కాపులపై కుట్ర!
ABN , Publish Date - Jun 28 , 2026 | 04:17 AM
‘కాపులను కాపులతోనే తిట్టించడం ఓ స్ర్టాటజీ అయితే, క్రిమినల్ అయిన ఓ రౌడీకి కులం రంగు వేసి దాన్ని రాజకీయం చేసి, క్రిమినల్‌కు మద్దతు ఇవ్వడం వైసీపీ నైజం’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
సమాజంలో నెగిటివ్‌గా చూపిస్తున్నారు
ఇది ఒక పార్టీ కక్షపూరిత రాజకీయ క్రీడ
కులం కార్డుతో రాజకీయాలు చేయను
దేశం, రాష్ట్రం బాగుండాలని కోరుకుంటా
ఎందరో ఆశలకు మా పార్టీ ప్రతిరూపం: పవన్
అమరావతి, జూన్ 27(ఆంధ్రజ్యోతి): ‘కాపులను కాపులతోనే తిట్టించడం ఓ స్ర్టాటజీ అయితే, క్రిమినల్ అయిన ఓ రౌడీకి కులం రంగు వేసి దాన్ని రాజకీయం చేసి, క్రిమినల్‌కు మద్దతు ఇవ్వడం వైసీపీ నైజం’ అని జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మండిపడ్డారు. రాష్ట్రంలో కాపులపై తీవ్రమైన కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాపు నాయకులతో బూతులు తిట్టిస్తారని, నేరాలకు పాల్పడే వ్యక్తుల కులం కాపు అని పదే పదే చెబుతారని, అలా కాపులను నెగెటివ్‌గా చూపించే కుట్ర సాగుతోందని తెలిపారు. జనసేన పార్టీ నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీల కార్యచరణ సమావేశాన్ని శనివారం మంగళగిరిలో నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘కాపు కులానికి చెందిన వ్యక్తులు చేసే నేర పనులను పదే పదే వీరితో చెప్పించడం ద్వారా కాపులపై నెగెటివ్ ముద్ర వేయడానికే పథకం ప్రకారం కుట్ర జరుగుతోంది. ఇది సృష్టంగా ఓ పార్టీ చేస్తున్న రాజకీయ క్రీడ. కక్షపూరితంగా కొన్ని కులాలను అందరి దగ్గర విలన్లుగా చూపేందుకు ఆడుతున్న ఆట. ప్రతిసారీ దాన్ని చాలా సృష్టంగా ప్రజలకు అర్థమయ్యేలా చెబుతా. చైతన్యవంతం చేస్తా. మీరు నమ్మే నాయకుడి మాటలు మీ కులాన్ని, మీ జీవనాన్ని గౌరవించేలా ఉన్నాయా? లేదా? అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ూతులు తిట్టే నాయకులు కాబట్టే ప్రజలు వారికి 11 సీట్లు ఇచ్చారు. శ్రీకాకుళంలో ఒక ప్రజాప్రతినిధి ఇష్టానుసారం నోటికొచ్చినట్లు బూతులు మాట్లాడితే పోలీసులు విచారణకు పిలిచారు. దీంతో ఆయనకు కులం గుర్తుకొచ్చింది. బీసీలైన మమ్మల్ని కావాలనే అరెస్టు చేశారని మొదలుపెట్టారు. కులం బూతులు తిట్టమని చెప్పిందా? అధికారం కోసం దేనికైనా, ఏదైనా చేసే గుంపు వైసీపీ. బాలినేని శ్రీనివాసరెడ్డి, సామినేని ఉదయభాను వైసీపీ నుంచి బయటకు వచ్చారంటే ఆ పార్టీ వెళ్లే దారి రైట్ కాదని వారికి అర్థమైంది’ అన్నారు.
కులాలకు అతీతంగా రాజకీయాలుండాలి..
‘కులాన్ని రాజకీయ పెట్టుబడిగా వాడుకోను. కులాన్ని మార్చాలని, సరిదిద్దాలని ప్రయత్నం చేయను. నేనెప్పుడూ కులం కార్డు తీసుకొని రాజకీయాలు చేయను. నాకు దేశం, రాష్ట్రం బాగుండాలి. మానవత్వం చచ్చిపోకూడదు. కులం ఎప్పుడూ ఇంటి గడప దాటకూడదు. కులాల గురించి ఎందుకు మాట్లాడతానంటే.. మిగిలిన వారు దిగజారి మాట్లాడినప్పుడు మాత్రమే దాన్ని సరిచేయాలనే మాట్లాడతా. రాజకీయాలు కులాలకు అతీతంగా నడవాలి. ఎవడో ఒకడు దీనికోసం ముందుకురావాలి. పవన్ కల్యాణ్ ఎప్పటికీ కులాన్ని రాజకీయ పెట్టుబడిగా వాడుకోడు. జనసేన పార్టీ సంక్షేమ పథకాలకు వ్యతిరేకం కాదు. కానీ, సంక్షేమ పథకాలతో ఓట్లు వస్తాయి, ప్రభుత్వాన్ని నడిపేద్దాం అనుకుంటే మాత్రం తప్పు. వైసీపీ అలా అనుకునే బోర్లాపడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనీస సౌకర్యాలను పట్టించుకోలేదు. రోడ్డు నిర్మించలేదు. ఇప్పుడు మళ్లీ వాటిని సరిదిద్దడానికి మేం తపన పడుతున్నాం. కూటమి ప్రభుత్వంలో రోడ్లు వేస్తున్నాం. ప్రాధాన్యత పరమైన సంక్షేమం మంచిదే. కానీ, బడ్జెట్ దేనికోసం కేటాయించాలి? దేనికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలనే విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేలా జనసేన నాయకులు పని చేయాలి’ అని పవన్ నిర్దేశించారు.
బీసీలు ఐక్యంగా ఉండాలి..
‘ఇటీవల రాజమండ్రిలో బీసీ నాయకులు కొందరు సమావేశం ఏర్పాటు చేశారు. జనాభాలో 50 శాతానికి పైగా ఉన్నాం. మాకు అవకాశాలు కల్పించండి అని నన్ను అడిగారు. అసలు మీకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఏమిటి? గొడవలు, ఇతర విషయాలప్పుడు ఉండే ఐక్యతను.. ఓట్లు వేసేటప్పుడు ఎందుకు చూపించరు? బీసీలంతా ఐక్యంగా ఉంటే వేరొకరిని అడగాల్సిన అవసరం ఏముంది? జనాభాలో అధికంగా ఉండే కులాలను కొందరు నాయకులు రాజకీయ మూలధనంగా ఉపయోగించుకుంటున్నారు. మీరు నమ్మే నాయకుడు మీ కులాన్ని సాధికారత వైపు తీసుకెళ్తున్నారా? లేదా? అనేది ప్రజలు ఆలోచించాలి. నాయకుడు ఎప్పుడూ అన్ని కులాలను నమ్మాలి. అధికారానికి దూరంగా ఉన్న కులాలను అధికారానికి తీసుకురావడమే రాజకీయ విజయం. అన్ని వర్గాలను ఆమోదించే నాయకత్వాన్ని తీర్చిదిద్దడం సామాజిక విజయం. ఎవరు అధికారంలోకి వచ్చినా మనకేం కాదు అని ప్రజలు భావించడమే పెద్ద విజయం’ అని పవన్ పేర్కొన్నారు.
11 సీట్లు వచ్చినా మారలేదు..
జనసేన ప్రస్థానం చిన్న కాలువ మాదిరిగా ప్రారంభమై.. నేడు వాగు ప్రవాహం మాదిరిగా విస్తరించిందని, అది మరింత ఉధృతమై నిత్య ప్రవాహంతో కళకళలాడాలని పవన్ ఆకాక్షించారు. ‘ఎందరో ఆశలు, ఆశయాలకు ప్రతిరూపంగా జనసేన నిలుస్తోంది. నన్ను ప్రతి ఒక్కరూ ఇంట్లోని వ్యక్తిగా అనుకుంటారు. 11 సీట్లు వచ్చినా వైసీపీ ఏమీ మారలేదు. అధికారం పోయినా, 11 సీట్లకు పరిమితమైనా ఇంకా నోటికొచ్చినట్లు దూషిస్తున్నారు. మేం తగ్గం అంటున్నారు. తగ్గకండి మీకు ఒక్క సీటు వచ్చినా తగ్గకండి అలాగే ఉండండి. ఈ విషయంలో వైసీపీ వాళ్ల నిబద్ధతను అభినందించాల్సిందే. అలాంటి మాటలకు గట్టిగా సమాధానం ఇవ్వక తప్పదు. మౌనంగా ఉన్నామంటే ఒక్కోసారి పేట్రేగిపోతారు. కాబట్టి మనం కూడా కొన్ని సందర్భాల్లో ధీటుగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది’ అన్నారు.
భాగ్యరాజ్ మరణంపై దిగ్ర్భాంతి..
ప్రముఖ దర్శకుడు, నటుడు, రచయిత కె.భాగ్యరాజ్ మరణంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చింతించారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ప్రేమ, కుటుంబ కథలను ఆయన మలిచిన విధానం ఒక తరం ప్రేక్షకులను మెప్పించిందని పేర్కొన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
గళం ఎత్తాల్సిందే!
తప్పును తప్పు అని చెప్పడానికి పార్టీలోని ప్రతి నాయకుడు గళం ఎత్తాల్సిందేనని పవన్ తేల్చిచెప్పారు. తెలంగాణ నాయకులు ప్రతి విషయం పట్ల సృష్టంగా స్పందిస్తారన్నారు. ప్రతి విషయం మీద తాను స్పందించే వరకూ వేచి ఉండే ధోరణి సరికాదన్నారు. ఎవడికి ఏ భాషలో చెప్పాలో? ఓ మాట మాట్లాడితే తూకం వేసినంత జాగ్రత్తగా, ఎదురుదాడిలా ఉండాలని తేల్చిచెప్పారు. క్యాడర్ టూ లీడర్షప్‌లో భాగంగా 28 మందితో సమాచార సేకరణ కమిటీలను నియమిస్తున్నామన్నారు. ఈ కమిటీలు ఈ నెల 29వ తేదీ నుంచి పార్లమెంట్ నియోజకవర్గాలవారీగా సారథుల సమాచార సేకరణ చేపడతాయని తెలిపారు. పార్టీ కోసం పని చేయడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరి నుంచి ప్రత్యేక ఫార్మాట్ ప్రకారం సమాచారం సేకరించి, తన ముందుకు తీసుకొస్తారని చెప్పారు. పార్టీ కోసం ఎప్పటి నుంచి పని చేస్తున్నారు? ఏ కార్యక్రమాలు చేశారు? ఎలాంటి ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు? చేసిన సేవలేమిటి? ప్రజలతో ఎలా మమేకమవుతారు? అనే విషయాలను బేరీజు వేసి, బాధ్యతలను అప్పగిస్తామన్నారు. జనసేన పార్టీ మొదటి అంకం నుంచి తదుపరి అంకం ప్రక్రియను మొదలుపెట్టబోతోందని, ఈ ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములేనని చెప్పారు.