త్రికరణశుద్ధితో మద్దతిస్తా!
ABN , Publish Date - May 16 , 2026 | 03:57 AM
‘‘నేను మద్దతు ఇచ్చినప్పుడు త్రికరణశుద్ధితో ఇస్తాను. తిరిగి వారి దగ్గర నుంచి అదే ఆశిస్తాను. కూటమిలో క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల సమస్యలున్నాయి.
కూటమిలో ఉన్నవి చిన్న చిన్న సమస్యలే
ఆత్మగౌరవానికి భంగం కలగనివ్వను
పదవుల కోసం కాదు... ప్రజల కోసమే ‘కూటమి’లోకి
జనసేనలో లక్ష్యదళ్, కార్యనిర్వాహక దళ్, పరిపాలక దళ్
ఏపీని తమిళనాడుతో పోల్చొద్దు
‘ఉద్యమి’ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్
అమరావతి, మే 15 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను మద్దతు ఇచ్చినప్పుడు త్రికరణశుద్ధితో ఇస్తాను. తిరిగి వారి దగ్గర నుంచి అదే ఆశిస్తాను. కూటమిలో క్షేత్రస్థాయిలో కొన్ని చోట్ల సమస్యలున్నాయి. వాటిని పరిష్కరిస్తాం’’ అని జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వాలు 21 లక్షలు పూర్తైన సందర్భంగా శుక్రవారం మంగళగిరిలో ‘ఉద్యమి’ ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించిన ఆయన... నాయకులు, కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. పార్టీ కోసం సమయం కేటాయిస్తానని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని... కూటమి ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలని సూచించారు. పవన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే...
ఊళ్లో పెళ్లికి.. హడావిడి..
‘‘ఈ మధ్య పక్క రాష్ట్రంలో(తమిళనాడు) ఒక రు పార్టీ పెట్టి విజయం సాధించి, ముఖ్యమంత్రికాగానే.. ఏపీలో చాలా మంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని మెసేజ్‌లు పంపిస్తున్నారు. ఊళ్లో పెళ్లికి ఏదో హడావిడి అన్నట్లు ఉంది. మన ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు వేరు. వీళ్లు చెప్పినట్లు 2019 లో ఒంటరిగా ఎన్నికల్లో నిలబడితే రెండుచోట్లా ఓడించారు. కాబట్టి, అవతలి వారితో పోల్చవద్దు. 11 సీట్లకు పరిమితమైన వారు కూడా మనపై సెటైర్లు వేస్తారా? నిజంగానే నేను పదవే ప్రధానం అనుకుం టే 2008లోనే ఎంపీగా పోటీ చేసేవాడిని. 2014లో ఎన్డీయే కూటమిలో ఉన్నప్పుడు మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. కానీ, నేను ఒక పార్టీని నడపాలి. అందుకే, దశాబ్దం పాటు నలగాల ని నిర్ణయించుకున్నా. ఈ రోజు అందరూ నన్ను వదిలేసినా నేను పార్టీని ధైర్యంగా ముందుకు తీసుకువెళ్లగలను. 2024లో టీడీపీ వైపు వెళ్లకుండా ఉంటే బాగుండేదని నా చెవిలో ఊదరగొడుతున్నారు. నేను చాలా ఆలోచించి ఆ నిర్ణయం తీసుకున్నాను.
అప్పుడు బాధేసింది..
చంద్రబాబును జైలులో పెట్టినప్పుడు ఏపీలో కీలకమైన పరిస్థితి. నేను ఆ రోజు జైలులో కలిసినప్పుడు.. కూటమిలో చేరాలనే నిర్ణయం తీసుకుని, తర్వాత స్వార్థంతో వెళ్లిపోవచ్చు. కానీ, రాష్ట్రం కోసం ఎంతో కష్టపడ్డ చంద్రబాబును అలా చూడడంతో బాధనిపించింది. ఆ సమయంలో ఏపీ ఐసీయూలో ఉంది. ఆరోజు తీసుకున్న నిర్ణయం చాలా కీలకం. మరోసారి వైసీపీ వస్తే ఈసారి ఎవ్వరినీ బతకనివ్వరు. ఇంట్లో ఆడపిల్లల్ని కూడా లాగేస్తారు. ఇంట్లో ఉన్న నా పిల్లల గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఏం చేయాలి? ఆ సమయంలో పదవులు, గుర్తింపు కంటే రాష్ట్ర సుస్థిరతకు, భవిష్యత్తుకే ప్రాధాన్యం ఇచ్చాను. కూటమిలో మెజార్టీ నియోజకవర్గాల్లో బాగానే ఉంది. అక్కడక్కడ కొన్ని సమస్యలున్నాయి. వాటిని కమిటీ చూసుకుంటుంది. సంప్రదాయ రాజకీయాలు వర్సెస్ జనసేన అనేలా భవిష్యత్తులో ఉంటుంది. జనసేన పార్టీని దేశంలో మిగిలిన రాజకీయ పార్టీలతో పోల్చలేరు. జనసేన లెఫ్ట్ వింగ్ కాదు.. రైట్ వింగ్ కాదు. రెండింటిలో ఉన్న మంచి ఆలోచలను సమన్వయం చేస్తూ ఒక ‘మిడిల్ పాథ్ కమిటెడ్ ఐడియాలజీ పార్టీ’.
