Share News

విలువలు కాపాడితే కూటమికి తిరుగుండదు

ABN , Publish Date - Jun 13 , 2026 | 04:01 AM

‘రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది అధికార బదిలీ కాదు.. నమ్మకం బదిలీ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం’ అని..

విలువలు కాపాడితే కూటమికి తిరుగుండదు

  • 2024లో అధికారం కాదు.. నమ్మకం బదిలీ

  • దాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం

  • మా ప్రయాణం ప్రభుత్వ ఏర్పాటుకే కాదు అభివృద్ధి కోసం.. రాబోయే తరాల కోసం

  • తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలి

  • ఒక రాష్ట్రం కులాల పరిమితులు దాటాలి

  • మరో రాష్ట్రం ప్రాంతీయ పరిమితులు దాటాలి

  • అంతా కలిసి భారతీయత వైపు అడుగేయాలి: ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌

వ్యవస్థలను, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం దిశగా, విలువలను కాపాడే దిశగా అడుగులు వేస్తే కూటమికి తిరుగుండదు. సుదూర ప్రయాణంలో కూటమి మరింత బలోపేతం కావాలి.

- డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

తిరుపతి (టీటీడీ), జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): ‘రెండేళ్ల క్రితం ప్రజలు మాకు ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇచ్చారు. అది అధికార బదిలీ కాదు.. నమ్మకం బదిలీ. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునే దిశగా పనిచేస్తున్నాం’ అని జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ పేర్కొన్నారు. శుక్రవారం తిరుపతి నగర శివారులో ‘రెండేళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా అభివృద్ధి సాఽధ్యం కాదన్నారు. ప్రజలు పార్టీలను కాకుండా వ్యవస్థలను నమ్మాలని, ఆ వ్యవస్థలను బలోపేతం చేసేందుకు పార్టీలు ఉండాలని చెప్పారు. అప్పుడే ప్రజాస్వామ్యం శాశ్వతమవుతుందన్నారు. గ్రామం బలపడితే ప్రజాస్వామ్యం బలపడుతుందని, ప్రజాస్వామ్యం బలపడితే దేశం బలపడుతుందని అన్నారు. మన తరం బాధ్యత రాబోయే తరాలకు మంచి వ్యవస్థలను అందించడమన్నారు. రాబోయే తరాలు గర్వించే దేశాన్ని నిర్మించడం, అందించడం కూటమి బాధ్యత అన్నారు. ఇంకా ఏమన్నారంటే..


పరిమితులు దాటాలి

రెండేళ్లలో మేం నిర్మించింది కేవలం రోడ్లు, భవనాలు కాదు.. నమ్మకం. వ్యవస్థ న్యాయం చేయకుంటే కులం ముందుకు వస్తుంది. వ్యవస్థ బలహీనపడితే ప్రాంతీయత ముందుకు వస్తుంది. తెలుగు రాష్ట్రాలు మరింత బలపడాలంటే.. ఒక రాష్ట్రం కులాల పరిమితులను దాటాలి. మరొక రాష్ట్రం ప్రాంతీయత పరిమితులను దాటాలి. మనమంతా కలిసి భారతీయత వైపు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్యంలో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలు. వారు 2024లో ఒక రాజకీయ సంస్కృతిని, అహంకారాన్ని, అధికారమే అంతా అన్న భావజాలాన్ని తిరస్కరించారు. ఆ తీర్పు రాష్ట్రానికి మళ్లీ ఆశ ఇచ్చింది. సమాజానికి మళ్లీ ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఒక తరం భవిష్యత్తుకు మళ్లీ నమ్మకాన్ని కల్పించింది. ఈ విజయం కేవలం టీడీపీ, బీజేపీ, జనసేనదో కాదు. ఇది ప్రజల విజయం. అహంకారం, విధ్వంసంపై ప్రజాస్వామ్యం సాధించిన విజయం. దేశానికి ప్రధాని మోదీ దూరదృష్టి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించే జనసేన సంకల్పం.. మూడు శక్తులూ కలిసినప్పుడే రాష్ట్ర పౌర నిర్మాణానికి బలమైన పునాది ఏర్పడింది.


రాష్ట్ర భవిష్యత్తు కోసం..

కూటమిలో జనసేన 21 సీట్లతో సర్దిపెట్టుకునే సందర్భంలో చాలామంది వివిధ రకాలుగా విమర్శించారు. కానీ మేం 21 సీట్లతో రాజీపడలేదు. రాష్ట్ర భవిష్యత్తు కోసం 21 సీట్లకు జనసేనను పరిమితం చేశాం. ఆ త్యాగానికి ప్రజలు ఇచ్చిన సమాధానమే 100 స్ట్రైక్‌ రేట్‌. రెండేళ్ల క్రితం మేం ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా ఆచరణలో కనిపిస్తున్నాయి. మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం, పండిట్‌ దీన్‌దయాళ్‌ ప్రతిపాదించిన అంత్యోదయ సిద్ధాంతం. అంబేడ్కర్‌ రథసారథిగా రాజ్యాంగం ద్వారా స్థానిక స్వపరిపాలనకు వేసిన బలమైన పునాదులు.. ఈ మూడు ఆలోచనల సంగమమే మోదీ పాలనతత్వం. గ్రామాన్ని దేశానికి కేంద్ర బిందువుగా చూడాలనుకుని, ఆ దిశగా అత్యంత నిబద్ధతతో కృషి చేస్తున్న పంచాయతీరాజ్‌ మంత్రిగా మాట్లాడుతున్నాను. ఒక రైతు ఆశ.. మహిళ ఆత్మవిశ్వాసం.. యువకుడి ఉపాధి.. కుటుంబ ఆరోగ్యం ఇవన్నీ మొదటిగా పంచాయతీ ద్వారానే ప్రభావితమవుతాయి. అధికారాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లడమే నిజమైన ప్రజాస్వామ్యం. 2047 నాటికి వికసిత్‌ భారత్‌ నిర్మాణం పార్లమెంటు భవనం నుంచి కాదు 2.6 లక్షల పంచాయతీల నుంచి ప్రారంభం అవుతుంది. పంచాయతీరాజ్‌ వ్యవస్థ కేవలం స్థానిక పరిపాలన వ్యవస్థ కాదు. నాయకత్వాన్ని తయారుచేసే ప్రజా పాఠశాల. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ప్రయాణం స్థానిక సంస్థల నుంచే.. నగర పంచాయతీ కౌన్సిలర్‌గా రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు.

ప్రధానికి అభినందనలు

‘‘ఎన్నికైన దేశ ప్రధానిగా నెహ్రూ సుదీర్ఘ కాలం పనిచేశారు. ఇప్పుడు ఆ రికార్డు అధిగమించిన ప్రధాని మోదీకి కూటమి తరఫున అభినందనలు. ఈ సభ 9వ తేదీన జరగాల్సి ఉంది. విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో బ్లాస్ట్‌ జరగడంతో తొమ్మిది మంది చనిపోయారు. సీఎం ఫోన్‌ చేసి మాట్లాడారు. దుర్ఘటన జరిగి కార్మికులు ప్రాణాలు కోల్పోయిన సందర్భంలో విజయోత్సవ సభ బాగుండదని వాయిదా వేశారు. ఈ నిర్ణయానికి ఆయనకు ధన్యవాదాలు చెబుతున్నాను’’ అని పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు.

Updated Date - Jun 13 , 2026 | 04:02 AM