Share News

అన్ని కులాలూ ఓట్లేస్తేనే గెలుస్తారు

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:05 AM

‘నాకు ఒక కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన కులాలకతీతంగా రాజకీయం చేస్తుంది. అన్ని కులాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు.

అన్ని కులాలూ ఓట్లేస్తేనే గెలుస్తారు

  • కులాల కుట్రలకు దూరంగా ఉందాం

  • నాకు కులాన్ని అంటగట్టే యత్నాలు దారుణం

  • వ్యక్తిగత తప్పులను వ్యక్తిగతంగానే ప్రశ్నించాలి

  • వాటిలోకి సామాజిక వర్గాలను లాగకూడదు

  • ఇదే జనసేన నిశ్చిత వైఖరి

  • యువత అభివృద్ధి, సుపరిపాలన కోరుకుంటున్నారు

  • నవతరం జెన్‌ జీ ఆలోచనలు భిన్నంగా ఉన్నాయి

  • వారి ఆశయాలకు అనుగుణంగానే ‘సేనా గళం’

  • ఇందులో అన్ని వర్గాలకూ చోటు: పవన్‌

  • పార్టీ ముఖ్య నాయకులతో డిప్యూటీ సీఎం భేటీ

తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొందరు కులం, మతం, ప్రాంతీయత వంటి భావావేశాల ముసుగు వేసుకుని దాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయ సంస్కృతిని నేటి యువత తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్న వాస్తవాన్ని గుర్తెరగడం లేదు.

- పవన్‌ కల్యాణ్‌

అమరావతి, మే 31 (ఆంధ్రజ్యోతి): ‘నాకు ఒక కులాన్ని అంటగట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జనసేన కులాలకతీతంగా రాజకీయం చేస్తుంది. అన్ని కులాలు ఓట్లేస్తేనే ఎవరైనా గెలుస్తారు. కుల రాజకీయాలను అరికట్టేందుకు ఎవరో ఒకరు బాధ్యత తీసుకోవాలి. లేదంటే ఆ ఆలోచనా విధానం ప్రజల్లో అగాధాలు సృష్టిస్తుంది’ అని జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అన్నారు. కులం, మతం, ప్రాంతంతో ముడిపెడుతున్నారని ఆక్షేపించారు. కులాల కుట్రలకు దూరంగా ఉందామని పిలుపిచ్చారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో పార్టీ ముఖ్య నేతలతో ఆయన సమావేశమయ్యారు. ‘కొందరు వ్యక్తుల తప్పులను వారి వ్యక్తిగత చర్యలుగా కాకుండా.. వారు చెందిన కులం, మతం లేదా వర్గాలతో ముడిపెట్టి సామాజిక విభేదాలను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది సమాజంలో విద్వేషాలకు కారణమవుతోంది. వ్యక్తిగత తప్పులను వ్యక్తిగత స్థాయిలోనే ప్రశ్నించాలి తప్ప.. వాటిలోకి సామాజిక వర్గాలను లాగకూడదనే స్పష్టమైన విధానాన్ని జనసేన అవలంబిస్తోంది. పార్టీలో అంతర్గతంగా సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ కోసం ‘సేనా గళం’ పేరుతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నా’ అని ప్రకటించారు. ఈ కమిటీలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన సభ్యులుంటారని చెప్పారు. సామాజిక సామరస్యం, బాధ్యతాయుత రాజకీయాలు, రాజ్యాంగ విలువల పరిరక్షణ.. ముఖ్యంగా జెన్‌ జీ యువత ఆశయాలకు అనుగుణంగా గళం వినిపించడమే కమిటీ ప్రధాన లక్ష్యమని చెప్పారు.


కులం చాటున అన్యాయం..

కుల ప్రస్తావన లేని రాజకీయం లేదని, కులం చాటున అన్యాయం జరుగుతోందని పవన్‌ తెలిపారు. ‘రాష్ట్రంలో మెజారిటీ యువత జనసేన వైపు ఉన్నారు. వారంతా మంచి పరిపాలన, అభివృద్ధి కోరుకుంటున్నారు. కులాల కుంపటిలో నుంచి యువతను దూరంగా ఉంచే బాధ్యతను జనసేన తీసుకుంటుంది. ముల్లును ముల్లుతోనే తీయాలి.. కాపులు తిడితే కాపులతోనే తిట్టించాలి.. రెడ్లు, కమ్మవారు విమర్శిస్తే ఆ సామాజిక వర్గాలతోనే ప్రతి విమర్శ చేయించాలి.. ఎస్సీలు ఆరోపణలు చేస్తే అదే కులాల వారితో ఆరోపణలు చేయించాలన్న బూర్జువా పంథాలోనే రాజకీయ పార్టీలు మునిగి తేలుతున్నాయి. నవతరం జెన్‌-జీ ఆలోచనలు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. కుళ్లు, కుట్రలు, కుతంత్రాలు లేని రాజకీయాలను నేటి తరం కోరుకుంటుంది. ఇందుకు తొలి అడుగుగా జనసేన అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్లాలి. పాతబడి బూజుపట్టిన విధానాలకు తిలోదకాలివ్వాలి. అందుకే సేనా గళం ఏర్పాటు చేస్తున్నాను’ అని వివరించారు.


‘నేను విశ్వనరుడను..’

‘కులమతాలు గీచుకున్న గీతల్జొచ్చి.. పంజరానబడను నేను.. నిఖిల లోకమెట్లు నిర్ణయించిన.. నాకు తిరుగు లేదు.. విశ్వనరుడ నేను’ -అని విశ్వ మానవ కల్యాణం కోసం గుర్రం జాషువా కవిత్వం రాశారని పవన్‌ గుర్తుచేశారు. ఈ దేశంలోని చాలా మంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడన అనుభవించినా దేశాన్ని నిందించలేదని తెలిపారు. ‘తెలుగు జాతిని ఆయన నిందించలేదు. జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. జాషువా తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం చేశారు.. ఈ వాక్యాలను గుర్రం జాషువా కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని విశ్లేషిస్తూ మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్‌ రాశారు’ అని నాయకులకు పవన్‌ వివరించారు. జాషువా, ఆయన భావాలను గౌరవిస్తూ జనసేన సిద్ధాంతాల్లో ’కులాలను కలిపే ఆలోచనా విధానం, మతాల ప్రస్తావన లేని రాజకీయం’ అనే అంశాలు పొందుపరిచానని తెలిపారు. సమావేశంలో మంత్రి నాదెండ్ల మనోహర్‌, ఎమ్మెల్యేలు కొణతాల రామకృష్ణ, వంశీకృష్ణ, బొలిశెట్టి శ్రీనివాస్‌, బొమ్మిడి నాయకర్‌, లోకం నాగమాధవి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తదితర నేతలు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2026 | 05:07 AM