జనసేన దళాలు..
జనసేన పార్టీలో మూడు కీలక విభాగాలను ఏర్పాటు చేస్తున్నాం. లక్ష్యదళ్ పేరుతో క్షేత్రస్థాయిలో పని చేసే ప్రధాన బలాన్ని, బలగాన్ని తయారు చేస్తాం. క్షేత్రస్థాయిలో గుర్తించే అంశాల మీద, పార్టీ విధానాన్ని ముందుకు నడిపించేలా జనసేన పార్టీ నిర్వాహక దళ్ ఏర్పాటవుతుంది. లక్ష్యదళ్, నిర్వాహక్ దళ్‌తో సమన్వయం చేసుకుంటూ పరిపాలనపరమైన విధానాల కోసం పరిపాలక దళ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా ఇన్‌చార్జిలతో ఫైవ్ మెన్ కమిటీని ఏర్పాటు చేస్తాం. లక్ష్య దళ్, నిర్వాహక దళ్, పరిపాలక దళ్ పునాదులపైనే జనసేన పార్టీ నిర్మాణం ఉంటుంది. ఆరెస్సెస్, బీజేపీలలో కీలక పదవుల్లో పని చేసి, ఆ తర్వాత తిరిగి కార్యకర్తలుగా వెళ్లిపోతారు. అలానే పార్టీలో పరిపాలక దళ్‌లో పని చేసిన వారు తిరిగి లక్ష్య దళ్ కు వెళ్లి పని చేయాల్సి ఉంటుంది. వీరితో పాటు ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్‌చార్జి ఉంటారు. నన్ను కులానికి, ప్రాంతానికి పరిమితం చేయాలని చూశారు. నేను ఒక కులంలో పుట్టాను. కానీ, ఆ కులం కోసం పని చేయడానికి రాలేదు. దేశం కోసం పని చేయడానికి, ఈ మధ్య వైసీపీ నాయకులు మీరు కాపులకు ఏం చేశారని మాట్లాడుతున్నారు. నేను అందరూ బాగుండాలని ఆలోచిస్తాను. మాట్లాడితే వంగవీటి రంగా గురించి ప్రస్తావిస్తారు. ఆయన తనకు ప్రాణహాని ఉందన్నప్పుడు... ఇప్పుడు మాట్లాడుతున్న వారంతా ఏమైపోయారు? ఇప్పుడు కథలు చెబితే మిమ్మల్ని ఎవరు నమ్ముతారు. సమాజాన్ని కులాల వారీగా విభజించి ముందుకు వెళ్లలేం. అన్ని కులాల్ని కలుపుకొని ముందుకు వెళ్తేనే సమాజం అభివృద్ధి చెందుతుంది. అదే జనసేన పార్టీ విధానం. నా ఆరోగ్యం ఇప్పుడు చాలా బాగుంది. కరోనా సమయంలో సోకిన ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ పోలేదు. ఇక... ఎన్నికలు, తర్వాత దుమ్ము ధూళిలో తిరగడం వల్ల సైన్‌సలో డస్ట్ పేరుకుపోయింది. ఇప్పుడు అందరి ఆశీర్వచనాల వల్ల నేను బాగానే ఉన్నాను.
హిందువులే లడ్డూ కల్తీ చేశారు..
అన్ని మతాలనూ గౌరవించాలి. టోపీ పెట్టుకుని మాట్లాడితే ముస్లింలు ఓటు వేస్తారంటే నేను నమ్మను. జనసేన ఏ మతం వారు తప్పు చేసినా తప్పుగానే చెబుతుంది. హిందూమతాన్ని గౌరవించని హిందువులంటే నాకు చిరాకు. తిరుపతి లడ్డూ కల్తీ చేసింది అంతా హిందూవులే. భాషలను గౌరవించే సంప్రదాయాన్ని జనసేన పార్టీ పాటిస్తుంది. బంగ్లాదేశ్‌లో హిందువులపై దాడి జరిగితే అందరూ ఖండించాలి. నాయకులంతా జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంచుకోవాలి.