Share News

కూటమి విచ్ఛిన్నానికి కుట్ర!

ABN , Publish Date - Mar 07 , 2026 | 04:03 AM

రాష్ట్రంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

కూటమి విచ్ఛిన్నానికి కుట్ర!

  • 11 మందే ఉన్నా.. 1100 మంది ఉన్నట్లు మాట్లాడుతున్నారు: పవన్‌

  • వాళ్లే కల్తీ చేస్తారు.. వాళ్లే బూతులు తిడతారు

  • ఇష్టమొచ్చినట్లుగా తిట్టేసి..కులాల వెనుక దాక్కుంటున్నారు

  • సుస్థిర అభివృద్ధి కోసం కూటమి 15 ఏళ్లు అధికారంలో ఉండాలి

  • గొడవల్లేకుండా బలంగా ఉండాలి

  • ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం ఈ బడ్జెట్‌

  • బడ్జెట్‌ చర్చలో డిప్యూటీ సీఎం వ్యాఖ్యలు

  • పయ్యావుల, లోకేశ్‌కు ప్రశంసలు

ముఖ్యమంత్రి చంద్రబాబు దూరదృష్టి, పరిపాలన దక్షత, దార్శనికత ఈ బడ్జెట్‌లో స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుబాటులో ఉన్న పరిమితమైన వనరులను జాగ్రత్తగా వినియోగించుకుంటూ రూ.3,32,205 కోట్లతో బడ్జెట్‌ను ప్రవేశపెట్టినందుకు అభినందనలు.

- డిప్యూటీ సీఎం పవన్‌

అమరావతి, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కూటమిని విచ్ఛిన్నం చేయడానికి వైసీపీ కుట్రలు చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు. ఈ నేపథ్యంలో కూటమి నేతలందరం గొడవలకు తావివ్వకుండా ఐక్యంగా ముందుకు వెళ్దామన్నారు. కూటమి చాలా బలంగా ఉండాలనేది తన ఆకాంక్షగా పేర్కొన్నారు. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి పార్టీ పరంగా ఒంటరి పోరాటం చేయడం కన్నా కూటమితో కలిసి ముందుకు వెళ్లాలని భావించే 2014లో ఎలాంటి పదవులూ ఆశించకుండా కష్టపడ్డానని అన్నారు. 2019 ఎన్నికల్లో అది సాధ్యం కాలేదని, 2024 ఎన్నికల్లో తగ్గి చంద్రబాబుకు అండగా నిలబడ్డానని చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలు, సుస్థిర అభివృద్ధి కోసం 15 ఏళ్ళ పాటు కూటమి బలంగా ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. అందుకే గొడవలకు తావివ్వకుండా కూటమి పార్టీలు కలిసికట్టుగా ఉండాలని ఆకాంక్షించారు. శుక్రవారం శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో ఆయన మాట్లాడారు. వైసీపీ కుట్రలు, కుతంత్రాలను ఎండగట్టారు. ‘వైసీపీ వాళ్లు వ్యవహరిస్తున్న తీరు.. దొంగే.. దొంగ దొంగ అన్న చందంగా ఉంది. తిరుమల లడ్డూలో వాడే నెయ్యిని వాళ్లే కల్తీ చేస్తారు.. నిందలు కూటమి ప్రభుత్వంపై వేస్తారు.


తిరిగి బూతులూ వాళ్లే తిడతారు. వాళ్లు కేవలం 11 మందే (వైసీపీ ఎమ్మెల్యేలు)ఉన్నా.. 1,100 మంది ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఇష్టమొచ్చినట్లుగా తిట్టేసి కులాల వెనుక దాక్కుంటున్నారు. ఇతరుల స్వేచ్ఛను, హక్కులను హరించడం వారి హక్కుగా భావిస్తున్నారు. పదేపదే వాళ్లు చెప్పే అబద్ధాలను ప్రజలు నిజమని నమ్మే ప్రమాదం ఉంది. వైసీపీ వాళ్లను కరెక్ట్‌ చేయాలంటే కూటమి కలిసికట్టుగా ఉండాలి. కులాలు, మతాలు, ప్రాంతాలను దాటకపోతే రాష్ట్ర ప్రయోజనాలను కాపాడలేం’ అని స్పష్టం చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..


అది విధ్వంస పాలన.. మనది దార్శనిక పాలన

గత ప్రభుత్వం ధ్వంసం, విధ్వంసం, విచ్ఛిన్నకర విధానాలతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తే.. మన కూటమి ప్రభుత్వం దూరదృష్టి, దక్షత, దార్శనికతతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తోంది. సీఎం చంద్రబాబు సారథ్యంలో.. ప్రధాని మోదీ సహకారంతో ఏర్పడిన ఈ ప్రభుత్వం మరికొద్దికాలంలోనే రెండేళ్లు పూర్తి చేసుకోబోతోంది. రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి చంద్రబాబు మార్గదర్శకత్వంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ ప్రవేశపెట్టిన 2026-27 వార్షిక బడ్జెట్‌ 5 కోట్ల మంది ప్రజల అవసరాలను, ఆకాంక్షలను గుర్తించింది. వాటిని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది.

9.74 లక్షల కోట్ల అప్పులతో 30 ఏళ్లు వెనక్కి.

