‘స్థానిక’ ఎన్నికల్లోపే జడ్పీల పునర్విభజన
ABN , Publish Date - Mar 06 , 2026 | 03:42 AM
రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్‌లను పునర్విభజించి... కొత్త జిల్లాల్లో కూడా జడ్పీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు.
కొత్త జిల్లాల్లోనూ జిల్లా పరిషత్‌ల ఏర్పాటు
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఉన్న జిల్లా పరిషత్‌లను పునర్విభజించి... కొత్త జిల్లాల్లో కూడా జడ్పీలను ఏర్పాటు చేస్తామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఈ ప్రక్రియను పూర్తిచేస్తామన్నారు. విభజించిన జిల్లాల (మొత్తం 28 జిల్లాలు) ప్రాతిపదికనే స్థానిక ఎన్నికలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉందని, అందుకనుగుణంగా కసరత్తు జరుగుతోందన్నారు. పంచాయతీల పునర్విభజనకు న్యాయపరమైన అడ్డంకులు (కేసులు) ఏవీ లేవని చెప్పారు. గురువారం శాసనసభలో పంచాయతీరాజ్ శాఖ పద్దుపై చర్చ జరిగింది. ఈ చర్చలో ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ మాట్లాడారు. స్పీకరు అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలో ఆర్ అండ్ బి రోడ్డు విస్తరణ సందర్భంగా ఆ రోడ్డుకు ఇరువైపులా ఉన్న 125 సంవత్సరాల నాటి చెట్లను నరికేయకుండా.. వాటిని భద్రంగా తొలగించి వేరేచోట నాటారని, ఇప్పుడు ఆ చెట్లు చక్కగా చిగురిస్తున్నాయని చెప్పారు. స్పీకరు, ఎమ్మెల్యేలు ప్రస్తావించిన అంశాలపై పవన్ కల్యాణ్ సమాధానమిచ్చారు.
నాటే ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్
రాష్ట్రంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో మొక్కలు నాటుతున్నా.. వాటి సంరక్షణకు చర్యలు తీసుకోవడం లేదని ఎమ్మెల్యేలు తన దృష్టికి తీసుకువచ్చారని, ఇక మీదట అటవీశాఖ ఆధ్వర్యంలో నాటే ప్రతి ఒక్కకు జియో ట్యాగింగ్ వేసి, వాటిని సంరక్షించే ప్రక్రియకు శ్రీకారం చుడతామని చెప్పారు. నర్సరీల దగ్గర నుంచే దీనికి ప్రత్యేక వ్యవస్థను తీసుకువస్తామన్నారు. ‘బెంగళూరు నర్సరీల్లో అమలు చేస్తున్న అత్యాధునిక విధానాలను పరిశీలిస్తున్నాం. మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణకు తగిన ప్రాధాన్యం ఇస్తాం. ఎర్రచందనం అమ్మకం విషయంలో మెరుగైన ధరలను పరిశీలించేందుకు, గోదాముల్లో ఉన్న దుంగలను విక్రయించేందుకు ప్రత్యేక బృందాన్ని నియమించాం. వారు ప్రభుత్వ ఖజానాకు మంచి ఽఆదాయం వచ్చేలా చేస్తారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల ఆర్థిక పద్దుల ప్రతిపాదనలను ఆమోదించాలి’ అని పవన్ కల్యాణ్ కోరారు.