Share News

టెండర్ల ఖరారులో తాత్సారం!

ABN , Publish Date - Jan 22 , 2026 | 12:49 AM

విజయవాడలో ఎన్‌హెచ్‌-16పై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి, అంతర్గత ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టడానికి దోహదపడే నిడమానూరు- బందరు రోడ్డు అనుసంధానంగా చేపట్టే మూడు ప్రధాన రోడ్ల విస్తరణ పనుల టెండర్ల వ్యవహారం అనేక విమర్శలకు దారితీస్తోంది. లెస్‌ టెండర్లు పడినా, వాటిని ఖరారు చేయకుండా రద్దు చేయాలన్న ఆలోచనతో పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం తాత్సారం చేయటంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

టెండర్ల ఖరారులో తాత్సారం!

- నిడమానూరు నుంచి బందరు రోడ్డు వరకు 3 రోడ్ల విస్తరణకు టెండర్లు

- స్పందించిన కాంట్రాక్టు సంస్థలు.. లెస్‌కే టెండర్లు దాఖలు

- ఖరారు చేయకుండా కాలయాపన చేస్తున్న పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం

- రద్దు చేసి పెద్ద సంస్థలకు కట్టబెట్టేందుకు కుట్ర చేస్తున్నారని అధికారులపై ఆరోపణలు!

విజయవాడలో ఎన్‌హెచ్‌-16పై ట్రాఫిక్‌ రద్దీని తగ్గించటానికి, అంతర్గత ట్రాఫిక్‌ సమస్యలకు చెక్‌ పెట్టడానికి దోహదపడే నిడమానూరు- బందరు రోడ్డు అనుసంధానంగా చేపట్టే మూడు ప్రధాన రోడ్ల విస్తరణ పనుల టెండర్ల వ్యవహారం అనేక విమర్శలకు దారితీస్తోంది. లెస్‌ టెండర్లు పడినా, వాటిని ఖరారు చేయకుండా రద్దు చేయాలన్న ఆలోచనతో పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం తాత్సారం చేయటంపై తీవ్ర ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ):

విజయవాడ నగరంలో 16వ నెంబర్‌ జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ - 16) మీద ట్రాఫిక్‌ కష్టాలు ఏ స్థాయిలో ఉంటున్నాయో తెలియంది కాదు. దీనికి తోడు నగరంలో అంతర్గత ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఆటోనగర్‌ నివాస ప్రాంతాల్లో ఉండటంతో గన్నవరం నియోజకవర్గంలో ఉన్న విజయవాడ రూరల్‌ (తూర్పు) ప్రాంతం, విజయవాడ తూర్పు నియోజకవర్గం ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ, ఇన్నీ కావు. దీని కోసం నిడమానూరు నుంచి బందరు రోడ్డు వరకు సమాంతరంగా మూడు రోడ్లను విస్తరించి అభివృద్ధి చెయ్యాలని నిర్ణయించారు. వీటిలో ఒకటి బల్లెంవారి వీధి రోడ్డు నుంచి నిడమానూరు మెయిన్‌ రోడ్డు వరకు రూ.25.40 కోట్ల వ్యయంతో, రెండోది బల్లెం వారి వీధి రోడ్డు నుంచి బందరు రోడ్డు వరకు రూ.22.35 కోట్ల వ్యయంతో, మూడోది బల్లెంవారి వీధి రోడ్డు నుంచి పోరంకి - నిడమానూరు మెయిన్‌ రోడ్డు వరకు రూ. 25.21 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు.

టెండర్లకు స్పందన.. డిసెంబరులోనే ముగిసిన ప్రక్రియ

విజయవాడలో విస్తరణ చేపట్టాల్సిన రోడ్లకు కాంట్రాక్టర్ల నుంచి స్పందన వచ్చింది. ఈ టెండర్లలో పాలు పంచుకున్న సంస్థలు పోటా పోటీగా లెస్‌ టెండర్లు వేశాయి. గరిష్టంగా 6.66 శాతం లెస్‌ వేసినట్టుగా తెలుస్తోంది. ఈ లెక్కన చూస్తే రూ.4 కోట్ల వరకు సీఆర్‌డీఏ నిధులలో ఆదా జరుగుతుంది. డిసెంబరు 30వ తేదీతోనే టెండర్లు ముగిసినా.. ఇప్పటి వరకు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ అధికారులు టెండర్లు ఖరారు చేయకపోవటం గమనార్హం.

