త్యాగంతో ధర్మపరిరక్షణ సాధ్యం
ABN , Publish Date - Jan 26 , 2026 | 04:13 AM
తల్వార్‌తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురుతేజ్ బహదూర్ సింగ్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు.
గురుతేజ్ బహదూర్ సింగ్ త్యాగం స్ఫూర్తిదాయకం.. 350వ షహీదీ సమాగమంలో పవన్ కల్యాణ్ ప్రార్థనలు
అమరావతి, జనవరి 25(ఆంధ్రజ్యోతి): తల్వార్‌తోనే కాదు త్యాగంతోనూ ధర్మ పరిరక్షణ సాధ్యమని చాటిన మహనీయుడు గురుతేజ్ బహదూర్ సింగ్ అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కొనియాడారు. తనది కాని ధర్మం కోసం శిరస్సును త్యాగం చేసిన మహనీయుడని, ఆయన త్యాగం భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌లో గురుతేజ్ బహదూర్ సింగ్ 350వ షహీదీ సమాగమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్‌తో కలిసి సచ్‌ఖండ్ గురుద్వారాను సందర్శించారు. సిక్కుల 10వ మత గురువు గురుగోవింద్ సింగ్ సమాధి మందిరాన్ని దర్శించుకున్నారు. ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. చాదర్‌ను సమర్పించి నమస్కరించారు. గురుద్వారా ఎదుట నిషాన్ సాహిబ్ వద్ద ఏర్పాటు చేసిన ధ్వజానికి మొక్కారు. వీరికి గురుద్వారా చైర్మన్ డాక్టర్ విజయ్ సత్పార్ సింగ్ ఆధ్వర్యంలో సాదరంగా స్వాగతం పలికారు. గురుద్వారా గ్రంథీలు పవిత్ర వస్త్రాన్ని వేసి వీరిని ఆశీర్వదించారు. గురుద్వారా జ్ఞాపికను, సిక్కులు ధరించే పవిత్ర ఆయుధం కిర్పాన్‌ను బహూకరించారు. దర్శనం అనంతరం ఫడణవీస్‌తో కలిసి గురుద్వారా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఎలకా్ట్రనిక్ డొనేషన్ మెషీన్‌ను పవన్ కల్యాణ్ ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ షహీదీ సమాగమంలో పాల్గొనడం గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు నాందేడ్‌లో పవన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం స్వాగతం పలికింది. ఆ రాష్ట్ర మాజీ సీఎం, రాజ్యసభ సభ్యుడు అశోక్ చవాన్, ఎమ్మెల్యే రాజార్ కర్, కలెక్టర్ రాహుల్ ఖరడ్లే ఘన స్వాగతం పలికారు.