ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ
ABN , Publish Date - Jun 19 , 2026 | 04:14 AM
రాష్ట్రంలో పచ్చదనాన్ని 50శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు.
50 శాతం పచ్చదనం లక్ష్యంతో గ్రీనింగ్ సొసైటీ ఏర్పాటు
‘వీబీ-జీరామ్‌జీ’ పథకం కింద నర్సరీల పెంపకం
కొండల్లో చల్లేందుకు 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం
అటవీ శాఖ సమీక్షలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పచ్చదనాన్ని 50శాతానికి పెంచడమే లక్ష్యంగా ‘గ్రీనింగ్ సొసైటీ’ ఏర్పాటు చేయాలని డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. జూలై 3వ తేదీ నాటికి సొసైటీ ఏర్పాటు ప్రక్రియ పూర్తి కావాలన్నారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో అటవీశాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. పవన్ మాట్లాడుతూ ‘రాష్ట్రంలోని ప్రతి పంచాయతీలో ఒక నర్సరీ ఉండేలా చర్యలు తీసుకోవాలి. ఒకే పంచాయతీలో సాధ్యం కాకపోతే.. 3-4 పంచాయతీలను క్లస్టర్‌గా చేసి, ఉమ్మడిగా ఒక నర్సరీని ఏర్పాటు చేయాలి. వీబీజీ రామ్‌జీ పథకానికి నర్సరీల పెంపకాన్ని కూడా అనుసంధానించాం. ఈ పథకం ద్వారా లభించే నిధులు, పని దినాలను సమర్ధంగా వినియోగించుకుని, గ్రామీణ ప్రాంతాల్లో నర్సరీలను పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలి’ అని చెప్పారు. ఈ వర్షాకాలంలో రాష్ట్రవ్యాప్తంగా అటవీ, ఖాళీ ప్రాంతాల్లో చల్లడానికి 2.6 కోట్ల సీడ్ బాల్స్ సిద్ధం చేసినట్లు అటవీ అధికారులు ఆయనకు చెప్పారు. విద్యార్థులు, యువత, స్వచ్చంద సంస్థలు, స్థానిక ప్రజలను కలుపుకుని, దీనిని ఒక ప్రజా ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పవన్ సూచించారు. అంతరిస్తున్న అరుదైన వృక్ష జాతులను రక్షించేందుకు అటవీ శాఖ తీసుకుంటున్న ప్రత్యేక చర్యలపై పవన్ హర్షం వ్యక్తం చేశారు.
నేడు ‘అరణ్యరామం’ భవనానికి శంకుస్థాపన
మంగళగిరిలోని ఎయిమ్స్ సమీపంలో ’అరణ్యరామం’ పేరుతో అటవీశాఖ నిర్మించనున్న కామన్ ఫెసిలిటీ భవనానికి శుక్రవారం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. కార్యక్రమంలో మంత్రి లోకేశ్ పాల్గొననున్నారు.