Share News

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

ABN , Publish Date - Jun 19 , 2026 | 04:57 AM

వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పట్టణ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని..

సీజనల్‌ వ్యాధులపై అప్రమత్తం

  • పట్టణ ప్రాంతాల్లో ఈ ఏడాది నమోదైన వ్యాధుల్లో డెంగీ కేసులు అధికం

  • విశాఖ రీజయన్‌లో అధికం.. ఇతర పట్టణాల్లోనూ ప్రభావం

  • నియంత్రణ చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ శాఖ ఆదేశం

అమరావతి, జూన్‌ 18 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలం ప్రారంభం కావడంతో సీజనల్‌ వ్యాధులపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. పట్టణ ప్రాంతాల్లో డెంగీ, మలేరియా, నీటి ద్వారా వ్యాపించే వ్యాధుల నియంత్రణపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని మున్సిపల్‌ శాఖ.. అధికారులను ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 1 నుంచి జూన్‌ 17 వరకు రాష్ట్రంలోని పట్టణ స్థానిక సంస్థల్లో మొత్తం 351 సీజనల్‌ వ్యాధుల కేసులు నమోదయ్యాయి. వాటిలో డెంగీ కేసులే 289 ఉండగా... మలేరియా కేసులు 62 ఉన్నాయి. అయితే వర్షాకాలంలో కేసులు మరింత పెరిగే అవకాశం ఉండటంతో ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించింది. రాష్ట్రంలోని నాలుగు మున్సిపల్‌ ప్రాంతీయ కార్యాలయాల్లో విశాఖపట్నం ప్రాంతం అత్యధికంగా ప్రభావితమైంది. ఈ ప్రాంతంలోని 14 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ ఏడాది ఇప్పటి వరకు 161 కేసులు నమోదయ్యాయి. వాటిలో 104 డెంగీ, 57 మలేరియా కేసులు ఉండడం ఆందోళన కలిగిస్తోంది. అనంతపురంలో మొత్తం 96 కేసులు నమోదైతే అందులో 95 డెంగీ కేసులే. తిరుపతి, కడప, కర్నూలు నగరాల్లోనూ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి. విజయవాడలో ఈ ఏడాది ఇప్పటి వరకు ఒక డెంగీ కేసు మాత్రమే నమోదైనట్లు నివేదికలు పేర్కొన్నాయి. డెంగీ, మలేరియా నివారణకు మున్సిపల్‌ కమిషనర్లు తగిన చర్యలు తీసుకోవాలని సీడీఎంఏ సంపత్‌కుమార్‌ ఆదేశించారు. నీరు నిల్వ ఉండే గుంతలు, పల్లపు ప్రాంతాలను పూడ్చేయాలని, ప్రధాన కాలువలు, డ్రెయిన్లలో మురుగు తొలగించాలని, గంబూసియా, గప్పీ చేపలను నీటి వనరుల్లో వదలాలని సూచించారు. నీటి వనరుల్లో డ్రోన్ల ద్వారా లార్విసైడ్‌ స్ర్పే చేయాలన్నారు. ఇటీవల కొన్ని పట్టణాల్లో కలుషిత తాగునీటి కారణంగా విరేచనాలు, గ్యాస్ట్రో సమస్యలు తలెత్తిన నేపథ్యంలో నీటి నాణ్యత పరీక్షలను క్రమం తప్పకుండా నిర్వహించాలన్నారు.

Updated Date - Jun 19 , 2026 | 04:59 AM