చంద్రబాబుతోనే రాష్ట్రానికి పరిశ్రమలు
ABN , Publish Date - Mar 24 , 2026 | 05:21 AM
రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు వంటి దార్శనిక నాయకుడు ఉండాలని 2024 ఎన్నికలకు ముందు ఆశించానని... ఇప్పుడది సాకారమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
ఆయన అనుభవమున్న దార్శనికుడు: పవన్ కల్యాణ్
నక్కపల్లి, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే చంద్రబాబు వంటి దార్శనిక నాయకుడు ఉండాలని 2024 ఎన్నికలకు ముందు ఆశించానని... ఇప్పుడది సాకారమవుతోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు. సోమవారం ‘ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ఇండియా’ స్టీల్‌ప్లాంటుకు శంకుస్థాపన సందర్భంగా బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. గతంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే భయపడిపోయేవారని, అనేకమంది వెనక్కి వెళ్లిపోయారని గుర్తుచేశారు. ఇప్పుడు దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం మన రాష్ర్టానికే వస్తున్నాయంటే దీనికి విజనరీ నేత చంద్రబాబే కారణమన్నారు. రాష్ర్టాన్ని సమర్థంగా నడిపిస్తున్న చంద్రబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చంద్రబాబుకు ఉన్నంత అనుభవం తనకు లేదని, అందుకే ఆయన నాయకత్వంలో రాష్ర్టాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్తున్నామని చెప్పారు. 2014-19 మధ్య అనంతపురంలో కియ కార్ల పరిశ్రమ ఏర్పాటు కావడంతో ఆ ప్రాంత రూపురేఖలు మారిపోయాయని, భూములకు ధరలు పెరిగాయని చెప్పారు. ఇప్పుడు నక్కపల్లి స్టీల్‌ప్లాంట్‌తో ఈ ప్రాంత దిశ, దశ మారిపోతాయన్నారు. 18 నెలల్లోనే సాకారమైన ఏఎం/ఎన్‌ఎస్ (ఇండియా) స్టీల్‌ప్లాంటు.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు నిదర్శనమని పవన్ అన్నారు. రాష్ట్రంలో గత 21 నెలల్లో కొత్త పారిశ్రామిక విధానాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అందుకే గూగుల్ కూడా డేటా సెంటర్ ఏర్పాటు కోసం విశాఖకు వచ్చిందన్నారు. అత్యంత తక్కువ కాలుష్యం ఉండేలా పర్యావరణహితమైన అత్యాధునిక టెక్నాలజీతో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేస్తున్న ఏఎం/ఎన్‌ఎస్ ఇండియా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు.