Share News

వ్యక్తిగత వ్యవహారాలతో.. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు

ABN , Publish Date - May 24 , 2026 | 04:10 AM

‘‘మీ వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. వాటి ప్రభావం పార్టీపై ఒక్కశాతం కూడా పడకూడదు.

వ్యక్తిగత వ్యవహారాలతో.. పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీయొద్దు

  • మీ సమస్యలు మీరే పరిష్కరించుకోండి

  • ఎమ్మెల్యేలు శ్రీధర్‌, బాలరాజుకు పవన్‌ క్లాస్‌

  • విప్‌ పదవికి రైల్వేకోడూరు ఎమ్మెల్యే రాజీనామా

  • కుటుంబ జోక్యం నివారణకు గడువు కోరిన చిర్రి

  • నెల రోజులు చూస్తామన్న జనసేన అధినేత

అమరావతి, మే 23(ఆంధ్రజ్యోతి): ‘‘మీ వ్యక్తిగత వ్యవహారాలతో పార్టీకి చెడ్డపేరు తీసుకురావద్దు. మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి. వాటి ప్రభావం పార్టీపై ఒక్కశాతం కూడా పడకూడదు. మరోసారి ఇవి పునరావృతం కావడానికి వీల్లేదు.’’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇద్దరు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. శనివారం ఆయన తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుతో మంత్రి నాదెండ్ల మనోహర్‌తో కలిసి సుదీర్ఘంగా చర్చించారు. గత నాలుగైదు నెలలుగా సోషల్‌ మీడియాలో శ్రీధర్‌కు సంబంధించిన వీడియోలు, వాయిస్‌ కాల్స్‌ వైరల్‌ అయ్యాయి. ఈ నేపథ్యంలో అప్పట్లోనే ఆయనను పార్టీ కార్యాలయానికి, కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలని ఆదేశించారు. అనంతరం త్రిసభ్య కమిటీ వేసి.. ‘అసలేం జరిగిందో’ తెలుసుకున్నారు. ఇప్పుడు నేరుగా పిలిచారు. ఈ నేపథ్యంలో శ్రీధర్‌ సదరు వివాదాలపై వివరణ ఇవ్వడంతో పాటు తన వల్ల కూటమి ప్రభుత్వానికి, జనసేన పార్టీకి ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఉండేందుకు తన విప్‌ పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా పత్రాన్ని పవన్‌కల్యాణ్‌కు అందించారు. వ్యక్తిగత కారణాలతో విప్‌ పదవికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు.


నాలుగు వారాల గడువు

అనంతరం పవన్‌ కల్యాణ్‌తో ఎమ్మెల్యే బాలరాజు భేటీ అయ్యారు. తన వ్యక్తిగత విషయాలను కుటుంబ సభ్యులతో చర్చించి చక్కదిద్దుకొనేందుకు కొంత గడువు ఇవ్వాలని కోరారు. దీంతో 4 వారాల్లోగా సమస్యలు చక్కదిద్దుకోవాలని పార్టీ అధినేత గడువు ఇచ్చారు. అదేవిధంగా పోలవరం పరిధిలోని పంచాయతీల్లో రూ.147 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించారు. పనులు సకాలంలో పూర్తి చేయకపోవడంపై ప్రశ్నించారు. అధికారులను సమన్వయం చేసుకుంటూ పనులను వేగవంతం చేస్తానని, వ్యక్తిగత వ్యవహారాలు చక్కదిద్దుకుంటానని బాలరాజు చెప్పారు. వీరితో పాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న మరో ఇద్దరు, ముగ్గురు ఎమ్మెల్యేల నుంచి వివరణ తీసుకోవాలని పవన్‌ భావిస్తున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఆశించిన స్థాయిలో లేదు. ముఖ్యంగా ప్రజల సమస్యలు గుర్తించి, వాటిని పరిష్కరించే విధంగా మెజార్టీ ఎమ్మెల్యేలు దృష్టి పెట్టడం లేదు.

అధినేత విశ్వాసాన్ని వమ్ము చేయను

బాలరాజుకు కుటుంబ సభ్యుల ప్రమేయం తీవ్ర ఇబ్బందిగా మారింది. దీనిపై వివరణ ఇచ్చిన ఆయన.. పవన్‌ కల్యాణ్‌కు ధన్యవాదాలు తెలుపుతూ లేఖ విడుదల చేశారు. ‘‘అన్నీ చక్కదిద్దుకొని పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనేందుకు 4 వారాల వ్యవధిని కోరాను. నా వ్యక్తిగత వ్యవహారాలను.. పార్టీకి ముడిపెట్టవద్దని మరోసారి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా.’’ అని అందులో పేర్కొన్నారు.

Updated Date - May 24 , 2026 | 04:12 AM