గోదావరి ప్రక్షాళన!
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:06 AM
పవిత్ర గోదావరి నది కళ్ల ముందే కలుషితమవుతుంటే ఇన్నాళ్లూ ఏం చేశారని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
కళ్ల ముందే కలుషితమవుతుంటే ఇన్నాళ్లూ ఏం చేశారు?
అధికారులను నిలదీసిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
తీవ్రంగా కలుషితమైనట్టు ల్యాబ్ నివేదికలో వెల్లడి
జిల్లా అధికారులతో పవన్ అత్యవసర సమీక్ష
సాయం కోసం కేంద్రంతో మాట్లాడతానని వెల్లడి
ఆంధ్రా పేపర్‌మిల్లుకు నోటీసుల జారీకి ఆదేశం
నగరపాలక సంస్థ, పీసీబీ అధికారులకు కూడా..
అమరావతి, రాజమహేంద్రవరం, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): పవిత్ర గోదావరి నది కళ్ల ముందే కలుషితమవుతుంటే ఇన్నాళ్లూ ఏం చేశారని అధికారులపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. నది ప్రక్షాళనకు అవసరమైతే కేంద్ర ప్రభుత్వ సాయం కోసం జలశక్తిశాఖ మంత్రితో ప్రత్యేకంగా మాట్లాడతానని చెప్పారు. రాజమండ్రిలోని కోటి లింగాల ఘాట్, నల్లా చానల్ పరిసరాల్లో గోదారి నీరు తీవ్రంగా కలుషితమై, మురికిగా మారినట్టు ల్యాబ్ పరీక్షల్లో తేలిందన్నారు. ఇందుకు కారణమైన ఆంధ్రా పేపర్ మిల్లు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కాలుష్య నియంత్రణ మండలి అధికారులను ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన రాజమండ్రి పీసీబీ అధికారులపైనా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని నిర్దేశించారు. గత నెల 25న పవన్‌కల్యాణ్ బోటుపై వెళ్లి నదిలో కాలుష్యాన్ని పరిశీలించిన విషయం తెలిసిందే. గోదావరిలో నీటి కాలుష్యంపై ల్యాబ్ నివేదిక వచ్చిన నేపథ్యంలో సోమవారం మంగళగిరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కాలుష్య నియంత్రణ మండలి, తూర్పుగోదావరి జిల్లా ఉన్నతాధికారులతో అత్యవసరంగా సమీక్షించారు. కోటిలింగాల ఘాట్, నల్లా చానెల్ వద్ద కాలుష్యం ప్రమాదకర స్థాయిలో ఉందని కాలుష్య నియంత్రణ మండలి అధికారులు వివరించారు. ఆ నీటి వల్ల ప్రజలు ఏ వ్యాధుల బారినపడతారని పవన్ అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలను జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయన దృష్టికి తీసుకెళ్లారు. కళ్ల ముందే నది కలుషితమవుతుంటే ఇన్ని రోజులుగా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకుండా కాలయాపన చేశారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న పరిశ్రమలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు. ‘నేను ఇటీవల రాజమహేంద్రవరం వచ్చినపుడు పేపర్ మిల్లు వ్యర్థ జలాలను పరిశీలించాను.
అంత కాలుష్యం నదిలో కలుస్తుంటే ఎందుకు పట్టించుకోలేదు. పేపరు మిల్లు మూడు వేల మందికి ఉపాధి కల్పిస్తోందని చెబుతున్నారు. అలాగని 10 లక్షల మందికి హాని చేస్తారా? రాజకీయాల అడ్డంకులు సంగతి తర్వాత, ముందు నోటీసులు ఇవ్వాలి కదా? రసాయన వ్యర్థ జలాలను తూర్పు లంకలోని మళ్లలోకి పంపిస్తుంటే.. అక్కడ నమూనాలను ఎందుకు పరీక్ష చేయడం లేదు? అసలు ఆడిట్ ఉందా?’ అని అసహనం వ్యక్తం చేశారు. మునిసిపల్ కార్పొరేషన్ కూడా ఇప్పటివరకూ ఎందుకు ఉదాసీనంగా ఉందని ప్రశ్నించారు. నల్లా చానెల్ నుంచి మురుగు నీటిని ఎస్టీపీకి పంపుతున్నామని.. ముంపు నీరు, మురుగు నీరు వెళ్లడానికి ఒకే మార్గం కావడంతో ఇబ్బంది ఉందని గుర్తించామని కలెక్టర్ చెప్పారు. అవసరమైన కసరత్తు చేసిన తర్వాత ఆరు చోట్ల ఎస్టీపీ (సీవేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్)లను ఏర్పాటు చేయడానికి నివేదిక సిద్ధం చేశామని, కేంద్ర ప్రభుత్వం ద్వారా నిధులు సమకూర్చుకుంటే సమస్యను చాలావరకు పరిష్కరించవచ్చన్నారు. దీనిపై డిప్యూటీ సీఎం స్పందిస్తూ.. తనకు ఆ వివరాలు ఇస్తే ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధుల విడుదలకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. కాలుష్యం నుంచి గోదావరి నది బయట పడాల్సిందేనని స్పష్టం చేశారు. ల్యాబ్ నివేదిక ప్రకారం ఆ ఫ్యాక్టరీని తక్షణమే మూసివేయడానికి, ఉత్పత్తిని నిలిపివేయడానికి, భారీ జరిమానా విధించడానికి ప్రభుత్వానికి పూర్తి అధికారాలున్నాయని చెప్పారు. అయితే, పరిశ్రమ మనుగడ, కార్మికుల ఉపాధిని దృష్టిలో ఉంచుకుని తప్పులను సరిదిద్దుకునేందుకు పరిశ్రమకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. పరిశ్రమలను మూసివేసి, కార్మికులను రోడ్డున పడేయడం తమ ప్రభుత్వ ఉద్దేశం కాదని, నదిని కాపాడటమే తమ లక్ష్యమని స్పష్టం చేశారు. యుద్ధప్రాతిపదికన లోపాలను సరిదిద్దుకోవాలని పరిశ్రమలకు సూచించారు. మురుగునీటి సమస్యకు రాజమండ్రి నగరపాలక సంస్థ శాశ్వత పరిష్కారం చూపాలని, చుక్క మురుగునీరు కూడా శుద్ధి కాకుండా గోదావరిలోకి వెళ్లకూడదని తేల్చిచెప్పారు. సమీక్షలో పీసీబీ చైర్మన్ కృష్ణయ్య, సభ్య కార్యదర్శి శరవణన్, తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ రాహుల్ మీనా తదితరులు పాల్గొన్నారు.
