జాప్యం!
ABN , Publish Date - Mar 19 , 2026 | 12:30 AM
హైదరాబాద్ - విజయవాడ అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) ఆరు వరసల విస్తరణకు సంబంధించిన డీపీఆర్ తయారీ కంచికచర్ల- నందిగామ మార్గంలో ‘బైపాస్ రోడ్డు’ ప్రతిపాదన కారణంగా ఆలస్యమవుతోంది. బైపాస్ రోడ్డును నిర్మించడం అవసరమని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తుండగా.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు బైపాస్ వద్దని, రోడ్డు విస్తరణ చేస్తే సరిపోతుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ అంశం తేలక డీపీఆర్ రూపకల్పనలో అంతులేని జాప్యం జరుగుతోంది.
- ముందుకు సాగని ఎన్‌హెచ్-65 విస్తరణ వ్యవహారం
- హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం మార్గం అభివృద్ధిలో వింత పరిస్థితి!
- నందిగామ- కంచికచర్ల మార్గంలో బైపాస్ రోడ్డుకు ప్రతిపాదించిన ఎన్‌హెచ్
- అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజాప్రతినిధులు
- నిర్మాణాలకు ఇబ్బంది లేకుండా ఎలివేటెడ్ విధానాన్ని పరిశీలించాలని విజ్ఞప్తి
- దీంతో డీపీఆర్ దాదాపుగా సిద్ధమైనా.. బైపాస్ రోడ్డు దగ్గర బ్రేక్
- ఫలితంగా టెండర్లు పిలవటంలో జరగనున్న మరింత ఆలస్యం
- బైపాసా.. విస్తరణా అనేది త్వరగా తేల్చాలని ప్రభుత్వాలకు ప్రజల విజ్ఞప్తి
హైదరాబాద్ - విజయవాడ అరవై ఐదో నెంబర్ జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65) ఆరు వరసల విస్తరణకు సంబంధించిన డీపీఆర్ తయారీ కంచికచర్ల- నందిగామ మార్గంలో ‘బైపాస్ రోడ్డు’ ప్రతిపాదన కారణంగా ఆలస్యమవుతోంది. బైపాస్ రోడ్డును నిర్మించడం అవసరమని ఎన్‌హెచ్ అధికారులు భావిస్తుండగా.. ఎన్టీఆర్ జిల్లాకు చెందిన రైతులు, ప్రజాప్రతినిధులు బైపాస్ వద్దని, రోడ్డు విస్తరణ చేస్తే సరిపోతుందంటున్నారు. ఈ నేపథ్యంలో ఏ అంశం తేలక డీపీఆర్ రూపకల్పనలో అంతులేని జాప్యం జరుగుతోంది.
(ఆంధ్రజ్యోతి, విజయవాడ):
కేంద్ర ప్రభుత్వం ఎన్‌హెచ్-65 రోడ్డును విస్తరించడానికి ఆసక్తితో ఉంది. టెండర్లు పిలవాలంటే డీపీఆర్ తయారు కావాలి. డీపీఆర్ దాదాపుగా సిద్ధమైంది. ఒక్క నందిగామ - కంచికచర్ల మార్గంలో పరిటాల దగ్గర బైపాస్ రోడ్డు అంశం తేలకపోవడంతో మొత్తం హైదరాబాద్ - విజయవాడ మార్గం విస్తరణ అంశంపై ప్రభావం చూపుతోంది. కీలకంగా మారిన బైపాస్ రోడ్డు అంశంపై రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వానికి మరింత గట్టిగా విజ్ఞప్తి చేయాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాదిలోనే బందరు పోర్టు మొదటి దశ పనులు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న తరుణంలో హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం మార్గంలో ఎన్‌హెచ్ - 65ను త్వరగా విస్తరించాల్సిన అవసరం ఉంది.
అనేక మార్పులతో..
హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం మార్గంలో ఎన్‌హెచ్-65ను ఆరు వరసలుగా విస్తరించేందుకు ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన డీపీఆర్ రూపకల్పన దాదాపుగా పూర్తయ్యింది. ఈ డీపీఆర్‌కు సంబంధించి ఏపీలో ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న ఇబ్బందుల రీత్యా.. ఇక్కడి ప్రజాప్రతినిధులంతా ఎన్‌హెచ్ అధికారులతో ప్రత్యేకంగా పలు సమావేశాలు నిర్వహించారు. మొదటి సారి నిర్వహించిన సమావేశంలో డీపీఆర్ గురించి తెలుసుకుని షాక్ అయ్యారు. డీపీఆర్‌లో హైదరాబాద్ ఓఆర్‌ఆర్ నుంచి అమరావతి ఓఆర్‌ఆర్ వరకు మాత్రమే విస్తరణ ప్రతిపాదించారు. దీంతో విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), జిల్లాకు చెందిన ఇతర ప్రజాప్రతినిధులు ముందుగా విజయవాడ బైపాస్ వెళుతున్న గొల్లపూడి వరకు విస్తరించాల్సిందేనని పట్టుబట్టారు. దీనికి ఎన్‌హెచ్ కూడా సానుకూలంగా స్పందించింది. ఆ తర్వాత కేంద్ర మంత్రి గడ్కరీ అమరావతికి వచ్చిన సందర్భంలో ఎంపీ చిన్ని గొల్లపూడి నుంచి హరిత బెర్మ్ పార్క్ వరకు (కనకదుర్గ ఫ్లై ఓవర్) ఎన్‌హెచ్-65పై ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలన్న విజ్ఞప్తిపై గడ్కరీ కూడా సానుకూలంగా స్పందించారు. ఇక కనకదుర్గ ఫ్లై ఓవర్ దిగిన దగ్గర నుంచి స్కూబ్రిడ్జి వరకు నాలుగు వరసలుగా ఉంటుంది కాబట్టి.. దీనికి కూడా ఫ్లై ఓవర్‌ను ప్రతిపాదించాలని ‘ఆంధ్రజ్యోతి’ ప్రతే ్యక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరో మారు స్టేక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించి.. కనకదుర్గ ఫ్లై ఓవర్ నుంచి స్కూబ్రిడ్జి వరకు 4.5 కిలోమీటర్లు ఫ్లై ఓవర్‌కు ప్రతిపాదించారు. అలాగే రెండో డీపీఆర్‌లో భాగంగా ఇదే ఎన్‌హెచ్ - 65పై బెంజిసర్కిల్ నుంచి మచిలీపట్నం వరకు ఆరు వరసల విస్తరణ అంశం చర్చకు వచ్చింది. బెంజిసర్కిల్ నుంచి గంగూరు వరకు తొమ్మిది కిలోమీటర్ల ఎలివేటెడ్ కారిడార్‌ను తెరమీదకు తీసుకువచ్చారు. ఇదే సమావేశంలో రెండు డీపీఆర్‌లుగా ఎందుకని ఒకే హైవే కాబట్టి.. ఒకటే డీపీఆర్ తయారు చేస్తే సరిపోతుందన్న వాదనలను తెరమీదకు తీసుకు రావటంతో కేంద్రం కూడా ఒకే డీపీఆర్ కింద హైదరాబాద్ - విజయవాడ - మచిలీపట్నం ఎన్‌హెచ్-65 ఆరు వరసల విస్తరణ చేపట్టాలని నిర్ణయించింది. ఒకే డీపీఆర్ దాదాపుగా సిద్ధమైనా.. ఒకే ఒక్క బైపాస్ రోడ్డు ప్రతిపాదన కారణంగా మొత్తం ప్రాజెక్టుపై ప్రభావం చూపిస్తోంది.
బైపాస్ రోడ్డు కథేంటి?
నందిగామ - కంచికచర్ల మార్గంలో ఎన్‌హెచ్-65ను విస్తరించడం కంటే కూడా పరిటాల దగ్గర బైపాస్ రోడ్డును నిర్మించాలని ఎన్‌హెచ్ అధికారులు ప్రతిపాదించారు. ఎందుకు ఈ బైపాస్ రోడ్డును ప్రతిపాదించాల్సి వచ్చిందంటే.. ఈ మార్గంలో రోడ్డు విస్తరణ వల్ల ఎక్కువ సంఖ్యలో భవన నిర్మాణాలకు ఎఫెక్ట్ అవుతుందని, దీనికి బదులు బైపాస్ రోడ్డు ఉత్తమమని ఎన్‌హెచ్ ప్రతిపాదించింది.
తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న రైతులు, ప్రజాప్రతినిధులు
ప్రతిపాదిత ఈ మార్గంలో గతంలో బైపాస్‌ల పేరుతో రెండు దఫాలు భూ సేకరణ చేశారు. రైతులు తమకు ఉన్న పొలాల్లో చాలా వరకు భూ సేకరణలో కోల్పోయారు. మళ్లీ భూ సేకరణ అంటే ససేమిరా అంటున్నారు. గతంలో భూ సేకరణలకు సంబంధించి కేసులు నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉండటంతో.. ఈ ప్రతిపాదనను ఎన్టీఆర్ జిల్లా రైతులు వ్యతిరేకిస్తున్నారు. ఇదే భావనను ప్రజాప్రతినిధులు కూడా వ్యక్తపరిచారు. ఇదే విషయాన్ని ఎన్‌హెచ్ అధికారులకు స్పష్టం చేశారు.
ఏదో ఒకటి తేలిస్తేనే..
ఎన్‌హెచ్-65 ఆరు వరసల విస్తరణ పనులు ప్రారంభం కావాలంటే.. బైపాస్ రోడ్డు మార్గంపై ఏదో ఒకటి తేల్చాల్సిన అవసరం ఉంది. లేకపోతే మరింత జాప్యమయ్యే ప్రమాదం ఉంది. బందరు పోర్టు మొదటి దశ పనులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేసి ప్రారంభించేందుకు సన్నాహకాలు చేస్తున్న తరుణంలో.. ఎన్‌హెచ్- 65 విస్తరణ జాప్యం కావటం వల్ల ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. ఎన్‌హెచ్-65 నుంచి పోర్టు కనెక్టివిటీ రోడ్డు ప్రతిపాదనలు కూడా ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడి రైతులు, ప్రజాప్రతినిధుల అభిప్రాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుని కేంద్రానికి నివేదించాల్సిన అవసరం ఉంది.