గతంలో సీఆర్‌డీఏ.. ఇప్పుడు పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం

ఇంతకు ముందు ఈ రోడ్లకు సీఆర్‌డీఏ టెండర్లు పిలిచినప్పుడు కూడా ఇదే జరిగింది. కాంట్రాక్టు సంస్థల నుంచి స్పందన వచ్చినా టెండర్లు రద్దు చేశారు. ఎవరికో అప్పగించటానికే సీఆర్‌డీఏ అధికారులు టెండర్లు రద్దు చేశారన్న విమర్శలు వచ్చాయి. ఇప్పుడు సీఆర్‌డీఏ కాకుండా పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ విభాగం ఆ రోడ్లకు టెండర్లు పిలిచింది. ఖర్చు మాత్రం సీఆర్‌డీఏనే పెడుతుంది. అంటే నిధులు సీఆర్‌డీఏవి.. టెండర్లు పిలిచేది పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ అన్నమాట. తేడా ఏమీ లేదు. సీఆర్‌డీఏకు తెలియకుండా ఏదీ జరగదు. పబ్లిక్‌ హెల్త్‌ ఇంజనీరింగ్‌ పిలిచిన టెండర్లు మళ్లీ ప్రతిష్ఠంభనలో పడటంతో వివాదాస్పదంగా మారుతున్నాయి. అసలు ఈ రోడ్డు పనుల టెండర్లు ఎందుకు ఆగుతున్నాయన్నది పెద్ద చర్చనీయాంశంగా మారుతోంది.

గుంటూరు ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు ఫేజ్‌-3 టెండర్లలాగానే చేస్తారా ?

విజయవాడ నగరంలో ఈ మూడు రోడ్ల టెండర్లతో పాటు గుంటూరు నగరంలో జేకేసీ కాలేజీ (స్వర్ణభారతినగర్‌) నుంచి పెదపలకలూరురోడ్డు వరకు ఫేజ్‌ - 3 పనులను రూ.36.36 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచారు. ఈ టెండర్లకు సంబంధించి విచిత్రమైన నిబంధనలు పెట్టారు. అవేమిటంటే.. కాంట్రాక్టు సంస్థలకు 1. వెట్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు - 2, 2. వాటర్‌ ట్యాంకర్లు-20, 3. ట్రిప్పర్లు - 20, 4.జేసీబీలు - 20 ఉండాలి అంటూ ఇంకా చాలా నిబంధనలు విధించారు. వీటిలో ఈ నాలుగు నిబంధనలు రూ.1000 కోట్ల మేర పనులు చేసే కాంట్రాక్టర్లకు నిర్దేశించినవిగా ఉన్నాయి. దీంతో అన్ని కాంట్రాక్టు సంస్థలు టెండర్లలో పాలుపంచుకోలేకపోయాయి. ఎక్సెస్‌ (3.49ు) టెండర్‌ వేసిన సంస్థకు టెండర్‌ వరించింది. దీనిలో తాము అనుకున్న సంస్థకే టెండర్‌ వచ్చేలా చేశారన్న విమర్శలు ఉన్నాయి. సరిగ్గా.. ఇదే విధానాన్ని విజయవాడ రోడ్ల టెండర్లకు సంబంధించి కూడా వర్తింపజేయాలన్న ఉద్దేశ్యంతో లెస్‌ వేసినా టెండర్లను రద్దు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తిరిగి మళ్లీ పైన చెప్పుకున్న నిబంధనలను పొందుపరిచి తామనుకున్న సంస్థలకు ప్రయోజనం కల్పించాలన్న ఆలోచనతో ఉన్నట్టుగా విమర్శలు వస్తున్నాయి.

Updated Date - Jan 22 , 2026 | 12:49 AM