Irrigation projects: ప్రాజెక్టులకు రూ.10,500 కోట్లు కేటాయించండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 04:45 AM
వార్షిక బడ్జెట్(2026-27)లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.10,500 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది.
రాష్ట్ర ప్రభుత్వానికి ఆలోచనాపరుల వేదిక డిమాండ్
వెలిగొండ పూర్తికాకుండానే జగన్ జాతికి అంకితమిచ్చేశారని ఆగ్రహం
అమరావతి, జనవరి 10(ఆంధ్రజ్యోతి): వార్షిక బడ్జెట్(2026-27)లో సాగునీటి ప్రాజెక్టులకు రూ.10,500 కోట్లు కేటాయించాలని రాష్ట్ర ఆలోచనాపరుల వేదిక డిమాండ్ చేసింది. వేదిక ప్రతినిధులు ఏబీ వెంకటేశ్వరరావు, అక్కినేని భవానీ ప్రసాద్, టి.లక్ష్మీనారాయణ, కంభంపాటి పాపారావు, నలమోతు చక్రవర్తి శనివారం విజయవాడలో మీడియా సమావేశంలో మాట్లాడారు. శ్రీశైలం కుడి బ్రాంచి కాలువకు రూ.400 కోట్లు, తెలుగుగంగకు రూ.500 కోట్లు, కేటాయించి నంద్యాల, కడప జిల్లాల పరిధిలోని నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. తద్వారా రెండు ప్రాజెక్టుల కింద 4,65,000 ఎకరాల ఆయకట్టుకు పూర్తిగా సాగునీరందించాలన్నారు. వెలిగొండకు రూ.2500 కోట్లు, గాలేరు-నగరికి రూ.2500 కోట్లు, హంద్రీ-నీవాకు రూ.2500 కోట్లు, ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి రూ.2500 కోట్లు, చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.1000 కోట్లు, అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణానికి రూ.500 కోట్లు, బుడమేరు వరద నివారణ కోసం రూ.3000 కోట్లు, వినియోగంలో ఉన్న భారీ మధ్య, చిన్న తరహా ప్రాజెక్టులకు తగిన నిధులు కేటాయించాలని వేదిక కోరింది.