Share News

Deputy Chief Minister Pawan Kalyan: అంజన్న దయతో పునర్జన్మ

ABN , Publish Date - Jan 04 , 2026 | 04:14 AM

కొండగట్టు అంజన్న(ఆంజనేయస్వామి) తమ ఇంటి ఇలవేల్పు అని.. గతంలో ఓ విద్యుత్‌ ప్రమాదం నుంచి ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

Deputy Chief Minister Pawan Kalyan: అంజన్న దయతో పునర్జన్మ

  • విద్యుత్‌ ప్రమాదం నుంచి కాపాడారు

  • గిరి ప్రదక్షిణ సాకారానికి కరసేవ చేస్తా

  • అంజన్న కృపతో 2 రాష్ట్రాలు బాగుండాలి

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

జగిత్యాల, జనవరి 3(ఆంధ్రజ్యోతి): కొండగట్టు అంజన్న(ఆంజనేయస్వామి) తమ ఇంటి ఇలవేల్పు అని.. గతంలో ఓ విద్యుత్‌ ప్రమాదం నుంచి ఆయన దయతోనే తనకు పునర్జన్మ లభించిందని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కొండగట్టు అంజన్న దయతో రెండు తెలుగు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. శనివారం తెలంగాణలోని జగిత్యాల జిల్లా మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానంలో రూ.35.19కోట్ల టీటీడీ నిధులతో దీక్ష విరమణ మండపం, 96 గదుల వసతి సముదాయ నిర్మాణ పనులకు భూమిపూజ చేశారు. హైదరాబాద్‌లోని బేగంపేట నుంచి చాపర్‌ ద్వారా జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి జేఎన్‌టీయూ కళాశాల వద్ద గల హెలిప్యాడ్‌కు చేరుకున్నారు. అనంతరం పవన్‌ కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం వద్ద పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. కొండగట్టులో ‘వాయుపుత్ర సదన్‌’ పేరిట 98 వసతి గదులు, సుమారు 2 వేల మంది హనుమాన్‌ దీక్ష విరమణ చేసేవిధంగా మండప నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్‌ మాట్లాడారు. గతంలో కొండగట్టు పర్యటన సందర్భంగా వసతి గదుల నిర్మాణం, అభివృద్ధి పనులకు హామీ ఇచ్చినట్లు తెలిపారు. సీఎం చంద్రబాబు, టీటీడీ సహకారంతో నిధుల మంజూరుకు కృషి చేశానన్నారు. తెలంగాణ ప్రభుత్వం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ మాస్టర్‌ప్లాన్‌ అమలుకు శ్రీకారం చుట్టడం హర్షణీయమని పేర్కొన్నారు. కొండగట్టు గిరి ప్రదక్షిణకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైతే తానే కర సేవకుడిని అవుతానన్నారు. అనంతరం పవన్‌ నాచుపల్లి సమీపంలోని బృందావనం రిసార్ట్‌కు చేరుకున్నారు. తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో జనసేన మద్దతుతో గెలిచిన 148 మంది సర్పంచ్‌లు, ఉపసర్పంచులు వార్డు మెంబర్లతో భేటీ అయ్యారు. తర్వాత జనసేన ముఖ్య కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. తెలంగాణ జన సైనికులకు అండగా ఉంటానని, ప్రతి ఒక్కరూ ప్రజల పక్షాన పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. కాగా, బృందావనం రిసార్ట్‌ దగ్గర పవన్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. తమను రిసార్ట్‌ లోపలికి అనుమతించాలంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగారు.

Updated Date - Jan 04 , 2026 | 04:14 AM