పారదర్శకంగా క్షేత్రస్థాయి సర్వేలు
ABN , Publish Date - May 20 , 2026 | 04:22 AM
గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
గ్రామాల్లో పల్లెపండగ 1, 2తో వేగంగా మౌలిక వసతులు
మ్యాజిక్ డ్రెయిన్లు విస్తరించాలి
నిర్దేశించిన పనులకే ‘ఉపాధి’
ఉప ముఖ్యమంత్రి పవన్ ఆదేశాలు
అమరావతి, మే 19 (ఆంధ్రజ్యోతి): గ్రామాల సమగ్రాభివృద్ధి కోసం అత్యంత పారదర్శకంగా క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రతి గ్రామంలో ప్రస్తుతమున్న సౌకర్యాలేమిటి.. ఇంకా ఎలాంటి అవసరాలున్నాయనే వివరాలతో పాటు పంచాయతీ భూములు, పోరంబోకు స్థలాలు, పశువుల మేత మైదానాలు, శ్మశాన వాటికల పూర్తి వివరాలను సర్వేల్లో నమోదు చేయాలని సూచించారు. ఈ సర్వే నివేదికల ఆధారంగా గ్రామాల్లో భూములకు రక్షణ కల్పించడంతో పాటు ప్రతి గ్రామం స్వయంసమృద్ధి సాధించేలా నూతన ఆదాయ వనరులను సృష్టించవచ్చని తెలిపారు. పల్లెపండుగ 1, 2 కార్యక్రమాలతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందన్నారు. పల్లె పండుగ తొలివిడతలో అనుకున్నట్లుగానే పూర్తి 4 వేల కి.మీ రోడ్ల నిర్మాణం పూర్తయిందని.. రెండో విడతలో 2750 కి.మీ నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, అంతకంటే ఎక్కువగా 3580 కి.మీ మేర రోడ్లను నిర్మించామని చెస్పారు. అలాగే మొదటి విడతలో 22,500 మినీ గోకులాలు నిర్మించాలనే లక్ష్యానికి గాను 22,514 పూర్తి చేశామన్నారు. రెండో విడతలో 15 వేలు నిర్మించామని తెలిపారు. పశువుల తాగునీటి అవసరాల కోసం 15 వేల నీటి తొట్టెలు నిర్మించామన్నారు.
మ్యాజిక్ డ్రైన్లు విస్తరించాలి...
గ్రామాల్లో మురుగునీటి సమస్య శాశ్వత నివారణకు పల్లె పండుగ 2.0 కింద సరికొత్తగా 59 కి.మీ మేర మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో 32.30 కి.మీ మేర పనులు పూర్తయ్యాయని పవన్‌కల్యాణ్ చెప్పారు. వీటిని మరిన్ని గ్రామాల్లో నిర్మించాలన్నారు. నల్లరేగడి నేలలు, డెల్టా ఏరియాలో నీరు ఎక్కువగా నిల్వ ఉంటుంది కాబట్టి అక్కడి భూములకు తగ్గట్లుగానే ఈ మ్యాజిక్ డ్రెయిన్లను నిర్మించాలని తెలిపారు. రోడ్ల నాణ్యతపై రాజీపడొద్దని, నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలన్నారు. సీసీరోడ్లు వేసిన తర్వాత ఇరువైపులా అలాగే వదిలేయకుండా మట్టితో పక్కాగా వాలు చేయాలన్నారు.
వాలు చేయకుండా వదిలేస్తే వాహన ప్రమాదాలు జరుగుతాయని.. వర్షాకాలంలో నీరు నిలిచిపోయి రోడ్లు అంచులు త్వరగా పాడవుతాయని తెలిపారు. రోడ్ల పర్యవేక్షణకు, డూప్లికేషన్‌కు చెక్ పెట్టేందుకు జియో మానిటరింగ్ సిస్టంను తీసుకొచ్చామన్నారు. ఏ గ్రామంలో, ఏ ప్రాంతంలో ఎంత వరకు రోడ్డు పనులు జరిగాయో శాటిలైట్, జియో-ట్యాగింగ్ ద్వారా క్షేత్రస్థాయిలో కచ్చితంగా తెలుసుకోవచ్చని చెప్పారు. ఉపాధి హామీ పథకం నిధులను ప్రభుత్వం నిర్దేశించిన బడ్జెట్ పరిమితి వరకే జిల్లా కలెక్టర్లు మంజూరుచేయాలని ఉప ముఖ్యమంత్రి స్పష్టంచేశారు. అంతకు మించి అదనంగా ఇస్తే.. ప్రభుత్వ లెక్కలకు, క్షేత్రస్థాయి గణాంకాలకు పొంతన లేకుండా.. నిధుల దుర్వినియోగానికి, ఆడిట్ ఇబ్బందులకు దారితీస్తుందని చెప్పారు. అలాగే ఉపాధి హామీ మార్గదర్శకాల ప్రకారం అనుమతించిన పనులను మాత్రమే గ్రామాల్లో చేపట్టాలన్నారు. ‘వికసిత్ భారత్: గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ (వీబీ జీరామ్‌జీ)’ చట్టాన్ని స్వర్ణాంధ్ర లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ప్రాంతాల్లో పనులను సమర్థంగా చేపట్టేందుకు తగిన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే, కమిషనర్ కృష్ణతేజ తదితరులు పాల్గొన్నారు.