పార్లమెంట్‌లో ‘నేషన్ ఫస్ట్’ భావన కలగాలి
ABN , Publish Date - Jul 19 , 2026 | 04:26 AM
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోని చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన..
రాష్ట్ర ప్రయోజనాల సాధనకు కృషి చేయాలి
ఎంపీలకు జనసేన అధినేత పవన్ దిశానిర్దేశం
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోని చర్చల్లో జాతీయ దృక్పథంతో రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా, నేషన్ ఫస్ట్ అనే భావన స్పష్టంగా ప్రతిఫలించాలని జనసేన పార్టీ అధ్యక్షులు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లో జనసేన పార్టీ ఎంపీలతో నిర్వహించిన సమావేశంలో పార్లమెంట్ సమావేశాల్లో చర్చకు రానున్న బిల్లులు, వాటిపై పార్టీ వైఖరి, అనుసరించాల్సిన వ్యూహాలపై సమగ్రంగా చర్చించారు. పార్లమెంట్ సమావేశాల్లో ప్రస్తావించాల్సిన అంశాలపై మార్గనిర్దేశం చేశారు. పార్లమెంట్ వేదికగా రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ప్రతి అంశంపై జనసేన పార్టీ తరఫున గళం వినిపించాలని సూచించారు. ప్రస్తుతం అమలులో ఉన్న ప్రాజెక్టులకు మరిన్ని నిధులు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నాలు చేయాలని చెప్పారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నిర్మాణం దశలో ఉన్న రైల్వే ప్రాజెక్టుల పురోగతి, పెండింగ్ ప్రాజెక్టులకు ఆమోదం, నిధుల కేటాయింపు, కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, రైల్వే ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు, దక్షిణ కోస్తా రైల్వేజోన్ అభివృద్ధి వంటి అంశాలపై ఎంపీలతో చర్చించారు. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్న నియోజకవర్గాల పునర్విభ జన, మహిళా రిజర్వేషన్ల అమలు వంటి కీలక బిల్లులపై పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలను వివరించారు. సమావేశంలో పార్టీ లోక్‌సభ సభ్యులు వల్లభనేని బాలశౌరి, తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, రాజ్యసభ సభ్యులు లింగమనేని రమేశ్ పాల్గొన్నారు.
జాతీయ పురస్కార విజేతలకు అభినందనలు..
జాతీయ చలన చిత్ర పురస్కారాలకు ఎంపికైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు, నిర్మాతలు, రచయితలు, గాయకులకు పవన్ హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ‘మమ్ముట్టి ఉత్తమ నటుడిగా ఎంపిక కావడం ఆనందంగా ఉంది. తెలుగు చిత్ర పరిశ్రమకు పలు పురస్కారాలు దక్కడం శుభ పరిణామం. నిర్మాతగా నిహారిక చేసిన కమిటీ కుర్రోళ్లు చిత్రం ప్రేక్షకుల మెప్పుతో పాటు అవార్డులూ దక్కించుకుంది. చిత్ర నిర్మాణంలో భాగమైన పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక, దర్శకుడు యదు వంశీకి అభినందనలు’ అని పవన్ పేర్కొన్నారు.