తాగునీటి ఎద్దడికి చెక్ పెడదాం
ABN , Publish Date - Jul 23 , 2026 | 04:39 AM
ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నందున రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా..
పల్నాడు-ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనులు
వేగవంతం చేయండి.. ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం
పనుల నాణ్యతను స్వయంగా పరిశీలిస్తా
ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో డిప్యూటీ సీఎం పవన్ సమీక్ష
అమరావతి, జూలై 22(ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటున్నందున రాష్ట్రవ్యాప్తంగా అధిక ప్రాంతాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనే అవకాశం ఉందని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. బుధవారం పల్నాడు-ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులతో ఆయన సమీక్షించారు. నీటి ఎద్దడి తీవ్రంగా ఉండే పల్నాడు, ప్రకాశం లాంటి ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించాలని దిశానిర్దేశం చేశారు. జల్‌జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకంలో భాగంగా ఈ ప్రాంతాల్లో చేపట్టిన మెగా వాటర్ గ్రిడ్ పథకాల పనులు నిర్ణీత గడువులోగా పూర్తికావాలని ఆదేశించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిని అధికారులు ఆయనకు వివరించారు. రెండు మెగా ప్రాజెక్టుల అంచనా వ్యయం దాదాపు రూ.2,500 కోట్లు. అనంతరం పవన్ మాట్లాడుతూ పల్నాడు, ప్రకాశం ప్రాంతాల్లో జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టిన అమరజీవి జలధార మెగా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులను నిర్ణీత గడువులోగా పూర్తిచేసి లక్ష్యాలకు అనుగుణంగా ప్రతి ఇంటికీ తాగునీటి సౌకర్యం అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భుజం శస్త్రచికిత్స నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాత పనుల పురోగతిని పరిశీలించేందుకు క్షేత్రస్థాయి పర్యటనలు చేపడతానని తెలిపారు. స్వయంగా పనుల నాణ్యతను పరిశీలిస్తానని, పనుల్లో అలసత్వానికి తావివ్వొద్దని స్పష్టం చేశారు.