స్వచ్ఛంగా.. శుభ్రంగా..
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:30 AM
గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నదే కూటమి ప్రభుత్వ తపన అని, ఇందుకు అనుగుణంగా గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా..
మురుగు రహితంగా ‘పుష్కర’ పంచాయతీలు
చుక్క మురుగు కూడా గోదారిలోకి కలవకూడదు
ప్రతి పంచాయతీకీ ప్రత్యేక ప్రణాళిక అవసరం
‘సప్తర్షి’ పేరిట దేశంలోనే మోడల్‌గా మునికూడలి పుష్కర్‌ఘాట్
గోదావరి పుష్కర ఏర్పాట్లపై ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సమీక్ష
అమరావతి, జూన్ 6(ఆంధ్రజ్యోతి): గోదావరి పుష్కరాలను స్వచ్ఛంగా, శుభ్రంగా నిర్వహించాలన్నదే కూటమి ప్రభుత్వ తపన అని, ఇందుకు అనుగుణంగా గోదావరి పుష్కరాలకు ఆతిథ్యం ఇచ్చే 268 గ్రామ పంచాయతీలను మోడల్ పంచాయతీలుగా తీర్చిదిద్దుదామని ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అధికారులను ఆదేశించారు. గోదావరి మోడల్ పుష్కర్ పంచాయతీ ప్రణాళికపై శనివారం ఆయన సంబంధిత జిల్లా కలెక్టర్లతో, పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘పంచాయతీల నుంచి వచ్చే మురుగునీరు చుక్క కూడా గోదావరి లోకి కలవకుండా చర్యలు తీసుకోవాలి. జీరో లిక్విడ్ డిశ్చార్జ్ పంచాయతీలుగా తీర్చిదిద్దే బాధ్యతను జిల్లా కలెక్టర్లు తీసుకోవాలి. ఆయా పంచాయతీల్లో సీసీరోడ్లు, మ్యాజిక్ డ్రైన్లు ద్వారా మురుగునీటిని సమూలంగా అరికట్టేలా ప్రణాళికలను సిద్ధం చేయాలి. ఇందుకు పక్కా ప్రణాళికలు సిద్ధం చేయాలి. పుష్కరఘాట్లు, పుష్కర నగర్‌ల వద్ద ఏర్పాట్లు, సౌకర్యాల విషయంలో ముందస్తు ప్రణాళిక అవసరం. ముఖ్యంగా కాలుష్యరహిత గోదావరి పుష్కరాల నిర్వహణ అనేది లక్ష్యంగా పెట్టుకుని ముందుకెళ్తున్నాం. ఇందుకు అనుగుణంగా పనిచేయాలి. పుష్కర నగర్‌లవద్ద పార్కింగ్, వీధి దీపాలు, వస్త్రాలను మార్చుకునే గదులు, జల్లు స్నానాలు, రోడ్లు, డ్రెయిన్లు, ఆలయాలు, ఇతర ఏర్పాట్లన్నీ పక్కాగా ఉండేలి. వాహనాల నిలుపుదలకు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ప్రత్యేకంగా ఇవ్వాలి. ఘాట్ వెడల్పు, వచ్చే జనంపై ముందస్తు అంచనా చాలా ముఖ్యం. అవసరమైతే ఘాట్ వెడల్పు పెంచే వెసులుబాటును ముందస్తుగానే ఉంచుకోవాలి. పంచాయతీల మురుగునీటి వ్యవస్థను సరిదిద్దాలి. ఒక్క చుక్క మురుగునీరు గోదావరి కలవకూడదు.
ప్రధాన ఘాట్లలో గోదావరికి హారతి కార్యక్రమం గురించి దేవదాయశాఖను సమన్వయం చేసుకుని ఆలయాల పునరుద్ధ్దరణ పనులను వేగవంతం చేయాలి. సీతానగరం వద్ద ఉన్న మునికూడలి ఘాట్‌ను సప్తర్షి పుష్కర ఘాట్ పేరుతో జాతీయ స్థాయి మోడల్ ఘాట్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ముందుకెళ్లాలి. 80 మీటర్ల వెడల్పు ఉన్న ఈ ఘాట్ వద్ద 75 వేల మంది పుష్కర స్నానం చేసేందుకు అనువుగా ఉంటుంది. పార్కింగ్ కోసం రైతుల పొలాలను ఉపయోగించినా, మట్టి తీసినా పార్కింగ్ ఫీజులో వారికి వాటా ఇచ్చేలా ప్లాన్ చేయాలి. ఈ ఘాట్ వద్ద సోమేశ్వరాలయం, వేణుగోపాలస్వామి ఆలయాలున్నాయి. వాటిని ఆధునికీకరించే పనులు వేగవంతం చేయాలి.’ అని పవన్ అన్నారు. ఈ నెలలో జరగనున్న క్యాబినెట్ సమావేశం తర్వాత మునికూడలి ఘాట్‌ను సందర్శిస్తానని, పనులను పరిశీలిస్తాని తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ, ఓఎస్‌డీ వెంకటకృష్ణ తదితరులున్నారు.
పెదపెంకిలో పైలేరియాను తరిమికొట్టాం
పార్వతీపురం: ఈ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా బలిజపేట మండలం పెదపెంకిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆ జిల్లా అధికారులతో ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ సమీక్ష నిర్వహించారు. పెదపెంకి భయానక ఫైలేరియా వ్యాధి బారినపడిన వైనం 2018లోనే తన దృష్టికి వచ్చిందన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సమస్యమీద ప్రత్యేక దృష్టి సారించడంతో శాశ్వతంగా పరిష్కరించే మార్గాలను కనుగొన్నామన్నారు. గ్రామం మొత్తం మీద 197 ఫైలేరియా కేసులు నమోదై జాతీయ స్థాయికి వెళ్లిన ఈ సమస్యను ఓ ప్రణాళిక ప్రకారం యంత్రాంగం అధిగమించిందని అధికారులను ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ అభినందించారు. ప్రస్తుతం అక్కడ రూ..6 కోట్లతో చేపడుతున్న అభివృద్ధి పనులతోపాటు, ఆక్రమణల తొలగింపుపై మన్యం కలెక్టర్ ప్రభాకరరెడ్డి ఉపముఖ్యమంత్రి పవన్‌కు వివరించారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న డిప్యూటీ సీఎం మన్యం జిల్లా పర్యటన చేపట్టనున్నట్లు సమాచారం.