Share News

డంపింగ్‌ యార్డు రహితంగా రాష్ట్రం

ABN , Publish Date - May 31 , 2026 | 05:04 AM

రాష్ట్రాన్ని డంపింగ్‌ యార్డు రహితంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు.

డంపింగ్‌ యార్డు రహితంగా రాష్ట్రం

  • కాలుష్య రహితంగా గోదావరి పుష్కరాలు

  • 268 పుష్కర పంచాయతీల్లో ప్రత్యేక వర్క్‌షా్‌పలు

  • సింగపూర్‌, ఇండోర్‌ నమూనాల్లో వ్యర్థాల నిర్వహణ

  • కొండవీడు జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

యడ్లపాడు, మే 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాన్ని డంపింగ్‌ యార్డు రహితంగా తీర్చిదిద్దడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. పల్నాడు జిల్లా కొండవీడులోని జిందాల్‌ వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను శనివారం ఆయన సందర్శించారు. ప్లాంట్‌లో చెత్తను వేరు చేసే ప్రక్రియను, బాయిలర్లలో మండించి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే విధానాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ రాష్ట్రంలో రోజువారీగా 7,200 టన్నుల పొడి చెత్త ఉత్పత్తి అవుతోందని తెలిపారు. కొండవీడులోని జిందాల్‌ ప్లాంట్‌ నిత్యం 1,400 టన్నుల పొడి చెత్తను ప్రాసెస్‌ చేసి సగటున 20 మెగావాట్ల విద్యుత్‌ను గ్రిడ్‌కు అందజేస్తోందని వివరించారు. విశాఖలోని ప్లాంట్‌ ద్వారా 15 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. రాష్ట్రంలో మరో 6 ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కాకినాడలో ఇప్పటికే పనులు ప్రారంభం కాగా కడప, కర్నూలు, విజయవాడ, తిరుపతి ప్రాంతాల్లో ప్లాంట్ల ఏర్పాటుకు సుముఖంగా ఉన్నట్లు ప్రకటించారు. ప్రతి 100 కిలోమీటర్ల పరిధిలో ఒక వేస్ట్‌ టు ఎనర్జీ ప్లాంట్‌ను ఏర్పాటు చేసి సమీప నగరాలు, గ్రామపంచాయతీల నుంచి చెత్తను సేకరించి ప్లాంట్లకు తరలిస్తామని చెప్పారు. ఒక మెగావాట్‌ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్‌ ఏర్పాటుకు రూ.25 కోట్లు ఖర్చవుతుందని, దీనికి సగటున 2.5 టన్నుల చెత్త, 4.5 టన్నుల స్టీమ్‌ అవసరమవుతాయని తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. విద్యుత్‌ మాత్రమే కాకుండా పూలు, కూరగాయల వ్యర్థాల నుంచి బయో మిథిలైజేషన్‌ ప్రక్రియ ద్వారా బయోగ్యాస్‌ ఉత్పత్తి చేయవచ్చని, చివరకు మిగిలే బూడిదను ఇటుకల తయారీకి వాడుకోవచ్చని పవన్‌ సూచించారు.


వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ

రాబోయే గోదావరి పుష్కరాలను కాలుష్య రహితంగా నిర్వహించాలనే పట్టుదలతో ప్రభుత్వం ఉందని డిప్యూటీ సీఎం పేర్కొన్నారు. నదిలో ఎలాంటి వ్యర్థాలు కలవకుండా జిందాల్‌ తరహా పక్కా మేనేజ్‌మెంట్‌ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు. పుష్కరాలతో ప్రత్యక్ష సంబంధం ఉన్న 268 పంచాయతీలను క్లస్టర్లుగా విభజించి అక్కడి అధికారులకు వ్యర్థాల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ, వర్క్‌షా్‌పలు నిర్వహిస్తామని తెలిపారు. సింగపూర్‌లోని టాంజాంగ్‌ టెర్మినల్‌ తరహాలో వైజాగ్‌ పోర్టులో కూడా చెత్తను వేరు చేసే ప్రక్రియను ప్రయోగాత్మకంగా పరిశీలిస్తామని అన్నారు. స్వచ్ఛభారత్‌ అవార్డులు వరుసగా గెలుచుకుంటున్న ఇండోర్‌ నగరపాలక సంస్థలో చేపడుతున్న వ్యర్థాల సేకరణ విధానాన్ని ఆదర్శంగా తీసుకుని ప్రత్యేక మార్గదర్శకాలు రూపొందిస్తున్నామని వివరించారు. చెత్త ద్వారా పంచాయతీలు ఆదాయం ఎలా గడించవచ్చో వివరిస్తూ గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని అధికారులను పవన్‌ ఆదేశించారు. కాగా, వ్యర్థాల సేకరణ, ఇంధన ఉత్పత్తిపై ప్లాంట్‌ ఆపరేషన్స్‌ హెడ్‌ చారి రూపొందించిన ప్రత్యేక నివేదికను పరిశీలించిన పవన్‌, దీనిపై సమగ్ర ప్రజంటేషన్‌ ఇవ్వాలని కోరుతూ అందుకు ప్రత్యేకంగా సమావేశం అవుదామన్నారు. కార్యక్రమంలో పంచాయతీరాజ్‌ కమిషనర్‌ కృష్ణతేజ, కాలుష్య నియంత్రణ మండలి ఎన్విరాన్‌మెంట్‌ ఇంజనీర్‌ నజీమా బేగం పాల్గొన్నారు.

Updated Date - May 31 , 2026 | 05:05 AM