ప్రజాస్వామ్యంలో దాడులకు తెగబడటాన్ని ఎవరూ హర్షించరు
ABN , Publish Date - Apr 09 , 2026 | 06:33 AM
ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు... ప్రతి విమర్శలు, ఆరోపణలు... ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు.
విమర్శలు, వ్యాఖ్యానాలపై అభ్యంతరాలుంటే న్యాయబద్ధంగా వెళ్లాలి
వైసీపీవాళ్లు నేటికీ దిగజారుడు, అభ్యంతరకర భాషనే మాట్లాడుతున్నారు: పవన్ కల్యాణ్
అమరావతి, ఏప్రిల్ 8(ఆంధ్రజ్యోతి): ప్రజాస్వామ్య రాజకీయాల్లో విమర్శలు... ప్రతి విమర్శలు, ఆరోపణలు... ప్రత్యారోపణలు, వ్యాఖ్యానాలు ఉంటాయని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మంగళ, బుధవారాల్లో ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ నేతలు దాడికి యత్నించిన ఘటనను ఖండించిన ఆయన... ఈ అంశాలపై బధవారం పార్టీ ప్రముఖులతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన చేసింది. ‘‘ప్రజాస్వామ్యంలో విమర్శలను స్వీకరించలేక దాడులకు తెగబడటాన్ని ఎవరూ హర్షించరు. విమర్శలకు దాడులు సమాధానం కాదు. ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్‌లో చేసిన వ్యాఖ్యలపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటిపై స్పందించడంలోనూ ప్రజాస్వామ్య పంథాను అనుసరించాలి. విమర్శలు, ఆరోపణలు, వ్యాఖ్యానాలపై చట్టబద్ధంగా న్యాయస్థానాల్లో పోరాడే అవకాశాన్ని మన రాజ్యాంగం కల్పించింది. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, అధికారంలో ఉన్నప్పుడూ, ప్రతిపక్ష హోదా కూడా సాధించలేని స్థితిలో కూడా చేసిన, చేస్తున్న వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతనాన్ని చూపిస్తున్నాయి. ఆ పార్టీ అధ్యక్షుడు జగన్‌రెడ్డి పాఠశాల విద్యార్థుల సమక్షంలోనే హద్దులు దాటి, దిగజారుడుగా మాట్లాడారు. భార్యను, కారుతో పోల్చి మాట్లాడిన జగన్ వాచాలత్వాన్ని ప్రజలు, కూటమి నేతలు మరిచిపోలేదు. నాపై, నా కుటుంబ సభ్యులపై చేసిన వ్యాఖ్యలు ఎంత నీచమైనవో ప్రజలందరికీ తెలుసు. ఆ సమయంలో జగన్ కార్యాలయాలపై లేదా ఆయనకు చెందిన సంస్థలపై జనసేన శ్రేణులు, అభిమానులు ఎవ్వరూ దాడులకు తెగబడలేదు. ఎదుటి వారు దిగజారి మాట్లాడినా, మనం వారి స్థాయికి దిగజారకూడదు. అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు సతీమణిపై చేసిన వ్యాఖ్యలను నవ్వుతూ ప్రోత్సహించిన వ్యక్తి జగన్. వైసీపీ వాళ్లు ఈ రోజుకీ దిగజారి, అభ్యంతరకర భాషలోనే మాట్లాడుతున్నారు. వీటిపై కూటమి శ్రేణులు ఎన్నిసార్లు వైసీపీపై కండబలాన్ని ప్రదర్శించాలి?’ అంటూ పవన్ ప్రశ్నించారు.