Share News

హస్తకళల పరిరక్షణే ధ్యేయం

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:19 AM

రాష్ట్రం లో ఏర్పాటు చేస్తున్న క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకుల వల్ల 5 వేల హస్తకళా కుటుంబాలకు ముడి సరుకు కొరత నుంచి విముక్తి లభిస్తుందని, ఆర్థికంగా నిలదొక్కుకుంటారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పారు.

హస్తకళల పరిరక్షణే ధ్యేయం

  • ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ ప్రకటన

  • ధవళేశ్వరంలో సెంట్రల్‌ క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంక్‌ ప్రారంభం

  • రాష్ట్రంలో మరో ఆరు ఉడ్‌ బ్యాంకులు కూడా..

రాజమహేంద్రవరం, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం లో ఏర్పాటు చేస్తున్న క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకుల వల్ల 5 వేల హస్తకళా కుటుంబాలకు ముడి సరుకు కొరత నుంచి విముక్తి లభిస్తుందని, ఆర్థికంగా నిలదొక్కుకుంటారని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సమీపంలో ఏర్పాటు చేసిన సెంట్రల్‌ క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంక్‌ను శనివారం ఆయన ప్రారంభించారు. అలాగే, రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఆరు క్లస్టర్లను వర్చువల్‌గా ప్రారంభించారు. అటవీశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఏటికొప్పాక, కొండపల్లి, బొబ్బిలి, మాధవమాల, శెట్టిగుంట, తూర్పు మన్యం కళాకృతులను సతీమణి అన్నా కొణిదెలతో కలిసి పవన్‌ తిలకించారు. స్టాళ్లలోని కళాకారులతో మాట్లాడారు. ముడి సరుకు ప్రస్తుత లభ్యత, హస్తకళాకారుల కుటుంబాలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. అనంతరం పవన్‌ మాట్లాడుతూ మన సంస్కృతి, వారసత్వ సంపదైన హస్తకళల పరిరక్షణే ధేయంగా క్రాఫ్ట్‌ ఉడ్‌ బ్యాంకులను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. వీటి వల్ల కళాకారులు సులభంగా, అందుబాటు ధరలో ముడి సరుకును పొందడంతో అద్భుతమైన కళాకృతులు ఎక్కువగా ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. కళాకృతులు, దుంగలపై ఏర్పాటు చేసిన క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేసి వివరాలను తెలుసుకున్నారు. ఆయన బయటకు వస్తున్న సమయంలో ప్రధాన గేటు విరగడంతో అధికారులు ఆందోళన చెందారు. ఆ ప్రదేశం నుంచే పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అభివాదం చేసి కారెక్కారు. అప్పటికే జ్వరంతో బాధ పడుతుండడంతో కారు ఎక్కే సమయంలో కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అనంతరం హోటల్‌కు చేరుకున్నారు. జ్వరం ఎక్కువ కావడంతో వ్యక్తిగత వైద్యుడు పరీక్షించారు. కాసేపు విశ్రాంతి అనంతరం హైదరాబాద్‌కు బయలుదేరారు.

Updated Date - Aug 16 , 2026 | 05:20 AM