Tirumala Laddu Controversy: తిరుమల లడ్డూ వివాదంలో.. వైవీ సుబ్బారెడ్డికి చుక్కెదురు
ABN , Publish Date - Jan 03 , 2026 | 05:01 AM
తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది.
వ్యతిరేక కథనాలు, పోస్టులపై స్టే ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరణ
ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులివ్వలేమని స్పష్టీకరణ
న్యూఢిల్లీ, జనవరి 2(ఆంధ్రజ్యోతి): తిరుమల లడ్డూ వ్యవహారంలో వైసీపీ ఎంపీ, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డికి ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యి సరఫరాకు సంబంధించి తనపై మీడియాలో వస్తున్న కథనాలపై మధ్యంతర స్టే ఇవ్వాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. ప్రతివాదుల వాదనలు వినకుండా ఏకపక్ష ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అలా ఉత్తర్వులిస్తామని స్పష్టం చేసింది. 2019 జూన్ నుంచి 2023 ఆగస్టు వరకు తాను టీటీడీ చైర్మన్‌గా పనిచేశానని.. హిందువులు అత్యంత పవిత్రంగా భావించే తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయ నెయ్యి సేకరణలో అవకతవకలు జరిగాయంటూ పలు సంస్థలు, ప్రచురణకర్తలు తన ప్రతిష్ఠకు భంగం కలిగించేలా కథనాలు రాస్తున్నారని.. వాటిని అడ్డుకోవాలని సుబ్బారెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ అమిత్ బన్సాల్ గత నెల 23న విచారణ జరిపారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. అత్యంత అసాధారణ పరిస్థితుల్లో మాత్రమే అవతలి పక్షం వాదనలు వినకుండా ఉత్తర్వులిస్తామని.. ప్రస్తుత వ్యాజ్యంలో అలా ఉత్తర్వులివ్వడానికి కోర్టు సుముఖంగా లేదని స్పష్టంచేశారు. తమ ప్రచురణలు, పోస్టులు, కథనాలకు సంబంధించి ప్రతివాదులకు తమ వాదనలు వినిపించే అవకాశమివ్వాలని భావిస్తున్నానని తెలిపారు. వారి వాదన వినకుండా పిటిషనర్‌కు మధ్యంతర ఉపశమనం కల్పించలేమన్నారు. తదుపరి విచారణను ఈ నెల 29వ తేదీకి వాయిదా వేశారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. ఈలోపు ప్రచురించే కథనాలు న్యాయ సమీక్షకు లోబడి ఉంటాయని తేల్చిచెప్పారు.