నవంబరు లోపే స్థానిక ఎన్నికలు
ABN , Publish Date - Jul 10 , 2026 | 04:05 AM
‘రాష్ట్రంలో నవంబరులోపే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. నాయకులు సిద్ధంగా ఉండండి, క్యాడర్‌ను సిద్ధం చేయండి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు.
నాయకులు సిద్ధంగా ఉండి.. క్యాడర్‌ను
సంసిద్ధులను చేయాలి: డిప్యూటీ సీఎం
పార్టీ లీగల్ విభాగంపై పవన్ అసంతృప్తి
సోషల్ మీడియా పోస్టులకు కౌంటర్ ఇవ్వాలని సూచన
ముంబయిలో భుజం కండరాల శస్త్ర చికిత్సకు సిద్ధమైన పవన్
అమరావతి, జూలై 9(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలో నవంబరులోపే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. నాయకులు సిద్ధంగా ఉండండి, క్యాడర్‌ను సిద్ధం చేయండి’ అని జనసేన పార్టీ అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. గురువారం విజయవాడలోని ప్రముఖ హోటల్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, కీలక నేతలతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. దాదాపు మూడు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన లోతైన అంశాలు చర్చకు వచ్చాయి. సమాచార సేకరణ కమిటీలు, లీగల్ విభాగం వైఫల్యాలు, సోషల్ మీడియా దుర్వినియోగం వంటి అంశాలను పవన్ చర్చించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు నుంచి సమాచారాన్ని తీసుకున్నారు.
లీగల్ విభాగంపై అసంతృప్తి...: జనసేన లీగల్ విభాగంపై పవన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు సక్రమంగా లేదని, దానిని మరింత బలోపేతం చేయాలని స్పష్టం చేశారు. సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయాలని, న్యాయ పరిధికి లోబడి కౌంటర్‌లు ఇవ్వాలని సూచించారు. సుగాలి ప్రీతి, ప్రశ్న రావణ్ అంశాలను పవన్ ప్రస్తావించారు. సుగాలి ప్రీతి విషయంలో ప్రభుత్వం తరఫున తాను ఎంతో చేశానని గుర్తుచేశారు. ఈ విషయాన్ని పార్టీ నాయకులు చెప్పడంలో విఫలమయ్యారన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో చేపట్టడం తక్షణ కర్తవ్యమని పవన్ స్పష్టం చేశారు. పార్టీ ప్రజాప్రతినిధులంతా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పార్టీ కోసం క్షేత్రస్థాయిలో బలంగా నిలబడ్డ ప్రతి వీర మహిళకు, జన సైనికుడికి అండగా నిలవాలన్నారు.
శస్త్ర చికిత్సకు సిద్ధం...
పవన్ కల్యాణ్ భుజం కండరాల సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. రెండు వారాల క్రితం ముంబై వెళ్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వైద్యులు శస్త్ర చికిత్స చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ముంబై వెళ్లి రెండు, మూడు రోజుల్లో శస్త్ర చికిత్స చేయించుకోవాలని పవన్ నిర్ణయించారు. అనంతరం దాదాపు 20 రోజులు హైదరాబాద్‌లో విశ్రాంతి తీసుకోనున్నట్లు సమాచారం. తాను తిరిగి వచ్చే నాటికి కమిటీలు వాటి పని పూర్తి చేసి, స్థానిక ఎన్నికలకు సంసిద్ధంగా ఉండేలా తయారు చేయాలని నాయకులను ఆదేశించారు. కూటమి విషయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, గ్రామస్థాయిలో అందరిని కలుపుకొని వెళ్లాలని, సమస్యలు వస్తే పార్టీ దృష్టికి తీసుకువెళ్లాలని పవన్ సూచించారు. కార్యక్రమంలో మంత్రులు మనోహర్, కందుల దుర్గేశ్, ఎంపీలు బాలశౌరి, ఉదయ్ శ్రీనివాస్, లింగమనేని రమేశ్, ఎమ్మెల్సీలు నాగబాబు, పిడుగు హరిప్రసాద్‌తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
సర్‌లో చురుగ్గా పాల్గొనాలి
సమావేశం అనంతరం ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్, లోకం మాధవి మీడియాతో మాట్లాడారు. స్థానిక ఎన్నికలు, పార్టీ బలోపేతంపై పవన్ కల్యాణ్ డైరెక్షన్ ఇచ్చారని, సర్‌లో చురుగ్గా పాల్గొనాలని సూచించారని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం న్యాయపోరాటం చేస్తూ ముందుకు వెళ్లాలని దిశానిర్దేశం చేశారని చెప్పారు.