Share News

వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములుకండి

ABN , Publish Date - May 30 , 2026 | 06:10 AM

వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు.

వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములుకండి

  • ‘మారేడుమిల్లి’లో అక్రమ వేట సామగ్రి స్వాధీనం

  • అటవీ సిబ్బందిని అభినందించిన డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, మే 29(ఆంధ్రజ్యోతి): వన్యప్రాణి సంరక్షణలో భాగస్వాములు కావాలని అటవీ పరిసర గ్రామాల ప్రజలకు ఉప ముఖ్యమంత్రి, అటవీశాఖ మంత్రి పవన్‌ కల్యాణ్‌ విజ్ఞప్తి చేశారు. వన్యప్రాణులను, జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యతను కాపాడే లక్ష్యంతో రంపచోడవరం, మారేడుమిల్లి అటవీ ప్రాంతాలు, పాపికొండ జాతీయ ఉద్యానవనంలో అటవీశాఖ విస్తృత స్థాయిలో వేట నిరోధక చర్యలు(ఆపరేషన్‌) నిర్వహించింది. గాలింపు, నిఘా, కూంబింగ్‌ వంటి చర్యల ద్వారా అటవీశాఖకు చెందిన ప్రొటెక్షన్‌ వాచర్లు, యానిమల్‌ ట్రాకర్లు, ఫీల్డ్‌ సిబ్బంది అక్రమ వేట సామగ్రిని గుర్తించి, తొలగించారు. 242 వైర్‌ ఉచ్చులు, 10ఇనుప ఫుట్‌ ట్రాప్స్‌, 10కిలో మీటర్ల విద్యుత్‌ తీగలను అటవీ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆపరేషన్‌లో పాల్గొన్న సిబ్బందికి శుక్రవారం అటవీశాఖ అధికారులు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ అటవీశాఖ సిబ్బందిని అభినందించారు. అక్రమ వేట వల్ల వన్యప్రాణ సంపదను నాశనం చేయడమే కాకుండా జీవవైవిధ్యాన్ని, పర్యావరణ సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తాయని అన్నారు. అడవుల్లో వేట కోసం ఉచ్చులు, ఫుట్‌ ట్రాప్స్‌, విద్యుత్‌ తీగలు పెట్టొద్దని కోరారు.

Updated Date - May 30 , 2026 | 06:11 AM