Share News

హెరిటేజ్‌పై అసత్య ప్రచారం ఆపండి!

ABN , Publish Date - Feb 20 , 2026 | 04:19 AM

జగన్‌ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థపై అసత్య, దురుద్దేశపూరితమైన కథనాలను ప్రసారం చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.

హెరిటేజ్‌పై అసత్య ప్రచారం ఆపండి!

  • ‘సాక్షి’కి ఢిల్లీ హైకోర్టు షాక్‌

  • హెరిటేజ్‌పై వివాదాస్పద కథనాలు తక్షణమే నిలిపివేయండి

  • ఆ కంటెంట్‌ను 24 గంటల్లో తొలగించండి

  • నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలతో పాటు అన్ని లింకుల యాక్సె్‌సనూ నిలిపేయండి

  • సాక్షి మీడియాకు న్యాయస్థానం ఆదేశాలు

  • ప్రతివాదులకు నోటీసులు జారీ

  • 4 వారాల్లో జవాబివ్వాలని ఆదేశం

  • ఆ తర్వాత 2 వారాల్లో రిజాయిండర్‌ వేయాలని పిటిషనర్‌కు సూచన

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): జగన్‌ రోత మీడియాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌ సంస్థపై అసత్య, దురుద్దేశపూరితమైన కథనాలను ప్రసారం చేయడంపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌పై వివాదాస్పదమైన అన్ని కథనాలు, నివేదికలు, ఇంటర్వ్యూలు, చర్చలు, డిజిటల్‌ కంటెంట్‌ను 24 గంటల్లోపు తొలగించాలని ఆదేశించింది. దీనికి సంబంధించిన అన్ని లింక్‌ల యాక్సె్‌స్‌నూ తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది. సాక్షి మీడియా తమపై అసత్య ప్రచారం చేస్తోందని, అభ్యంతరకర కథనాలు, అసత్య వార్తలతో తమ పరువుకు భంగం కలిగిందని హెరిటేజ్‌ ఫుడ్స్‌ లిమిటెడ్‌ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఇటీవల హరియాణాలో నమోదైన జరిమానా అంశాన్ని, భోలేబాబా డెయిరీ (ఇందాపూర్‌ డెయిరీ) వ్యవహారాన్ని హెరిటేజ్‌ ఫుడ్స్‌కు ముడిపెడుతూ సాక్షి మీడియా అసత్య కథనాలు ప్రచురిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. ఈ కథనాలు తమ సంస్థ 33 ఏళ్ల ప్రతిష్ఠను దెబ్బతీసేలా ఉన్నాయని, పూర్తిగా వాస్తవ విరుద్థమని తెలిపింది. ఇటువంటి కథనాలు ప్రచురించిన, ప్రసారం చేసిన సాక్షి మీడియాపై రూ.100 కోట్ల పరువు నష్టం విధించాలని విజ్ఞప్తి చేసింది. ఆ పిటిషన్‌ గురువారం జస్టిస్‌ మినీ పుష్కర్ణ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చింది. హెరిటేజ్‌కు వ్యతిరేకంగా ప్రచురించిన, ప్రసారం చేసిన అసత్య, తప్పుదోవ పట్టించే, పరువు నష్టం కలిగించే కంటెంట్‌ను న్యాయమూర్తి తీవ్రంగా పరిగణించారు. హెరిటేజ్‌ పరువుకు భంగం కలిగించే అంశాలను ప్రచురించడం, పోస్ట్‌ చేయడం, అప్‌లోడ్‌ చేయడం, ప్రచారం చేయడం కొనసాగించకుండా సాక్షి వార్తాపత్రిక, సాక్షి టీవీ, వాటి అనుబంధ సంస్థలు, ఇతర సోషల్‌ మీడియా వినియోగదారులను నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.


24 గంటల్లో కంటెంట్‌ను తొలగించాలని, భవిష్యత్‌లో అభ్యంతరకర కంటెంట్‌ ప్రసారం కాకుండా చూడాలని ధర్మాసనం ఆదేశించింది. మెటా (ఫేస్‌బుక్‌), ‘ఎక్స్‌’ వంటి డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు ఈ వివాదాస్పద కంటెంట్‌ను గుర్తించి, 55 ఫేస్‌బుక్‌ లింకులు, 52 ఇన్‌స్టాగ్రామ్‌ లింకులు, 70 యూట్యూబ్‌ లింకులు, 85 ‘ఎక్స్‌(ట్విటర్‌)’ లింకులను తొలగించాలని తెలిపింది. నిరాధారమైన, నష్టం కలిగించే ఆరోపణలను జవాబుదారీతనం లేకుండా ప్రసారం చేయడం సరికాదని సాక్షి మీడియాకు హితబోధ చేసింది. తుది తీర్పు వచ్చే వరకు హెరిటేజ్‌ ప్రతిష్ఠకు ఈ మధ్యంతర ఉత్తర్వు తక్షణ రక్షణను అందిస్తుందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. తమ ఉత్తర్వుల అమలుపై వారం రోజుల్లో అఫిడవిట్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించారు. ప్రతివాదులకు నోటీసులు జారీచేయాలని.. అవి అందాక నాలుగు వారాల్లో వారు జవాబివ్వాలని స్పష్టం చేశారు. రిజాయిండర్‌ వేయాలనుకుంటే తర్వాత రెండు వారాల్లో దాఖలు చేయాలని పిటిషనర్‌కు సూచించారు. పిటిషన్‌ను జూలై 9న లిస్టు చేయాలని ఆదేశించారు.

Updated Date - Feb 20 , 2026 | 04:20 AM