అల్లూరిది తెగువ.. త్యాగం.. దేశభక్తి
ABN , Publish Date - Jul 05 , 2026 | 06:04 AM
ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి.. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో..
గిరిజనుల హక్కుల కోసం ఆయన జీవితం అంకితం: పవన్
అమరావతి, జూలై 4(ఆంధ్రజ్యోతి): ప్రజల స్వేచ్ఛ కోసం బ్రిటిష్ పాలనను ధైర్యంగా ఎదిరించి.. గిరిజనుల హక్కులు, ఆత్మగౌరవం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన అల్లూరి సీతారామరాజు భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కొనియాడారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు ఘన నివాళులర్పించారు. ఆయన పోరాటం ఒక ఉద్యమం మాత్రమే కాదని, తెగువ, త్యాగం, దేశభక్తి ఎన్నటికి ఓడిపోవని ప్రపంచానికి చాటి చెప్పిన చరిత్ర అని ‘ఎక్స్’లో పోస్టు చేశారు. స్వేచ్ఛను కాపాడుకోవాలంటే బాధ్యతతో జీవించాలని, దేశాన్ని బలంగా నిలబెట్టాలంటే సేవాభావంతో ముందుకు సాగాలని, సమాజం కోసం నిలబడటమే నిజమైన దేశభక్తి అని అల్లూరి జీవితం మనకు నేర్పుతోందన్నారు. ఆ మహావీరుడి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని.. న్యాయం, సేవ, దేశభక్తి విలువలను ఆచరిస్తూ వికసిత్ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
వంగవీటి రంగాకు నివాళి..
పేదల పక్షాన నిలిచి, వారి గళమైన ప్రజా నాయకుడు వంగవీటి మోహన రంగా జయంతి సందర్భంగా ఆయనకు హృదయపూర్వకంగా నివాళి అర్పిస్తున్నానని మరో ప్రకటనలో పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.