ఉగాది నుంచి గ్రీన్ కవర్
ABN , Publish Date - Jan 21 , 2026 | 04:24 AM
రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే ‘గ్రీన్ కవర్’ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.
50ు పచ్చదనానికి కార్యాచరణ ప్రణాళిక
అమలులో శాఖలన్నీ భాగస్వామ్యం కావాలి
గ్రీన్ కవర్, గ్రేట్ గ్రీన్‌వాల్ ప్రాజెక్టుల్లో దేశీయ మొక్కలకు అధిక ప్రాధాన్యం
డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
అమరావతి, జనవరి 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే ‘గ్రీన్ కవర్’ ప్రాజెక్టులో అన్ని శాఖలు త్రికరణ శుద్ధిగా భాగస్వామ్యం కావాలని ఉపముఖ్యమంత్రి, అటవీ, పర్యావరణ శాఖల మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. ఈ లక్ష్య సాధనకు ఉగాది పండుగలోపు ఆన్ని శాఖలు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉగాది నుంచి గ్రీన్‌కవర్ ప్రాజెక్టు అమలు కావాలని నిర్దేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో గ్రీన్‌కవర్, గ్రేట్ గ్రీన్‌వాల్ ప్రాజెక్టులపై ఆయా శాఖల ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. కాలుష్యాన్ని నియంత్రించే మొక్కలు నాడటంతో పాటు తీర ప్రాంతాల్లో పెనుగాలులు, ఉప్పునీటిని తట్టుకునే మొక్కల పెంపకానికి పరిశ్రమల శాఖ సిద్ధం కావాలని సూచించారు. ‘గ్రీన్‌కవర్, గ్రేట్ గ్రీన్‌వాల్ ప్రాజెక్టుల్లో దేశీయ మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రాన్ని 50 శాతం పచ్చదనంతో నింపే ఈ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. 2047 నాటికి ఈ లక్ష్యాన్ని సాధించాలి. ఇందుకోసం 32.60 లక్షల ఎకరాల్లో మొక్కలు నాటాల్సి ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో 30 శాతం గ్రీనరీ ఉండగా, 2030 నాటికి 37శాతం పచ్చదనాన్ని నింపాలి. వచ్చే నాలుగేళ్లలో ఏడు శాతం గ్రీనరీ పెంచడానికి గాను దాదాపు తొమ్మిది లక్షల హెక్టార్లలో మొక్కలు నాటాలి. ఈ యజ్ఞంలో అన్ని శాఖలు తమవంతు పాత్ర పోషించాలి. 12 శాతం మొక్కలు నాటే బాధ్యతను ఉద్యానశాఖ స్వీకరించాలి. ప్రతి మొక్కా పర్యావరణ పరిరక్షణకు ఉపయోగపడాలి. అటవీ, పర్యావరణ, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, నీటి పారుదల, పాఠశాల విద్య, ఆర్‌అండ్‌బీ, వ్యవసాయ, పరిశ్రమల శాఖ, రైల్వే తదితర శాఖలు తమ పరిధిలో ఈ లక్ష్యాన్ని ప్రణాళికాబద్ధంగా తీసుకెళ్లాలి. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా మొక్కలు నాటాలి. 970 ఎకరాల తీర ప్రాంతంలో 40శాతం అటవీశాఖ పరిధిలో ఉండగా, మిగతా భూభాగంలోనూ గ్రీన్ కవర్ చేపట్టాలి. రైతుల భూముల్లో దీర్ఘకాల ఫలాలు ఇచ్చేలా పండ్ల మొక్కలు పెంచాలి. కాలువలు, చెరువుల గట్లపైనా తప్పనిసరిగా మొక్కలు నాటాలి. ఈప్రాజెక్టుకు నిధుల కేటాయింపుపై సీఎంతో చర్చిస్తాం. వచ్చే నెల 5న జరిగే సమావేశానికి ఆయా శాఖలు పూర్తిస్థాయి ప్రణాళికలతో రావాలి’ అని పవన్ దిశానిర్దేశం చేశారు.