గోదావరికి జీవమేదీ!
ABN , Publish Date - May 27 , 2026 | 04:57 AM
‘జీవనది గోదావరి కాలుష్య కాసారమైంది.. ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి నేడు పారిశ్రామిక వ్యర్థాలతో విలవిల్లాడుతోంది. పుష్కర స్నానమాచరించేందుకు వచ్చే భక్తులు ఇలాంటి నీటిలో స్నానం చేస్తే పుణ్యం సంగతి ఎలా ఉన్నా..
కాలుష్యంతో విలవిల
ఈ నీటిలో పుష్కర స్నానం చేస్తే భక్తులకు రోగాలే
గోదావరి ప్రక్షాళనకు 100 కోట్లు: డిప్యూటీ సీఎం పవన్
మంత్రి దుర్గేశ్‌పైనా, అధికారులపైనా అసహనం
రాజమహేంద్రవరం, మే 26(ఆంధ్రజ్యోతి): ‘జీవనది గోదావరి కాలుష్య కాసారమైంది.. ఒకప్పుడు గలగలా ప్రవహించిన గోదావరి తల్లి నేడు పారిశ్రామిక వ్యర్థాలతో విలవిల్లాడుతోంది. పుష్కర స్నానమాచరించేందుకు వచ్చే భక్తులు ఇలాంటి నీటిలో స్నానం చేస్తే పుణ్యం సంగతి ఎలా ఉన్నా.. జబ్బులు మాత్రం వస్తాయి’ అని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. గోదావరి ప్రక్షాళనకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం పర్యటనలో ఉన్న ఆయన.. రెండో రోజైన మంగళవారం ఉదయం పేపరు మిల్లు కాలుష్య జలాలు గోదావరిలో కలుస్తున్న ప్రదేశం, లంకల్లోని కాలుష్య జలాల మడులను బోటులో వెళ్లి పరిశీలించారు. కాలుష్యం ఇంత దారుణంగా ఉంటే మీరందరూ ఏమి చేస్తున్నారంటూ మంత్రి దుర్గేశ్, అధికారులను నిలదీశారు. పవిత్ర స్నానాలు చేసే నీళ్లు శుద్ధి చేయడానికి ఒక్క రూపాయి బడ్జెట్ కూడా ప్రతిపాదన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. రహదారుల కంటే ముందు గోదావరి జలాల శుద్ధి జరగాలని అభిప్రాయపడ్డారు. నదిని మురికిగా ఉంచి భక్తులను స్నానాలు చేయమనడం అంటే వారిని వంచించడమేనని అన్నారు. పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి వచ్చే భక్తులు మురుగునీటిలో స్నానం చేస్తున్నామనే బాధ కలగకూడదన్నారు. రాజమహేంద్రవరంలో 75 ఎంఎల్‌డీ సీవరేజీ ఉత్పత్తి అవుతుంటే కేవలం 30 ఎంఎల్‌డీ మాత్రమే శుద్ధి చేస్తున్నారని, అది కూడా పూర్తిగా జరగడం లేదని చెప్పారు. వాటిలో 5 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నాయని చెప్పారు. 45 ఎంఎల్‌డీ మురుగునీటిని ఎలాంటి శుద్ధి లేకుండా నేరుగా గోదావరిలో కలిపేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజమహేంద్రవరం రూరల్ మండలం వెంకటనగరం వద్ద గోదావరి నదిలో కలుస్తున్న ఆంధ్రా పేపరు మిల్లు పరిశ్రమ కాలుష్య జలాలను చూసి నిశ్చేష్టులయ్యారు. ఆ సంస్థ రూ.500 కోట్లు లాభాలు గడిస్తున్నా ప్రభుత్వానికి కట్టాల్సిన రూ. 13 కోట్ల పన్ను బకాయిలను మాత్రం చెల్లించడంలేదన్నారు. నిబంధనలు ఉల్లంఘించి పర్యావరణాన్ని నాశనం చేస్తున్నా కాలుష్య నియంత్రణ మండలి మిల్లు యాజమాన్యానికి కనీసం ఒక్క నోటీసు కూడా ఎందుకు పంపించలేదని ప్రశ్నించారు. పన్ను బకాయిలు, కాలుష్యంపై ప్రశ్నిస్తే తాము 3 వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నామని యాజమాన్యం సాకులు చెప్పడం సరికాదన్నారు. పర్యావరణాన్ని రక్షించడం వారి ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు. గోదావరిలోకి మురుగునీరు కలవ కుండా అత్యుత్తమ టెక్నాలజీతో వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు నిర్మాణానికి నిధులు కేటాయించాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
సంవత్సరం కాదు.. ఆరు నెలలే టైముంది
గోదావరి పరిశీలన అనంతరం మునిసిపల్ కార్పొరేషన్‌లో అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గోదావరి పుష్కరాలు 6 జిల్లాల పరిధిలో జరుగుతాయి. ట్రయల్ రన్‌గా జూన్ 25 నాటికి మోడ్రన్ పుష్కర పంచాయతీ సిద్ధం చేయాలి. రెండు ఘాట్లను పూర్తి స్థాయిలో నిర్మించాలి. ఒక పైలట్ ప్రాజెక్టుగా ఈ పని చేయాలి. మీరంతా పుష్కర పనులకు ఏడాదికాలం ఉందనుకుంటున్నారు కానీ, వర్షాకాలం తీసేస్తే కేవలం 6 నెలలు మాత్రమే పుష్కర పనులకు సమయం ఉంటుంది. ఇన్ని పనులు సాధ్యమా? పుష్కరాల నిర్వహణకు సుమారు రూ. 8,800 కోట్లు అవసరం. పుష్కర జిల్లాల పరిధిలో రూ. 1,080 కోట్ల అంచనా వ్యయంతో 1,324 కిలోమీటర్ల మేర రోడ్లు అభివృద్ధికి రూ. 889 కోట్లతో పనులు ప్రతిపాదనల్లో ఉన్నాయి. కనెక్టివిటీని పెంచేందుకు రూ. 975 కోట్ల వ్యయంతో 850 కిలోమీటర్లు రోడ్లు వేయాల్సి ఉంటుంది. జనసందోహం అంతా కేవలం రాజమండ్రికే పరిమితం కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు వికేంద్రీకరించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి. పుష్కరనగర్‌లు, పుష్కర పంచాయతీలు ఏర్పాటు చేయాలి. ఇందులో భాగంగా ఒక పంచాయతీని పైలెట్ ప్రాజెక్టుగా తీసుకుని జూన్ 25 నాటికి సిద్ధం చేయాలి’ అని తెలిపారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు ఆదిరెడ్డి వాసు, గోరంట్ల బుచ్చయ్చచౌదరి, బత్తుల బలరామకృష్ణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.