Share News

అది నెయ్యే కాదు!

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:25 AM

జగన్‌ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్‌ తేల్చిందని జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు.

అది నెయ్యే కాదు!

  • రసాయనాలు, పామాయిల్‌తో లడ్డూలు: డిప్యూటీ సీఎం

  • కాసుల కక్కుర్తితో నాడు వైసీపీ నేతల అపచారం

  • ఇప్పుడేమో బొంకుతున్నారు

  • వారంటే వ్యక్తిగత వైరం లేదు

  • వాళ్ల భాష, క్రిమినాలిటీతోనే సమస్య

  • మళ్లీ మేమొస్తే అంటూ బెదిరిస్తున్నారు

  • 11 స్థానాలకు పడిపోయినా.. వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదు

  • నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నందుకే ఇవాళ దాడులు

  • అయితే హింసను ఏ పార్టీ సమర్థించదు

  • చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దని

  • చంద్రబాబు కూడా చెబుతున్నారు

  • జనసేన జనరల్‌ బాడీ భేటీలో పవన్‌

మనం చెప్పే మంచి ప్రజల్లోకి వెళ్లేలోపు వైసీపీ నాయకులు జనాల్లో భయం సృష్టిస్తున్నారు. మళ్లీ మేమొస్తే అంటూ రకరకాలుగా బెదిరిస్తున్నారు. గతంలో ఇలాంటి కామెంట్లు చేసే ఆ పార్టీ 151 నుంచి 11 స్థానాలకు పడిపోయింది. అయినా వాళ్ల ప్రవర్తనలో మార్పు రాలేదు.

- ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

అమరావతి, ఫిబ్రవరి 2 (ఆంధ్రజ్యోతి): జగన్‌ పాలనలో తిరుమల లడ్డూ ప్రసాదంలో ఉపయోగించిన నెయ్యి అసలు నెయ్యే కాదని సిట్‌ తేల్చిందని జనసేనాని, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రసాయనాలు, పామాయిల్‌ ఉపయోగించి తయారుచేసిన మిశ్రమంతో లడ్డూలుచేసి శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, రాష్ట్ర కమిటీ సభ్యులతో సోమవారం పార్టీ కార్యాలయంలో జరిగిన జనరల్‌ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాసులకు కక్కుర్తిపడి వైసీపీ నాయకులు తిరుమలలో అపచారం చేశారని విమర్శించారు. ‘నిబంధనలు అడ్డగోలుగా మార్చేసి టన్నుల కొద్ది కల్తీ నెయ్యి కొనుగోలు చేసి ప్రసాదాల్లో కలిపేశారు. రూ.400కి కిలో నాణ్యమైన నువ్వుల నూనె కూడా దొరకదు. అలాంటింది నెయ్యి ఎక్కడ నుంచి దొరుకుతుంది? అధికారంలో ఉన్నప్పడు చేయాల్సిందంతా చేసి ఇప్పుడు బొంకులు మాట్లాడుతున్నారు. వైసీపీ చేసిన అపచారాలను ప్రజల్లోకి మనం బలంగా తీసుకెళ్లాలి’ అని నిర్దేశించారు.


వైసీపీ నేతలంటే తనకు వ్యక్తిగత ద్వేషం, వైరం లేదని స్పష్టం చేశారు. ‘వాళ్ల భాష, క్రిమినాలిటీతోనే సమస్య. ఇళ్లలోకి వస్తాం.. దాడులు చేస్తాం.. నరికేస్తామంటూ నోటికొచ్చినట్లు మాట్లాడతారు. వాళ్ల భాష సరిగా లేని కారణంగానే ఈ రోజు దాడులు జరుగుతున్నాయి. దాడులను, హింసను ఏ రాజకీయ పార్టీ సమర్ధించదు. సీఎం చంద్రబాబు కూడా చట్టాన్ని ఎవరూ చేతుల్లోకి తీసుకోకూడదని పదేపదే చెబుతున్నారు. స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే రాష్ట్రాభివృద్ధి సాధ్యం. మరో 15 ఏళ్లు కూటమి అధికారానికి ఢోకా లేదు. ప్రజలు చాలా తెలివైనోళ్లు, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు’ అని స్పష్టం చేశారు. జనసేన ఒక కులానికో, కుటుంబానికో చెందిన పార్టీ కాదన్నారు. ఒక కులం మీద ఆధారపడి పుట్టిన పార్టీలు ఎక్కువ కాలం నిలబడవని చెప్పారు. సంస్థాగతంగా పార్టీ బలోపేతానికి 32 మందితో క్రమశిక్షణ కమిటీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. పార్లమెంటులో మహిళలకు 33శాతం కోటా కల్పిస్తూ చట్టం చేశారని, మన పార్టీలోనూ మహిళల నాయకత్వం పెరగాలని సూచించారు.


రెండు తీర్మానాలకు ఆమోదం..

వైసీపీ హయాంలో సింథటిక్‌ నెయ్యి తయారు చేసి, లడ్డూ ప్రసాదానికి సరఫరా చేసిన మహాపచారంపై శాసనసభలో చర్చించాలని.. సిట్‌ నివేదికలోని వాస్తవాలు తెలియజెప్పే కార్యక్రమాన్ని జనసేన పక్షాన చేపట్టాలని జనరల్‌బాడీ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత భవిష్యత్‌ శక్తిని ఆవిష్కరించే బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు, ప్రధాని మోదీకి అభినందనలు తెలియజేస్తూ మరో తీర్మానం ప్రవేశపెట్టారు. వాటిని ఏకగ్రీవంగా ఆమోదించారు. అనంతరం మంత్రి నాదెండ్ల మనోహర్‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టేలా ప్రజలకు వివరిస్తామన్నారు. పార్టీ పొలిటికల్‌ ఎఫైర్స్‌ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తున్నామని చెప్పా రు. మార్చి 14న జనసేన ఆవిర్భావ దినోత్సవం నాటికి సభ్యత్వనమోదు పూర్తి చేస్తామన్నారు. అరవ శ్రీధర్‌ వ్యవహారంపైనా చర్చించామని, కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయనిచెప్పారు.

Updated Date - Feb 03 , 2026 | 03:26 AM