అటవీ భూములను ప్రతి అంగుళం పరిరక్షించాలి
ABN , Publish Date - Aug 21 , 2026 | 05:07 AM
కర్ణాటక అటవీశాఖ అనుసరిస్తున్న తరహాలో అత్యాధునిక సాంకేతిక పరిపాలన వ్యవస్థను అందుబాటులోకి తేవడం ద్వారా రాష్ట్రంలోని అటవీ భూమిని ప్రతి అంగుళం పరిరక్షించేలా చర్యలు..
కర్ణాటక తరహాలో సాంకేతిక రక్షణ వ్యవస్థ
అరణ్యరామంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు
అమరావతి, ఆగస్టు 20(ఆంధ్రజ్యోతి): కర్ణాటక అటవీశాఖ అనుసరిస్తున్న తరహాలో అత్యాధునిక సాంకేతిక పరిపాలన వ్యవస్థను అందుబాటులోకి తేవడం ద్వారా రాష్ట్రంలోని అటవీ భూమిని ప్రతి అంగుళం పరిరక్షించేలా చర్యలు చేపట్టాలని డిప్యూటీ సీఎం, అటవీశాఖ మంత్రి పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అటవీశాఖ బృందం ఇటీవల కర్ణాటకలో పర్యటించి, అక్కడి అటవీ ఐటీ విభాగం అనుసరిస్తున్న విధానాలను అధ్యయం చేసి, పూర్తి వివరాలతో నివేదికను అందించింది. ఆ నివేదికను పరిశీలించిన పవన్ గురువారం అధికారులకు పలు సూచనలు చేశారు. కర్ణాటకలో సత్ఫలితాలిచ్చిన పలు విధానాలను రాష్ట్రంలోనూ అమలు చేయాలని సూచించారు. అడవిలో ప్రతి అణువు పర్యవేక్షించేలా.. కొత్తగా నిర్మిస్తున్న అరణ్యరామంలో ఆధునాతన ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధంచేయాలని ఆదేశించారు. జియో స్పేషియల్ డ్యాష్‌బోర్డు, డ్రోన్ ఆధారిత పర్యవేక్షణ, కెమేరా ట్రాప్‌ల ద్వారా వన్యప్రాణుల సంఖ్య లెక్కింపు, అటవీ మార్గాల్లో ప్రయాణించే వాహనాల ట్రాకింగ్, గస్తీ, అడవుల్లో అగ్ని ప్రమాదాలు, మానవ-వన్యప్రాణుల ఘర్షణ తదితర ఘటనలపై ఐసీసీసీ నుంచి పర్యవేక్షణ జరగాలని నిర్దేశించారు. అటవీశాఖ సిబ్బందిలో జవాబుదారీ తనం పెంచేలా కర్ణాటకలో మాదిరిగా ఈ-గస్తు మొబైల్ అప్లికేషన్ ఉపయోగపడుతుందన్నారు. అటవీ సరిహద్దు గ్రామాల్లో పంట నష్టానికి పరిహారం చెల్లించే ప్రక్రియను డిజిటలీకరణ చేయాలని పవన్ ఆదేశించారు.
కమిటీ నివేదికకు అసెంబ్లీ ఆమోదం
స్పీకర్ అయ్యన్నపాత్రుడు అధ్యక్షతన ఏర్పాటైన వన్యప్రాణి పర్యావరణ పరిరక్షణ కమిటీ సమర్పించిన తొలి నివేదికను శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. కమిటీ సభ్యులైన ఎమ్మెల్యేలు గోండు శంకర్, వేగేశ్న నరేంద్రవర్మరాజు నివేదికను గురువారం సభకు సమర్పించారు. నివేదికలో చేసిన సిఫారసులను శంకర్ వివరించారు. విశాఖలోని జంతు ప్రదర్శనశాల, విశాఖ బీచ్, కైలాసగిరిలను కలిపి పర్యాటక సర్క్యూట్‌గా ఏకీకృతం చేయాలన్నారు. ఖాళీ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అదనపు పశువైద్యులను, సిబ్బందిని నియమించాలని సూచించారు. విశాఖ జూ అభివృద్ధికి ఉత్తరాంధ్ర పార్లమెంటు నియోజకవర్గాల అభివృద్ధి నిధుల నుంచి ఏటా రూ.50లక్షలు సమీకరించాలని, తిరుపతి జూ అభివృద్ధికి టీటీడీ నిధుల నుంచి ఏటా రూ. 3 కోట్లు కేటాయించాలని సిఫారసు చేసినట్టు తెలిపారు.
ఎమ్మెల్యేలకు హైసెక్యూరిటీ స్మార్ట్ గుర్తింపు కార్డులు
శాసన సభ్యులందరికీ కొత్తగా హై సెక్యూరిటీ స్మార్ట్ గుర్తింపు కార్డులు జారీ చేయనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. సభ్యులందరూ నిర్దేశిత ఫారాన్ని నింపి శాసనసభ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. త్వరలోనే సభ్యులందరికీ కొత్త హై సెక్యూరిటీ స్మార్ట్ గుర్తింపు కార్డులు జారీ చేస్తామని చెప్పారు.