Share News

కేజీబీవీల్లో అడ్మిషన్లకు డిమాండ్‌!

ABN , Publish Date - Mar 10 , 2026 | 03:49 AM

కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ)... ఒకప్పుడు వీటిలో కనీస సంఖ్యలో అయినా పిల్లలు చేరితే చాలు అని టీచర్లు అనుకునేవారు.

కేజీబీవీల్లో అడ్మిషన్లకు డిమాండ్‌!

  • ఒకప్పుడు పిల్లలు లేక ఉసూరు.. నేడు సంపూర్ణ మార్పు

  • ప్రస్తుత ప్రభుత్వంలో సమూలంగా మారిన కస్తూర్బా విద్యాలయాలు

  • వసతులు, బోధనా సిబ్బంది మెరుగు.. దీంతో ఉత్సాహంగా బాలికల చేరికలు

  • గతేడాది ఒక్కో సీటుకు 2.5 దరఖాస్తులు.. ఈ ఏడాది మరింత పెరిగే అవకాశం

  • ఎంపీ, ఎమ్మెల్యేలు సిఫారసు చేసే స్థాయికి.. 2026-27కు నోటిఫికేషన్‌

అమరావతి, మార్చి 9(ఆంధ్రజ్యోతి): కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలు(కేజీబీవీ)... ఒకప్పుడు వీటిలో కనీస సంఖ్యలో అయినా పిల్లలు చేరితే చాలు అని టీచర్లు అనుకునేవారు. కానీ, ఇప్పుడు అవే విద్యా సంస్థల్లో అడ్మిషన్లకు డిమాండ్‌ పెరిగింది. ఏకంగా ఎంపీలు, ఎమ్మెల్యేలు సిఫారసు లేఖలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ముఖ్యంగా ప్రస్తుత ప్రభుత్వం వచ్చాక చేపట్టిన సమూల మార్పులతో కేజీబీవీల్లో అడ్మిషన్లు ఊపందుకున్నాయి. గతేడాది ఒక్కొక్క సీటుకు సగటున 2.5 దరఖాస్తులు అందాయి. ఈ ఏడాది ఈ డిమాండ్‌ మరింత ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి కేజీబీవీ అడ్మిషన్లకు తాజాగా నోటిఫికేషన్‌ జారీ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా 14,080 సీట్లు భర్తీ చేయనున్నారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభంకానుంది.

మౌలిక వసతుల మెరుగు

రాష్ట్రంలో మొత్తం 352 కేజీబీవీలున్నాయి. 1.07 లక్షల మంది చదువుతున్నారు. వారికి వసతి సౌకర్యం కూడా కల్పిస్తారు. గత వైసీపీ ప్రభుత్వం వసతి గృహాల్లో విద్యార్థులు నిద్రించేందుకు సరైన పరుపులు కూడా ఇవ్వలేదు. ప్రస్తుత ప్రభుత్వం వచ్చిన తర్వాత కేజీవీల్లోని విద్యార్థినికి ఒక బెడ్‌, రెండు బెడ్‌ షీట్లు చొప్పున పంపిణీ చేసింది. 1,19,560 మందికి నాణ్యమైన మెటీరియల్‌తో చేసిన బెడ్లు అందించారు. లాబొరేటరీలను బలోపేతం చేశారు. ఫలితంగా ఒకప్పుడు వేరే పాఠశాలలకు వెళ్లి ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ చేసే విద్యార్థులు ఇప్పుడు సొంత పాఠశాలల్లోనే ప్రాక్టికల్స్‌ చేస్తున్నారు. బాలికల భద్రత కోసం అన్ని కేజీబీవీల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేశారు. పౌష్ఠికాహారం అందిస్తున్నారు.


పూర్తిస్థాయిలో బోధనా సిబ్బంది

తాత్కాలిక టీచర్లకు బదులుగా ప్రస్తుత ప్రభుత్వం పూర్తిస్థాయి బోధనా సిబ్బందిని నియమించింది. గత రెండేళ్లలో 3,673 బోధన, బోధనేతర సిబ్బందిని శాశ్వత ప్రాతిపదికన నియమించారు. పూర్తిస్థాయిటీచర్లు, వేతనాల పెంపుతో బోధనలో ఆశించిన మెరుగుదల కనిపిస్తోంది. బాలికల్లో పరీక్షల ఒత్తిడి, ఇతర వ్యక్తిగత సమస్యల ఆందోళనను తగ్గించేందుకు దేశంలో తొలిసారిగా 649 మండలాల్లో మెంటల్‌ హెల్త్‌ అండ్‌ కెరీర్‌ కౌన్సిలర్‌ను ప్రభుత్వం నియమించింది. మానసిక ఒత్తిడి, నిస్సహాయతతో కుంగిపోయే పరిస్థితి లేకుండా కేజీబీవీల్లోనే కౌన్సెలింగ్‌ చేస్తున్నారు. చదువుతో పాటు వృత్తి నైపుణ్యాల పెంపు లక్ష్యంగా 44 పాఠశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు ప్రారంభించారు. ఆత్మరక్షణ కోసం బాలికలకు కరాటేలోనూ శిక్షణ ఇస్తున్నారు.

మోడల్‌ స్కూల్స్‌ను మించి..

సంస్కరణలతో టెన్త్‌, ఇంటర్‌ ఫలితాలు మెరుగుపడ్డాయి. 2024-25లో 83.45 శాతం మేరకు టెన్త్‌ ఉత్తీర్ణత నమోదైంది. ఇంటర్‌ ఫలితాల్లో 2023-24లో 76.12 శాతం,2024-25లో 87.95 శాతం నమోదైంది. ఎప్పుడూ ముందుండే మోడల్‌ స్కూల్స్‌ కంటే కేజీబీవీల్లోనే ఎక్కువ ఉత్తీర్ణత సాధించడం విశేషం.

ఉన్నత భవిష్యత్తే మా లక్ష్యం

‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమష్టి కృషితో.. పేద కుటుంబాలకు చెందిన బాలికల భవిష్యత్తులకు కేజీబీవీలు పునాదులు వేస్తున్నాయి. బాలికల జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దడం లక్ష్యంగా విద్యాలయాలను తీర్చిదిద్దుతున్నాం. ఒకప్పుడు ప్రాథమిక విద్యకే పరిమితమైన కేజీబీవీలు ఇప్పుడు ఇంటర్‌ వరకు విద్యను అందిస్తున్నాయి. కార్పొరేట్‌ విద్యా సంస్థలకు దీటుగా ఫలితాలు సాధిస్తున్నాయి. వచ్చే విద్యా సంవత్సరానికి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అర్హులు అవకాశాన్ని వినియోగించుకోవాలి.’ - బి.శ్రీనివాసరావు, సమగ్రశిక్ష స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌

Updated Date - Mar 10 , 2026 | 03:51 AM