అన్నా.. నా భూమిని ఆక్రమించారు
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:56 AM
వెంచర్‌కు దారి కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పొలాన్ని ఆక్రమించుకున్నాడని కాకినాడకు చెందిన ప్రేమకుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ఎదుట కన్నీరుమున్నీరైంది.
విమానాశ్రయంలో పవన్ వద్ద మహిళ కన్నీరు
కాకినాడ రియల్టర్‌పై ఫిర్యాదు
విజయవాడ, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): వెంచర్‌కు దారి కోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన పొలాన్ని ఆక్రమించుకున్నాడని కాకినాడకు చెందిన ప్రేమకుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ఎదుట కన్నీరుమున్నీరైంది. పవన్ దంపతులు రాజధాని నుంచి హైదరాబాద్‌కు వెళ్లడానికి సోమవారం గన్నవరం విమానాశ్రయానికి రాగా, ఆయనను కలవడానికి చాలామంది మహిళలు అప్పటికే అక్కడికి చేరుకున్నారు. అయితే వారు పవన్ సమీపానికి రాకుండా పోలీసులు రోప్ పార్టీలను, బారికేడ్లను పెట్టి అడ్డుకున్నారు. వీఐపీ ప్రవేశద్వారం వైపు నుంచి పవన్ దంపతులు లోపలకు వెళ్తుండగా మహిళలు పవన్ అన్నా.. అని పెద్దగాకేకలు వేశారు. ఆయన గమనించి వెనుదిరిగి వారి వద్దకు వచ్చారు. వారితో కరచాలనం చేశారు. కాకినాడకు చెందిన ప్రేమకుమారి అనే మహిళ ఆయన వద్ద కన్నీళ్లు పెట్టుకుంది. కాకినాడలో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న తన పొలాన్ని రియల్ వ్యాపారి ఆక్రమించి రహదారి నిర్మించుకున్నాడని, దీనిపై పోలీసులకు, సచివాలయ సిబ్బందికి ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆమె వాపోయారు. దీనిపై ఆయన స్పందిస్తూ.. బాధితురాలి నుంచి ఫిర్యాదు తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.