Share News

ఆలయాల పవిత్రతను కాపాడతాం

ABN , Publish Date - Mar 26 , 2026 | 03:17 AM

ఆలయాల పవిత్రతను కాపాడుతామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని నీలాచలం ...

ఆలయాల పవిత్రతను కాపాడతాం

  • ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

  • రామతీర్థంలో గిరిప్రదక్షిణకు రోడ్డు నిర్మాణం

  • వర్చువల్‌గా ప్రారంభించిన డిప్యూటీ సీఎం

విజయనగరం, మార్చి 25(ఆంధ్రజ్యోతి): ఆలయాల పవిత్రతను కాపాడుతామని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ చెప్పారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని నీలాచలం (బోడికొండ) చుట్టూ గిరి ప్రదక్షిణ కోసం రూ.3.4 కోట్ల ఉపాధి నిధులతో నిర్మించిన రోడ్డును బుధవారం అమరావతి నుంచి ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేవదాయ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి ఆధ్వర్యంలో ఆలయాల పునరుజ్జీవానికి కృషి చేస్తున్నామన్నారు. రూ.40 కోట్లతో 22 ప్రధాన ఆలయాల అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రామతీర్థంలో భక్తులు గిరి ప్రదక్షిణ చేసే సందర్భాల్లో అనేకసార్లు ప్రమాదాలు జరిగాయని, దీంతో రహదారిని నిర్మించామని తెలిపారు. ఈ రూపంలోనైనా శ్రీరామునికి సేవ చేసుకునే భాగ్యం కలిగిందన్నారు. మన సంస్కృతిని పరిరక్షించేందుకు, సంప్రదాయాలను కాపాడేందుకు, ఆలయాల పవిత్రతను రక్షించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. శ్రీరామనవమి ఉత్సవాలకు ముందే గిరి ప్రదక్షిణ రోడ్డును అందుబాటులోకి తీసుకువచ్చిన అధికారులకు అభినందనలు తెలిపారు. సంక్షేమం, అభివృద్ధితోపాటు, ఆధ్యాత్మిక ఆంధ్రప్రదేశ్‌గా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని దేవదాయ మంత్రి ఆనం చెప్పారు. పవన్‌ కల్యాణ్‌ సహకారంతో ఇప్పటికే శ్రీకాళహస్తి ఆలయం వద్ద గిరిప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మించామని, ఇప్పుడు రామతీర్థం వద్ద నిర్మించామని, కోటప్పకొండ వద్ద రోడ్డు త్వరలో పూర్తవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్‌చార్జి మంత్రి అనిత, మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు లోకం నాగమాధవి, పూసపాటి అదితి గజపతిరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేశ్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 26 , 2026 | 03:17 AM