ఇక భరించను
ABN , Publish Date - May 26 , 2026 | 04:03 AM
చర్యకు ప్రతి చర్య ఉంటుంది.. కర్మ ఎవరినీ వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్లకు తగలక తప్పదు. అది మంచైనా, చెడైనా.. అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు.
అడ్డగోలుగా మాట్లాడితే పర్యవసానాలు తప్పవు: పవన్
దారినపోయే ప్రతి ఒక్కడూ రాళ్లేద్దామంటే ఊరికే ఉండం
జగన్ జైలుకు పోవాలని కోరానట , అమిత్‌షా క్లాస్ తీసుకున్నారట
ఒకరు జైలుకెళ్తే జనసేన ఎదుగుతుందా?.. క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? సుప్రీంకోర్టు జడ్జీలకు తెలియదా?
ఇది నన్ను, అమిత్‌షాను కాదు.. వ్యవస్థను అవమానపరచడమే
బీజేపీ వాళ్లు కూడా ఖండించకపోవడం బాధేసింది
పవన్‌ను ఏమైనా అనేయొచ్చు
మనమేదైనా అంటే కులం, ప్రాంతం గుర్తొచ్చేస్తాయి
ఇష్టానుసారం మాట్లాడితే మాకు కోపాలు రావా?
అభిమానులందరూ ఏకతాటిపై ఉండడంతో తమిళనాడులో ఒక హీరో సీఎం అయ్యాడు
ఇక్కడ సినిమాపరంగా ఇష్టపడ్డా పాలిటిక్స్‌లో కులం వచ్చేస్తుంది
కూటమి కోసం కొన్నిసార్లు సర్దుకుంటా
ఒక పార్టీ కోసం కాదు.. 5 కోట్ల ప్రజల కోసం భరిస్తా
కార్యకర్తల భేటీలో జనసేనాని
రోడ్డునపోయే ప్రతి ఒక్కడూ అంటూ ఉంటే మేమెందుకు భరిస్తాం. భరించినంత కాలం భరించాం. చాలా ఏళ్ల కిందట ఒక మాట చెప్పాను. భరిస్తాం.. సహిస్తాం.. అవసరమైతే తాటతీస్తామని!
మీరు ఎంత యుద్ధం కావాలనుకుంటే అంత యుద్ధం ఇవ్వగలను. అది మీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. విజ్ఞత, విచక్షణ ఉన్నవాడిని కాబట్టి పరిధిలోమాట్లాడతాను. స్థాయి దాటితే ఎవరినీ లెక్క చేయను.
నేను చెబుతాను.. మీరు (జనసైనికులు) ఫాలో కావాలి. లేదంటే ఉండొద్దు. మీరు నన్ను సేనాని అన్నారు. మీ సేనాని చెప్పింది మీరు వినాలంతే!
- డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
రాజమహేంద్రవరం, మే 25 (ఆంధ్రజ్యోతి): చర్యకు ప్రతి చర్య ఉంటుంది.. కర్మ ఎవరినీ వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్లకు తగలక తప్పదు. అది మంచైనా, చెడైనా.. అని జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ అన్నారు. సోమవారం రాత్రి రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల కొద్దికాలంగా తనపైన, జనసేనపైన జరుగుతున్న చర్చలకు ఆయన గట్టిగా సమాధానమిచ్చారు. ప్రధానంగా సామాజిక, రాజకీయ విశ్లేషకుడు నాగేశ్వర్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన ప్రస్తావించారు. ‘సర్దార్ పటేల్ తర్వాత కేంద్రమంత్రి అమిత్‌షా చాలా శక్తివంతమైనవారు. ఆయన్ను దగ్గరగా చూశాను.
ఆయనకు నేనేదో చెప్పానంట.. ఆయన నన్ను తిట్టారంట.. వీళ్లు అది విన్నారంట! నేను, అమిత్‌షా మాట్లాడుకున్నామని ఇటీవల ఒక విశ్లేషకుడు అన్నారు. ఆయన పక్కనే ఉండి విన్నట్లు మాట్లాడారు. ఆ విశ్లేషకుడంటే నాకు చాలా గౌరవం. వాళ్లింట్లో పెళ్లికి కూడా వెళ్లాను. రోడ్డుమీద వెళ్లేవారు మాట్లాడితే వేరుగా ఉంటుంది. కానీ క్రెడిబిలిటీ ఉన్న విశ్లేషకుడు ఇలా మాట్లాడితే ఎలా’ అని ప్రశ్నించారు. ఎన్ని సార్లు తనను వ్యక్తిత్వ హననం చేసినా పట్టించుకోనని.. కానీ అమిత్‌షా పేరు ప్రస్తావించడంతో ఖండించాలనిపించిందని తెలిపారు. బీజేపీలో ఇంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉన్నారని.. వారు ఖండించకపోవడం నిజంగా బాధేసిందన్నారు. ‘వైసీపీ నాయకుడు జైలుకు వెళ్లిపోవాలి.. అరెస్టు చేయాలని చెబితే, అమిత్‌షా నాకు క్లాస్ తీసుకున్నారంట! నిజంగా ఒక క్రైం చేసినోడి గురించి నేను చెప్పాలా? ఒకరు జైలుకు వెళ్లిపోయి లేదా ఏదైనా అయిపోతే జనసేన ఎదుగుతుందా! మనకంత దిగజారుడు మైండ్‌సెట్ ఉందా? ఉంటే పాలిటిక్స్‌కు వస్తామా? అసలు ఇలాంటి వాళ్లందరూ లేనప్పుడు కదా మనం పాలిటిక్స్‌లోకి వచ్చింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సమయంలోనే కదా తుపాకీ సరెండర్ చేసి పాలిటిక్స్‌లోకి వచ్చాను. ఎంత తెగింపు ఉంటే వస్తాం. అలాంటిది నాకు అమిత్‌షా ఏదో చెప్పారని అంటున్నారు. ఎన్నో సమస్యలున్నాయి. కళ్లు కనిపించడంలేదా! ఎంతసేపూ వైసీపీ నాయకుడి జైలు.. ఇవేనా? నేను వెళ్లి ప్రధానమంత్రితో, అమిత్‌షాతో అదే మాట్లాడతానా.. ఇంక సమస్యలేమీ ఉండవా? దేశ భవిష్యత్ గురించి మాట్లాడనా.. రాష్ట్రాభివృద్ధి గురించి మాట్లాడమా? వీళ్లను జైలులో పెట్టండి.. వాళ్లను జైలులో నుంచి తీయండి.. వీళ్ల నడుముకు బెల్టులు కట్టండి.. వాళ్ల మెడలో గొలుసులు వేయండని చెబుతామా ఛండాలంగా! వాళ్ల నేరాలపై కోర్టులో కేసుల్లేవా? కోర్టులకు నేను చెప్పాలా? ఎవరు నేరం చేశారో సుప్రీంకోర్టు జడ్జీలకు తెలియదా? ఇది నన్నో, అమిత్‌షానో అవమానపరచడం కాదు.. వ్యవస్థను అవమానపరచడం. నేను ఎందుకు పట్టించుకోనంటే.. చర్యకు ప్రతి చర్య ఉంటుంది. కర్మ ఎవరినీ వదలదు. ఎవరు చేసిన పనులు వాళ్లకు తగలకు తప్పదు. అది మంచైనా చెడైనా’ అని తేల్చిచెప్పారు. ఉపముఖ్యమంత్రి ఇంకా ఏమన్నారంటే..
కటౌట్లు, హోలోగ్రాములతో సీఎం అయిపోయారు
మనలో ఉన్న అనైక్యతే అవమానాలకు గురిచేస్తోంది. మనందరం ఈ రూములో కూర్చున్నాం. బయటివాడు వచ్చి దాడి చేయాలంటే ఈ రూములో వాళ్లే తలుపు తీయాలి. తమిళ రాజకీయాలు చూస్తున్నాం. వాళ్లెంత సుఖంగా చేశారు పాలిటిక్స్. నాకు అసూయ కలిగేంతగా చేశారు. కటౌట్లు, హోలోగ్రాములతో (విజయ్) గెలిచేశారు. చక్కగా సీఎం అయిపోయారు. నన్ను 15 సంవత్సరాలు రోడ్డుపై దేకించినా కాలేకపోయాం. ఎందుకంటే నేను మానవత్వం గురించి ఆలోచించేవాడిని. ఒక మాట మాట్లాడాలంటే చాలా అవగాహన కావాలి. ఎందుకు ఇన్ని సంవత్సరాలు నలిగానంటే.. ఒక పార్టీని నడపడమంటే.. కొన్ని లక్షల మంది సమూహాన్ని ఏకతాటిపై నడిపించాలి. ఇది చాలా కష్టమైన పని. మనింట్లో కుటుంబ సభ్యులమే ఏకతాటిపై ఉండం. అలాంటిది నేనెంత సాహసం చేశానంటే.. బయటకు వచ్చి పార్టీ పెట్టి ఏదో మార్చేద్దామని ఉద్దేశం. అది చాలా ధైర్యాన్నిచ్చింది.
పది అడుగులేద్దామంటే.. మనోళ్లే లాగేస్తారు..
ఇప్పటిదాకా నా సహనం చూపించాను. పుష్కర కాలం భరించాను. ఇక భరించడాలు ఉండవు. దారినపోయే ప్రతి ఒక్కడూ రాళ్లేద్దామంటే జనసేన ఉత్తినే ఉండదు. దానికి తగ్గ పర్యవసానాలు ఉంటాయి. తర్వాత నన్ను తిట్టుకున్నా ఫర్వాలేదు. నాకూ కోపాలు, బాధ ఉంటాయి కదా! నేనూ మనిషినే కదా! మీరు ఇష్టానికి కొట్టేసి వెళ్లిపోతే నేను నవ్వుతూ భరిస్తానా.. నా గుండెల్లో ఏడుపులు, కన్నీళ్లు ఉండవా.. కడుపు మండదా? మీరు ఏదైనా అనేయొచ్చు. నేనేమీ అనకూడదా? కనీసం కౌంటర్లు కూడా ఇవ్వకూడదా? పేరు ప్రఖ్యాతులు మాకేమైనా శిక్షా! భరించి భరించి. ఎంతకాలం భరిస్తాం? కొన్ని టీవీ చానళ్లు ఉంటాయి. వాళ్లు బెదిరిస్తారు. మొన్న పౌరసరఫరాల శాఖపై ఒక వ్యతిరేక వార్త వచ్చింది. దానికి జనసైనికుడే లీడ్ ఇచ్చాడని తెలిసింది. నేను పది అడుగులు వేద్దామనుకుంటే మనోళ్లే రెండడుగులు వెనక్కి లాగేస్తారు.
మాట్లాడేవాళ్లు సపోర్టు ఇస్తారా?
పక్క రాష్ట్రంలో ఒకరు విజయం సాధించగానే అందరూ ఇలా చేసి ఉండొచ్చు.. అలా చేసి ఉండొచ్చని చెప్పడం మొదలుపెట్టారు. పోనీ సపోర్టు ఇప్పుడిస్తున్నారా? పార్టీ గురించి ఇప్పుడు మాట్లాడేవాళ్లందరూ ఒకప్పుడు నా చుట్టూ తిరిగిన వాళ్లే కదా! మరి ఎందుకు వెళ్లిపోయారు. పదవి రాలేదు.. వస్తుందో రాదో తెలీదు.. గవర్నమెంట్ వస్తుందో రాదోనని వెళ్లిపోయారు. ఈ అలయెన్స్ పనిచేయదని విశ్లేషణలు ఇచ్చేసి వెళ్లిపోయారు. ఎంతసేపూ కులాలను వేరుచేస్తూ కొట్టుకు చావండని చెప్పేవారే తప్ప.. కులాలను కలుపుదాం అనే వాళ్లు వద్దా? అంటే వ్యాపారాలు చేసుకుంటే కులాలు అడ్డురావా..? కులాలను రెచ్చగొట్టే గొడవేంటి మీ అందరికీ. విశ్లేషించే సమయంలో.. విశ్లేషకుడికి ఎవరినైతే విశ్లేషిస్తున్నాడో వాడి కులం కనపడదు. కానీ మనం తిరిగి మాట్లాడితే మాత్రం మనకు కులం, ప్రాంతం వర్తిస్తుంది. అమిత్‌షాను, పవన్ కల్యాణ్‌ను ఏమైనా అనేయొచ్చు. అలా అన్నవాళ్లను మనమేదైనా అంటే కులం, ప్రాంతం గుర్తొచ్చేస్తాయి. మీ ఇష్టానుసారం మాట్లాడితే మాకు కోపాలు రావా? అందరికీ అన్నిసార్లు భయపడతామని అనుకుంటున్నారా? మేమూ మాట్లాడతాం. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తిరిగి రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అక్కడే ఉన్నాం. ఎక్కడికీ పారిపోలేదు. పాలిటిక్స్‌లో అంత తెగించి ఉన్నాను. నేను కుటుంబాన్ని వదిలేసి రాగలను. నీవు రాగలవా? అన్నీ పోగొట్టుకోవడానికి సిద్ధంగా ఉండే రాజకీయాల్లోకి వచ్చాను. నన్ను విమర్శించే వాళ్లు అలా రాగలరా? మీరు ఎక్కడ ఎలాంటి గొడవలు పెట్టుకున్నా నేను రెడీ. జగన్ అనే వ్యక్తి జైలుకెళ్లిపోతే.. అనే వాళ్ల పిచ్చి లాజిక్ ఏంటో నాకు అర్థం కావడంలేదు. అలాంటి తెలివితేటలు నాకుంటే.. చంద్రబాబు జైలులో ఉన్నపుడు ఇదే సరైన సమయమని పాలిటిక్స్‌లో ముందుకెళ్లిపోతే ముఖ్యమంత్రి అయిపోవచ్చని నేను అనుకోవచ్చు కదా.. పాజిబులిటీ ఉంది కదా! అలా అనుకుంటే అయిపోతామా? ఏమో జరగొచ్చు.. జరక్కపోవచ్చు. కానీ నా నైతిక ఆలోచన అదికాదు. ధైర్యంగా నిలబడి శత్రువు బలంగా ఉన్నప్పుడే బలంగా కొడతాను. బలహీనంగా ఉన్నపుడు కాదు.
తటస్థంగా ఉండి.. మళ్లీ రాసేస్తారు!
కొన్ని టీవీ చానళ్లు ఉన్నాయి. వెబ్‌సైట్లు, సోషల్ మీడియా హ్యాండిల్స్ ఉన్నాయి. ఏవో రెండు మూడు ఆర్టికల్స్ వేస్తుంటారు. మీరు అందరినీ ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారనుకుంటున్నారు కానీ మేం కూడా ఎదుర్కొంటాం. మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే మేం కూడా అదే అంటాం. ఛాయిస్ మీదే. మితిమీరిన సహనం చేతగానితనం అయిపోతుంది. ఉదాహరణకు ఒక టీవీ చానల్ అధినేత ఉంటారు. అన్ని వేడుకలకూ నన్ను పిలుస్తారు. కొన్నేళ్లపాటు రెగ్యులర్‌గా వెళ్లాను. వాళ్ల ఫంక్షకు వెళ్లకపోతే వెంటనే నాపై నెగిటివ్ ఆర్టికల్స్ రాసేస్తారు. జనసేనపై రాసేస్తారు. మళ్లీ వెళ్లాననుకోండి.. కొద్దిరోజులు తటస్థంగా ఉండి మళ్లీ రాసేస్తారు. నాకివన్నీ విసుగ్గా ఉంటాయి. వాళ్ల గురించి నాకు ఎన్ని విషయాలు తెలిసి ఉంటాయి. మూడున్నర దశాబ్దాలుగా అందరి జీవితాలూ వ్యక్తిగతంగా తెలుసు కదా! నేనెందుకు మాట్లాడలేదు మరి. నా సంస్కారం నన్ను మాట్లాడనివ్వదు.
ఎక్కడ గెలవగలమో పరిశీలించండి..
స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవ్వండి. ఎక్కడ గెలవగలమో పరిశీలించండి. కచ్చితంగా గెలుస్తామనుకుంటే ఒక కమిటీ పెడతాను. దానికి నివేదించండి. తమిళనాడులో అందరూ ఏకాభిప్రాయంతో ఉంటారు. ఇక్కడా అందరినీ ఏకాభిప్రాయానికి తీసుకురావడం చాలా చాలా అవసరమనిపిస్తోంది. ప్రకాశం జిల్లా మొత్తం కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను. ఇన్నేళ్లలో నేనెప్పుడూ అలా చేయలేదు. అక్కడున్న పాతిక మందికి 54 గొడవలు ఉన్నాయి.
మౌనంగా ఉన్నానంటే గట్టి పడుతున్నానని అర్థం
దయచేసి మెత్తగా ఉండొద్దని జనసేన నాయకులకు చెబుతున్నాను. నేను మౌనంగా ఉన్నానంటే మెత్తగా ఉన్నట్లు కాదు.. గట్టిపడుతున్నానని అర్థం. నిశ్శబ్దంగా ఉన్నానంటే సరైన సమయం కోసం చూస్తున్నానని అర్థం. అంతేతప్ప బలహీనతకాదు. రెండేళ్లు కూర్చోబెట్టి ఏమీ మాట్లాడడం లేదు.. మమ్మల్ని గుర్తించడంలేదు.. కూటమిలో ఇబ్బందులు పట్టించుకోవడంలేదని ప్రతిసారీ చెబుతున్నారు. పోనీ నేను ఎవరినైనా వ్యక్తిని పెడితే అతడిపై ఫిర్యాదులు చేస్తారు. ఒక పార్టీ నడపాలంటే మిలిట్రీ యూనిట్ నడిపినట్లుగా క్రమశిక్షణ అవసరం. అలాగే మనం క్రమశిక్షణతో ఉంటే తప్ప కూటమితో మనకు బలం రాదు. బలపడడం అంటే పదవులు కాదు, ఏకాభిప్రాయంతో ఉండడం. పదవులు రాగానే అందరూ చప్పబడిపోయినట్లుగా నాకు అనిపించింది. ఉత్తేజం పొందుతారనుకుంటే ఎవరూ మాట్లాడడం మానేశారు. పోరాటం జనసేన మూలలక్షణం. కూటమి కోసం కొన్ని సార్లు సర్దుకుంటాను. ఒక పార్టీ కోసం కాదు. 5 కోట్ల ప్రజల కోసం కొన్ని సార్లు భరిస్తా.
తమిళనాడు వేరు.. మనం వేరు
సీఎం అవలేదంటూ నన్ను ఈ మధ్య చావగొట్టేశారు. అసలు మన సామాజిక పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసిందేగా! మన రాష్ట్రాన్ని తమిళనాడు నుంచి చితక్కొట్టి పంపేశారు. తెలంగాణతో విడిపోయాం. కనీసం ఆంధ్రావాళ్లకి ఆంధ్రా వాళ్లతోనైనా కుదురుద్దా అంటే.. ఒకరేమో 3 రాజధానులు అంటారు. పోనీ అదయిపోయింది అనుకుంటే.. ఏకాభిప్రాయం లేదు ఇక్కడ. నాకు సినిమాల కంటే జనం తాలుకు కష్టాలు తీర్చడమంటే ఇష్టం. గ్లోబల్ రికగ్నేషన్, గ్లోబల్ అవార్డులు ఎన్ని వచ్చినా.. ఒక ఊరూపేరూ లేని గ్రామానికి, 70 సంవత్సరాలు కరెంటు లేని గ్రామానికి రోడ్డు వేస్తే అది ఆస్కార్ కొట్టినంత ఆనందం. డోలీల మోతకు గర్భిణులు నలిగిపోతున్న అలాంటి ఊర్లకు రోడ్లు వేస్తే గ్లోబల్ రికగ్నైజేషన్ వచ్చినంత ఫలితం. 2014లో నాకు అనుభవం లేదు. అంతకుముందు 2009లో చేదు అనుభవమే ఎదురైంది. వ్యవస్థ నడపడం. పాలిటిక్స్ నడపడం నేర్చుకున్నాను. మనుషులతో మాట్లాడడం.. తిట్టించుకోవడం.. ఎదురు కౌంటర్లు ఇవ్వడం తెలుసుకున్నాను. ఇంట్లో ఆడవాళ్లను కూడా నీచంగా మాట్లాడతారు. వాళ్లను ఏమైనా అనడానికి మన సంస్కారం ఒప్పుకోదు. ఇవన్నీ తట్టుకుని ఇప్పుడు నన్ను ఎవరైనా తిడుతుంటే నా మైండు రాటుదేలిపోయింది. స్పందన పోయింది.
నాయకుల తప్పులు ఇక ఉపేక్షించను..
ఇప్పటి నుంచి జనసేన కార్యాచరణ చాలా బలంగా ఉంటుంది. ఇకపై నాయకుల తప్పులు ఉపేక్షించను. పబ్లిగ్గా చెప్పేస్తాను. ఎందుకంటే పబ్లిగ్గా మీ ఇష్టానికి మీరు మాట్లాడేస్తుంటే.. నేను మిమ్మల్ని కూడా నించోబెడతా. కార్యకర్తల ముందు నించోబెడతా. ఒక కార్యకర్త తప్పు చేస్తే మిగతా కార్యకర్తలు కరెక్టు చేసుకోవాల్సిందే. బాధ్యత లేకపోతే, ఏకాభిప్రాయం లేకపోతే మీరు దీంట్లో ఉండొద్దు. ఇక స్థానిక ఎన్నికలకు సన్నద్ధమవ్వండి. కచ్చితంగా గెలుస్తామనుకుంటే ఒక కమిటీ పెడతాను. దానికి నివేదించండి. ప్రకాశం జిల్లా మొత్తం కార్యవర్గాన్ని సస్పెండ్ చేశాను.
అలసిపోతా గానీ వదలను..
మనకు టీవీ చానళ్లు ఉన్నాయా? కనీసం మనకున్న సోషల్ మీడియా హ్యాండిల్స్.. నాకేదైనా కష్టమొస్తే నా వెనుక ఉంటారా? తమిళనాడులో ఒక హీరో (విజయ్) అభిమానులందరూ ఏకతాటిపై ఉండడంతో అతను సీఎం అయిపోయాడు. ఇక్కడ మన అభిమానులందరూ సినిమాపరంగా ఇష్టపడతారేమో గానీ పాలిటిక్స్ విషయానికొస్తే కులం బయటకు వచ్చేస్తుంది. కులాలుగా విడిపోయారు.. కొంతమంది పార్టీలుగా విడిపోయారు. ఇలాంటి వైరుధ్యమైన వాతావరణంలో ఎదిగి ఇక్కడ దాకా రావడమే.. ఒక కొండరాయిని బద్దలు కొట్టుకుని మొక్క పెరిగినంత కష్టం. నువ్వు ఎలా గెలుస్తావో చూస్తాననేవాళ్లు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్‌లో ఎక్కువ. నేను గెలవకుండా చూసుకునే బాధ్యత తమదంటారు. నేనెప్పుడూ ఎవ్వరికీ ద్రోహం చేయలేదు. ఉత్తిపుణ్యానికి నన్ను అనేవాళ్లు ఏదో కులంలో పుట్టినోళ్లే కదా! పవన్ కల్యాణ్ కులాల గురించి ఎక్కువగా మాట్లాడతాడని అనడం ఈ మధ్య ఎక్కువగా వింటున్నాను. మరి వాళ్లేం మాట్లాడుతున్నారు? కులం అనేది సామాజిక సత్యం. దాన్నేమీ చేయలేం. ఓట్లు వేసే సమయంలో ఈ వార్డులో ఓట్లు ఎక్కువగా ఎవరివి ఉన్నాయని వాళ్లు అడగరా? నేను అందరిలా కాకుండా ఓపెన్‌గా మాట్లాడుతున్నానంతే. నా లోపల నా కులం అనే భావన లేదు. మన మనుషులు అనే భావన ఉంది. కులాన్ని భరించాలి.. తప్పదు. ఇదంతా ఎందుకు చెప్పుతున్నానంటే.. పార్టీని నడపడం అంత తేలిక కాదు. ఒక్కోసారి అలసిపోతాను గానీ వదలను. అలా వదలను కాబట్టే ప్రధాని నన్ను ఇష్టపడతారు. ముందు నన్ను మెచ్చుకునే విశ్లేషకులు ఉన్నారంటే.. తర్వాత వాళ్లు తిడతారని భయపడతాను. గత్యంతరం లేక ఇంత సహనంతో ఉండాల్సి వస్తోంది.