గత వైసీపీ ప్రభుత్వం రూ.9.74 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక విధ్వంసం సృష్టించడంతో రాష్ట్రాభివృద్ధి 30 ఏళ్లు వెనక్కి పోయింది. కేంద్రం నుంచి వచ్చిన రూ.10,500 కోట్ల నిధులను సద్వినియోగం చేసుకోవడంలో గత ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కేంద్ర ప్రాయోజిత పథకాలకు మ్యాచింగ్‌ గ్రాంటు విడుదల చేయకపోవడంతో రాష్ట్రానికి రావలసిన రూ.8,700 కోట్లూ మురిగిపోయాయి. వివిధ శాఖల పరిధిలో పనులు చేసిన కాంట్రాక్టర్లు, వెండర్లకు రూ.1.35లక్షల కోట్లు బకాయిలు పెట్టారు. కూటమి ప్రభుత్వం వాళ్లు వదిలివెళ్లిన అప్పులను తీర్చుకుంటూ.. 2025-26లో కేంద్ర ప్రాయోజిత పథకాలకు రూ.18,700 కోట్లు విడుదల చేశాం. రూ.25 వేల కోట్ల మేర కాంట్రాక్టర్లకు బకాయిలు చెల్లించాం. వివిధ శాఖలవారీగా ప్రాజెక్టులకు మరో రూ.37 వేల కోట్లు విడుదల చేశాం. పులివెందుల, డోన్‌, ఉద్దానం తాగునీటి ప్రాజెక్టులకు రూ.400కోట్లు కేటాయించాం. రూ.7,910 కోట్లతో 5 జిల్లాల పరిధిలో మెగా వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టులను ప్రారంభించాం. 2027 చివరి నాటికి ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయనున్నాం.


2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వం చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా(పీపీఏ)లను జగన్‌ ప్రభుత్వం రద్దు చేసేసింది. తర్వాత బాధ్యత లేకుండా అధిక ధరలకు కరెంటు కొనడంతో డిస్కంలకు రూ.12,250 కోట్ల నష్టం వాటిల్లింది. ఆ ఐదేళ్లలో అసమర్థ విధానాలతో డిస్కంలు దాదాపు రూ.1.29 లక్షల కోట్లు నష్టపోయాయి. ఈ భారాన్నంతా తిరిగి ప్రజలపైనే వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ట్రూఅప్‌ చార్జీలు ఎత్తివేయడమే కాకుండా రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా ట్రూడౌన్‌ పేరుతో విద్యుత్‌ భారాలు తగ్గించింది.

న్యాయవ్యవస్థ ప్రాధాన్యం పెంచుతున్నాం

నేషనల్‌ జ్యుడీషియల్‌ డేటా గ్రిడ్‌ లెక్కల ప్రకారం.. దేశవ్యాప్తంగా 1,11,59,767 సివిల్‌ కేసులు, 3,80,60,784 క్రిమినల్‌ కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని ఎలా తగ్గించగలమనే అంశంపై అసెంబ్లీ దృష్టిలో పెట్టాలని ఇటీవల గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ను కలిసినప్పుడు నాతో చెప్పారు. దేశంలో ఉన్న కోర్టుల సంఖ్యకు, మౌలిక సదుపాయాలకు, రోజువారీ నమోదవుతున్న కేసుల సంఖ్యకు మధ్య స్పష్టమైన అసమతుల్యత ఉంది. ఈ పరిస్థితుల్లో కేసులన్నీ పరిష్కారం కావడానికి ఎన్ని దశాబ్దాలు పడుతుందో చెప్పడం కష్టం. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వాలు బడ్జెట్‌లో న్యాయశాఖకు తగిన నిధులు కేటయించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది బడ్జెట్‌లో దాదాపు 100 కొత్త కోర్టు భవనాల నిర్మాణానికి రూ.349 కోట్లు కేటాయించిన మంత్రి పయ్యావుల కేశవ్‌కు అభినందనలు. విద్యాశాఖలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న లోకేశ్‌కు అభినందనలు.


గుర్తెరిగి ముందుకెళ్లాలి డిప్యూటీ సీఎం పవన్‌

ఇంటింటా స్వదేశీ ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వాలని, యువత సామర్థ్యాన్ని చాటిచెప్పేలా ఈ ఆలోచనలున్నాయని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ అన్నారు. వికసిత్‌ భారత్‌లో అందరూ భాగస్వాములు కావాలని, కూటమి ప్రభుత్వం ఎక్కువ కాలం కొనసాగితేనే ఇది సాధ్యమని చెప్పారు. 11 మంది ఉన్నా 1100 మంది మాదిరిగా ప్రవర్తిస్తున్నారని, హింసను పెంచేలా వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. మన ఐక్యతతో వారు బలహీనపడతారని, విడిపోతే వారు బలపడతారని తెలిపారు. ఈ విషయం గుర్తుంచుకుని స్థిరమైన విధానాలతో ముందుకెళ్దామన్నారు. దక్షత, దార్శనికత ఉన్న సీఎం చంద్రబాబును అభినందించాలని పిలుపునిచ్చారు. ఆయన వల్లే సంక్షేమ కార్యక్రమాలు సమర్థ వంతంగా అమలవుతున్నాయన్నారు.

Updated Date - Mar 07 , 2026 | 04:04 AM