పునరావృతం కానివ్వం
ABN , Publish Date - Jun 10 , 2026 | 05:58 AM
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో, పరవాడ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
కార్మిక సంఘాల్లో చిత్తశుద్ధి లోపం.. రాజకీయాలు తగవు
సంఘాలతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తాం : పవన్
ఆస్పత్రిలో క్షతగాత్రులకు ఉప ముఖ్యమంత్రి పరామర్శ
విశాఖపట్నం, జూన్ 9(ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్‌లో, పరవాడ ఫార్మా కంపెనీల్లో ప్రమాదాలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. స్టీల్ ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించడానికి ఆయన మంగళవారం విశాఖపట్నం వచ్చారు. మొదట కిమ్స్ ఐకాన్ ఆస్పత్రికి, అక్కడి నుంచి స్టీల్ ప్లాంట్‌కు, ఆ తరువాత సెవెన్ హిల్స్ ఆస్పత్రికి వెళ్లి బాధితులను పరామర్శించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ గేటు వద్ద విలేకరులతో మాట్లాడారు. ల్యాడిల్‌లో హాట్ మెటల్ పేలడమనేది గత 36 ఏళ్లలో ఎక్కడా జరగలేదని, ఇలా ఎందుకు జరిగిందో విచారణలో తేలుతుందని చెప్పారు. కేంద్రం నియమించిన త్రిసభ్య కమిటీ వచ్చి దర్యాప్తు చేపట్టిందని తెలిపారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మరణించిన రెగ్యులర్ ఉద్యోగులకు రూ.1.72 కోట్లు, కాంట్రాక్టు సిబ్బందికి రూ.45.75 లక్షలు ఇస్తున్నారని, ఇవికాకుండా రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా వస్తుందని వివరించారు. క్షతగాత్రులకు రూ.10లక్షల పరిహారం, ఉచిత వైద్యం అందిస్తారని చెప్పారు. క్వార్టర్స్ సదుపాయంతో పాటు వారి పిల్లల్ని చదివిస్తారని తెలిపారు. ప్రమాదం కారణాల గురించి మాట్లాడుతూ, ఫ్యాక్టరీస్ అధికారులు 6నెలల క్రితం తనిఖీలు నిర్వహించి లోపాలు ఉన్నాయన్నారని చెబుతున్నారని, దానిపై యాజమాన్యం ఎటువంటి చర్యలు చేపట్టిందో తెలియదని అన్నారు.
ఈ ప్లాంట్‌ను వైసీపీ హయాంలో ప్రైవేటు సంస్థలకు అమ్మాలని యత్నించినపుడు తాను ఇక్కడికొచ్చి ధర్నా చేశానని పవన్ గుర్తుచేశారు. ఆ తరువాత కూటమి ప్రభుత్వం వచ్చాక అంతా కలిసి ఢిల్లీలో మాట్లాడి ప్యాకేజీ ఇచ్చామని పేర్కొన్నారు. ప్లాంట్‌లో సమస్యలు ఏమున్నాయో, ఎందుకు ప్రమాదాలు జరుగుతున్నాయో కార్మిక సంఘాలతో మాట్లాడి తెలుసుకుంటానని చెప్పారు. తర్వాత వారితో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. సంఘాలు కార్మిక సంక్షేమం కోసం కాకుండా రాజకీయాలు చేస్తున్నాయా అనే అనుమానం కలుగుతోందన్నారు. వైసీపీ హయాంలో ఏమీ మాట్లాడకుండా వారితో కలిసిపోయిన నేతలు ఇప్పుడు అవి కావాలి, ఇవి కావాలని అడుగుతున్నారని, ప్రభుత్వాలను బట్టి కార్మిక సంఘాలు వైఖరి మార్చుకోవడం తగదని సూచించారు.
194 సెక్షన్ కింద కేసు నమోదు
ప్రమాదంపై స్టీల్‌ప్లాంటు పోలీసులు బీఎన్‌ఎస్ఎస్ 194 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. అసాధారణ మరణాలు/ఆత్మహత్యలు/ ప్రమాద మరణాలను ఈ సెక్షన్ కింద నమోదు చేస్తారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు.