆదేశాలు వస్తాయి. తేనెటీగల సమూహం మాదిరి స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వండి. మీరు వందమంది కూర్చుని గొంతెత్తితే మీ ఎదుట ఏ రౌడీ నిలబడలేడు. మీ 20 వేల మంది గొంతెత్తితే 5 కోట్ల మందిని నడిపే యంత్రాంగం కదలాలి. అది మీకు నేను ఇస్తున్నాను. ఇంకా కులాలుగా, ప్రాంతాలుగా వేరు చేస్తామంటే కుదరదు. ఒంగోలు కమిటీ రద్దు చేశాను. అక్కడ సాధించిన ఫలితాలు తక్కువ. గోల, గొడవలు ఎక్కువ.


విశ్లేషకులపై కేసులు వద్దన్నాను..

విశ్లేషకుల విశ్లేషణలకు అర్థంపర్థం లేకుండా పోయింది. ఈరోజు కూడా కొందరు మాట్లాడారు. విశ్లేషణ చేసిన వారిపై కేసులు పెట్టారని తెలిసి ఉపసంహరించుకోవాలని మా వాళ్లకు చెప్పాను. మిమ్మల్ని తిట్టే వ్యక్తి ఇంట్లో పెళ్లికి మీరు వెళ్తారా? కానీ నేను వెళ్తాను. అంబటి రాంబాబు ఇంటికి కూడా పెళ్లికి వెళ్లాను. అది నా సంస్కారం. సీనియర్‌ విశ్లేషకుల్లాంటివాళ్లు ఒకటీ అరా పొరపాటు చేస్తారు. కానీ కొంతమంది అలాకాదు. నన్ను తిడుతున్నారు. బద్నాం చేస్తున్నారు. ఎన్ని రకాలుగా హింసించారంటే నా వ్యక్తిత్వాన్ని కించపరుస్తున్నారు. నాకు తె లుసు నన్ను విమర్శించేవారి గురించి నా వద్ద కూడా చాలా సమాచారం ఉంటుంది. తోలు ఒలిచేయాలనిపించినా.. నా ప్రవర్తన, నా బిహేవియర్‌ నన్ను నడిపిస్తాయి. మనం మాట్లాడితే.. మా ప్రాంతానికి అవమానం జరిగిందంటారు కొందరు. అంటే మీరు విశ్లేషిస్తే మేం మాట్లాడకూడదు. కులాలు మీ కన్వీనియెంట్‌, మతాలు మీ కన్వీనియెంట్‌, ప్రాంతాలు మీ కన్వీనియెంటే. మేం ఏదైనా మాట్లాడితే తప్పుగా అభివర్ణిస్తారు.

120 సెకన్లలోనే నిర్ణయం

సెప్టెంబరులో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు బయటకు రావాలంటే భయపడే పరిస్థితిలో నేను ఇక్కడకు వచ్చి ఒక అడుగు వేశాను. ఆ మార్పు రాజమండ్రిలోనే ప్రారంభమైంది. ఆరోజు నాకున్న సమయం తక్కువ. మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఇన్నేళ్లపాటు కష్టపడ్డారు. ఒక నగరానికి రూపకల్పన చేసిన బలమైన నాయకుడిగా ఆయన్ను చూశాను. రాజమండ్రి జైలు కట్టించిన చంద్రబాబును అదే జైలులో పెట్టారు. ఆయన జైలుకు వెళ్లిన సమయంలో చాలామంది నన్ను లీడ్‌ చేయమని.. అంతా నా వైపు తిరుగుతుందన్నారు. మనం ఎదగడం కోసం దిగజారిపోయే ఆలోచనతో పార్టీ పెట్టడమనేంత దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు. ఆ సమయంలోనే చంద్రబాబుకు సపోర్టుగా నిలబడ్డాను. నా ఎదుగుదల కంటే దేశం, రాష్ట్రం ఎదుగుదల, భద్రత చాలా ముఖ్యమనిపించింది. ఆయన్ను కలసి అండగా ఉండాలని నిర్ణయించుకున్నాను. జైలు గది నుంచి బయటకు వచ్చిన 120 సెకన్లలో నా నిర్ణయాన్ని చెప్పాను. అప్పుడు నేను దాటవేయొచ్చు. లేదా ప్రధానితో మాట్లాడిన తర్వాత నిర్ణయం చెబుతాను అనొచ్చు. కానీ నేను నా దేశం, నా నేల కోసమే ఆలోచించి ప్రకటించాను. బీజేపీ నాయకులు కూడా నాతో మాట్లాడినప్పుడు రాష్ట్రంలో అప్పుడున్న అరాచకం మీద మాట్లాడాను. వాళ్లు కూడా నా మీద నమ్మకంతో అంగీకరించారు. ఆ రోజు నేను తీసుకున్న నిర్ణయం ఈ రోజు వేల కోట్ల పెట్టుబడులకు నాంది పలికింది. అదీ నా చిత్తశుద్ధి.

Updated Date - May 27 , 2026 | 05:09 AM