Share News

శాస్త్రీయ పరిశోధనల కేంద్రంగా అరణ్యారామం

ABN , Publish Date - Jun 20 , 2026 | 04:34 AM

రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నిర్మించనున్న ‘అరణ్య రామం’ భవనానికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు.

శాస్త్రీయ పరిశోధనల కేంద్రంగా అరణ్యారామం

  • అటవీ, పర్యావరణ శాఖలకు కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌

  • మంగళగిరిలో నూతన భవన నిర్మాణానికి డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ భూమిపూజ

అమరావతి, తాడేపల్లి టౌన్‌, జూన్‌ 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖల పరిశోధన, శిక్షణ కార్యక్రమాల పర్యవేక్షణ కోసం నిర్మించనున్న ‘అరణ్య రామం’ భవనానికి డిప్యూటీ సీఎం, అటవీ శాఖ మంత్రి కొణిదెల పవన్‌కల్యాణ్‌ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మంగళగిరిలోని ఎయిమ్స్‌ సమీపంలో బ్రహ్మానందపురం వద్ద రూ.24కోట్లతో నిర్మించనున్న ఈ భవన నిర్మాణానికి మంత్రులు నాదెండ్ల మనోహర్‌, కందుల దుర్గేశ్‌తో కలిసి పవన్‌కల్యాణ్‌ భూమిపూజ చేశారు. రాష్ట్రంలో అటవీ, పర్యావరణ శాఖలకు సంబంధించిన పరిశోధనలు, శిక్షణ కార్యకలాపాలతోపాటు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలన్నింటినీ సమన్వయం చేసే కామన్‌ ఫెసిలిటీ సెంటర్‌గా ఈ అరణ్య రామం వేదిక కానున్నది. భూమిపూజ అనంతరం హనుమాన్‌ గ్యాలరీ, అరణ్య రామం భవన నమూనా, భవన నిర్మాణ ప్రదేశాన్ని పవన్‌కల్యాణ్‌ పరిశీలించారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్స్‌ వివరాలతో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను తిలకించారు. ఈ సందర్భంగా పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ ఒక్క ఏడాది(2024)లోనే 185 వన్యప్రాణి రక్షణ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. నిబద్ధతతో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అభినందించారు.


నందనవనానికి శ్రీకారం

మైనింగ్‌తో పర్వావరణ విధ్వంసం జరిగిన ప్రాంతంలో ప్రకృతికి పునర్జీవం పోసే కార్యక్రమాన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రారంభించారు. దేశవాళీ మర్రి మొక్కను నాటి నందనవనానికి ప్రాణం పోశారు. 2013 నుంచి ఆ ప్రాంతంలో చేపట్టిన మైనింగ్‌ కార్యకలాపాలతో కొండ భాగం, అటవీ భాగం తీవ్రంగా దెబ్బతిన్నాయి. పర్యావరణ విధ్వంసం జరిగింది. ఆ ప్రాంతంలో ప్రకృతిని పునరుజ్జీవింప చేసే బృహత్తర కార్యక్రమాన్ని పవన్‌ మొదలు పెట్టారు. రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించడం, ప్రకృతి వనరుల పునరుద్ధరణ ద్వారా భావితరాలకు స్వచ్ఛమైన గాలి, వనరులతో కూడిన వాతావరణాన్ని అందించాలన్న లక్ష్యంతో నందనవనం కాన్సెప్ట్‌ ముందుకు తీసుకెళ్తుందని పవన్‌ స్పష్టం చేశారు. అటవీశాఖ ముఖ్యకార్యదర్శి కాంతిలాల్‌ దండే, సలహాదారు మల్లికార్జునరావు, పీసీసీఎఫ్‌ చలపతిరావు, రాష్ట్ర వైద్య సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ శ్రీనివాసరావు, పోలీస్‌ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్‌ శివశ్రీనివాస్‌, పీసీబీ చైర్మన్‌ కృష్ణయ్య, జీవవైవిధ్య మండలి చైర్మన్‌ విజయ్‌కుమార్‌, శాస్త్ర, సాంకేతిక మండలి సభ్య కార్యదర్శి శరత్‌కుమార్‌, కలెక్టర్‌ సాయికాంత్‌వర్మ, ఎస్పీ వకుళ్‌ జిందాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 04:35 AM