Share News

మన హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు

ABN , Publish Date - Jul 08 , 2026 | 04:21 AM

రాష్ట్రంలోని హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. హస్తకళల పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

మన హస్తకళలకు అంతర్జాతీయ గుర్తింపు

  • టెంపుల్‌ టూరిజం తరహాలో హస్తకళల పర్యాటకం

  • గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనలు

  • కళాకారుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య శిబిరాల ఏర్పాటు

  • ప్రతి కళాకృతిపైనా క్యూఆర్‌ కోడ్‌తో కళాకారుడి వివరాలు

  • హస్తకళా మహోత్సవాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం

  • లేపాక్షి ఈ-కామర్స్‌ యాప్‌ను ఆవిష్కరించిన పవన్‌ కల్యాణ్‌

విజయవాడ, జూలై 7 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని హస్తకళలకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆకాంక్షించారు. హస్తకళల పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. విజయవాడలోని డాక్టర్‌ బి.ఆర్‌. అంబేడ్కర్‌ కళావేదికలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ (లేపాక్షి) మంగళవారం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హస్తకళా మహోత్సవాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా పవన్‌ మాట్లాడుతూ... రాష్ట్రానికే సొంతమైన హస్తకళల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తుందని భరోసా ఇచ్చారు. కళాఖండాన్ని రూపొందించిన కళాకారుడికి గుర్తింపు దక్కే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రతి కళాఖండంపైనా ప్రత్యేక క్యూఆర్‌ కోడ్‌ ఏర్పాటు చేస్తామని తెలిపారు. అందులో కళాకారుడి పేరు, అతను రూపొందించిన కళ సమాచారం పొందుపర్చాలని సూచించారు. వివిధ ప్రాంతాలకు చెందిన ప్రముఖ హస్త కళాకారులు ఏర్పాటుచేసిన స్టాళ్లను పవన్‌ సందర్శించారు. కాకినాడకు చెందిన తోలుబొమ్మల కళాకారులు ఏర్పాటు చేసిన స్టాల్‌లో రామాయణ, భారత, భాగవత కళారూపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా గోదావరి పుష్కరాల్లో తోలుబొమ్మలాట ప్రదర్శనను ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని పవన్‌ హామీ ఇచ్చారు. అనంతరం తిరుపతి వుడ్‌ కార్వింగ్‌ కళాకారులు రూపొందించిన చెక్కబొమ్మల స్టాల్‌ను సందర్శించి కళాకారులను ప్రశంసించారు. వారినుంచి శ్రీ వేంకటేశ్వరస్వామి ప్రతిమను కొనుగోలు చేశారు. కళాకారుల ఆరోగ్య పరిరక్షణ దిశగా ప్రత్యేక చర్యలు తీసుకుంటామని ఉపముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. క్లస్టర్ల వారీగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. కాగా, హస్తకళల అభివృద్ధి దిశగా తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఏలూరు కార్పెట్‌ కళాకారులు, అనంతపురం అరటి పీచు కళాకారుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలను పవన్‌ ప్రారంభించారు. గుంటూరు, కాకినాడల్లో పునరుద్ధరించిన లేపాక్షి షోరూంలు, రాజమహేంద్రవరం విమానాశ్రయంలో నూతనంగా ఏర్పాటు చేసిన షోరూంను ఆయన వర్చువల్‌గా ప్రారంభించారు.


హస్తకళలను బతికిద్దాం..: పవన్‌

‘భారతదేశపు మూలాలు హస్తకళా రంగాలపై ఆధారపడి ఉన్నాయి. వాటిని కోల్పోయిన రోజున దేశ సంస్కృతి, సంప్రదాయం, వారసత్వం కనుమరుగవుతాయి. మన ఉనికిని కోల్పోతాం. అందుకే హస్తకళలను రక్షించుకోవాలి, కళాకారులకు తగిన గౌరవం ఇవ్వాలి. వారసత్వాన్ని పరిరక్షించాలి’ అని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. హస్తకళాకారులతో ‘మన ఊరు- మాటామంతీ’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ‘కొండపల్లి బొమ్మలు, ఏటికొప్పాక లక్కబొమ్మలు, శ్రీకాళహస్తి, మచిలీపట్నం కలంకారీ, నరసాపురం లేసు ఉత్పత్తులు, బొబ్బిలి వీణ వంటి ఎన్నో గొప్ప కళాకృతులు, కళారంగానికి ఏపీ చిరునామా. ఇవి రాష్ట్ర గుర్తింపు, ఉనికికి ప్రతిరూపాలు. రాష్ట్రంలో 2లక్షల మందికి పైగా హస్తకళాకారులు ఉన్నారు. వీరి చేతుల్లో నైపుణ్యంతో పాటు తరతరాల సంప్రదాయం దాగుంది’ అని పవన్‌ పేర్కొన్నారు. సంప్రదాయ హస్తకళలను గ్లోబల్‌ మార్కెట్‌తో అనుసంధానం చేసే ప్రక్రియ జరగాలని ఆక్షాంక్షించారు. ఘన వ్యర్థాల నిర్వహణ అనేది కేవలం ఆలోచన కాదని, అది గ్రామీణ యువత ఉపాధికి ఊతమని, మహిళా సాధికారతకు మార్గమని వెల్లడించారు. కళాకారులను కాపాడుకునేందుకు, వారి పిల్లలకు చదువుతో పాటు కళను నేర్పించేందుకు ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తుందని పవన్‌ పేర్కొన్నారు.


అన్నా లెజినోవాకు ఉప్పాడ చీరలు

ఉప్పాడ చీరల స్టాల్‌లో తన సతీమణి అన్నా లెజినోవా కోసం మూడు ఉప్పాడ జాందానీ పట్టు చీరలను, తనకోసం కొన్ని వస్త్రాలను పవన్‌ కొనుగోలు చేశారు. అరటిపీచుతో తయారు చేసిన హ్యాండ్‌ బ్యాగులు, ఫైల్స్‌ తదితర పర్యావరణహిత ఉత్పత్తులను ఆయన ఆసక్తిగా తిలకించారు. హ్యాండ్‌ బ్యాగ్‌ కొనుగోలు చేశారు. అలాగే ఏటికొప్పాక స్టాల్‌ నిర్వాహకులు తయారు చేసిన బొంగరంతో పవన్‌ కాసేపు ఆడుకున్నారు. హస్తకళా మహోత్సవం వేదిక నుంచి లేపాక్షి ఈ-కామర్స్‌ యాప్‌ను పవన్‌ ఆవిష్కరించారు. దీనిద్వారా రాష్ట్ర హస్తకళా ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్త మార్కెటింగ్‌ అవకాశాలు దక్కనున్నాయి. దీంతో పాటు రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో వివిధ క్లస్టర్లలో ఏర్పాటు చేసిన 100 ఉద్యమ్‌ వర్క్‌షాపులను ఆయన ప్రారంభించారు. అనంతరం హస్తకళల పరిరక్షణ, ప్రచారంలో విశేష కృషి చేసిన పలువురిని సత్కరించారు.

Updated Date - Jul 08 , 2026 | 04:22 AM