ల్యాబ్ నివేదికలో ఏముందంటే..
సాధారణంగా నదిలో మనుషులు స్నానాలు చేయడానికి కోలిఫామ్ బ్యాక్టీరియా సంఖ్య 500 ఎంపీఎన్/100ఎంఎల్ లోపు ఉండాలి. కానీ నల్లా చానల్ సమీపంలోని కోటిలింగాల ఘాట్‌లో ఏకంగా 2,420 ఎంపీఎన్/100ఎంఎల్‌కు చేరింది. నీటిలో కాలుష్యాన్ని చూపే బయోకెమికల్ ఆక్సిజన్ పరిమితి 3ఎంజీ/ఎల్ కంటే తక్కువ ఉండాలి. కానీ 5.2ఎంజీ/ఎల్‌గా నమోదైంది. దీనివల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోయి జలచరాలు చనిపోతున్నాయి. నీటి స్వచ్ఛత గరిష్ఠంగా 5ఎన్‌టీయూ పాయింట్లు ఉండాలి. ల్యాబ్ పరీక్షల్లో 8.4 నుంచి 14.2 వరకు వచ్చింది. మురుగునీరు కలవడం వల్ల గోదావరి నీరు పూర్తిగా రంగుమారింది. మురుగు కాలువలో కెమికల్ ఆక్సిజన్ 200ఎంజీ/ఎల్ దాటకూడదు. కానీ 263ఎంజీ/ఎల్‌గా నమోదైంది. నీటిలో నైట్రేట్ పరిమితి 45ఎంజీ దాటకూడదు. అది ఏకంగా 119.6 ఎంజీ ఉంది. రసాయన ఎరువుల అవశేషాలు, ఫ్యాక్టరీల వ్యర్థాలు కలవడం వల్ల నైట్రేట్లు పెరిగిపోయాయి. ల్యాబ్ నివేదిక ప్రకారం ఈ నీరు స్నానాలు చేయడానికి, గృహావసరాలకు ఏమాత్రం పనికిరాదు. ఈ నీటి వల్ల కలరా, టైఫాయిడ్, విరేచనాలు, చర్మవ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ముఖ్యంగా నైట్రేట్లు ఎక్కువగా ఉండటం వల్ల చిన్నపిల్లలకు ఆక్సిజన్ అందక బ్లూ బేబీ సిండ్రోమ్ అనే వ్యాధి వచ్చే ముప్పు ఉంది. ఆంధ్రాపేపర్ మిల్లు లగూన్ వద్ద నీటిలో సల్ఫైడ్, డీవోబీ, ఫాస్ఫేట్లు పరిమితికి మించి ఉన్నాయి. బయోకెమికల్ ఆక్సిజన్ 30ఎంజీ/ఎల్ లోపు ఉండాలి. కానీ, 20శాతం అదనంగా 36ఎంజీ ఉంది. నీటిలో ఫాస్ఫేట్ పరిమితి 5ఎంజీ/ఎల్ ఉండాలి, కానీ, 5.3ఎంజీ ఉంది. నీటిలో సల్ఫైడ్ పరిమితి 2ఎంజీ మాత్రమే ఉండాలి, కానీ 3.4 ఎంజీ ఉంది. అంటే 70శాతం అధికంగా నమోదైంది. ఫ్యాక్టరీలు విడుదల చేస్తున్న వ్యర్థ జలాలు చుట్టుపక్కల ప్రజల ఆరోగ్యాన్ని, మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీస్తున్నాయి. ఈ నీటిని శుద్ధి చేయకుండా గృహావసరాలకు వాడటం ప్రజల ప్రాణాలకు అపాయకరమని నివేదిక హెచ్చరించింది.