Share News

యువత బాధ్యతతోనే ఉన్నారు..!

ABN , Publish Date - Mar 16 , 2026 | 04:48 AM

ప్రస్తుతం దేశంలోని యువత సమాజం పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

యువత బాధ్యతతోనే ఉన్నారు..!

  • ‘జెన్‌-జి’ ప్రోమోలో డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం దేశంలోని యువత సమాజం పట్ల అత్యంత బాధ్యతగా వ్యవహరిస్తున్నారని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అన్నారు. హైదరాబాద్‌లో ‘జనసేనాని విత్‌ జెన్‌-జి’పేరుతో నిర్వహించిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన యవతతో ముఖాముఖి నిర్వహించారు. యువకులు అడిగిన ప్రశ్నలకు బదులిచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ప్రోమోను ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ఇందులో యువత అడిగిన ప్రశ్నలకు పవన్‌ బదులిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. మన దేశంలో డబ్బులిస్తేనే ప్రజలు ఓట్లు వేస్తారని నాయకులు నిర్ణయించారో... లేదా డబ్బులిస్తేనే ఓట్లు వేస్తామని ప్రజలు భావిస్తున్నారో.. తెలియడం లేదన్నారు. దీనిపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలని సూచించారు. మహారాష్ట్ర ఎంతో మంది బలమైన నాయకుల్ని అందించిందని, తాను కూడా ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను స్ఫూర్తిగా తీసుకుని, కొన్ని కార్యక్రమాలు ప్రారంభించానని వెల్లడించారు. ‘జనసేనాని విత్‌ జెన్‌-జి’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమం పూర్తి వీడియో త్వరలోనే విడుదల కానుంది.

Updated Date - Mar 16 , 2026 | 04:49 AM