Share News

స్పష్టత ఇచ్చేనా.. ఫలితాలు వచ్చేనా?

ABN , Publish Date - Feb 03 , 2026 | 03:35 AM

డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌) పోస్టుల నోటిఫికేషన్‌ విడుదలై రెండేళ్లు దాటింది! అభ్యర్థులు పరీక్షలు రాసి 7 నెలలు గడిచింది.!!

స్పష్టత ఇచ్చేనా.. ఫలితాలు వచ్చేనా?

  • డీఎల్‌ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తిలో తీవ్ర జాప్యం

  • 15 వేల మంది అభ్యర్థుల ఎదురుచూపులు

అమరావతి, ఫిబ్రవరి 2(ఆంధ్రజ్యోతి): డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌) పోస్టుల నోటిఫికేషన్‌ విడుదలై రెండేళ్లు దాటింది! అభ్యర్థులు పరీక్షలు రాసి 7 నెలలు గడిచింది.!! అయినా ఫలితాలు ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. కళాశాల విద్యాశాఖను రోస్టర్‌పై చిన్న స్పష్టత కావాలని ఏపీపీఎస్సీ కోరగా... మూడు నెలలైనా స్పందన లేదు. కళాశాల విద్యాశాఖ వివరణ ఇచ్చాకే ఫలితాలు ఇవ్వగలమని కమిషన్‌ అంటోంది. దీంతో తాము ఎవరికి విన్నవించుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొందని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023 డిసెంబరులో 290 పోస్టులతో డిగ్రీ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చింది. 15,380 మంది పరీక్షలు రాశారు. 2025 జూలైలో రాత పరీక్షలు పూర్తయ్యాయి. ఆ సమయంలోనే జూనియర్‌ లెక్చరర్‌, పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్టుల భర్తీకి పరీక్షలు జరగ్గా.. వాటి ఫలితాలు విడుదలయ్యాయి. రోస్టర్‌పై స్పష్టత రావాలంటూ ఏపీపీఎస్సీ డీఎల్‌ పోస్టుల ఫలితాలను నిలిపివేసింది. కళాశాల విద్యాశాఖ నిర్వాకం వల్ల డిగ్రీ కాలేజీల్లోనూ బోధన కుంటుపడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. నోటిఫికేషన్‌లో కామర్స్‌ 40, కంప్యూటర్‌ అప్లికేషన్స్‌ 49, కంప్యూటర్‌ సైన్స్‌ 48, గణితం 25, కెమిస్ర్టీ 23, బోటనీ 20, జువాలజీ 20 పోస్టుల ఖాళీలు భర్తీ అవుతాయి. త్వరగా ఫలితాలు ఇస్తే కాలేజీల్లో బోధనా సిబ్బంది కొరత తీరుతుంది.

Updated Date - Feb 03 , 2026 | 03:37 AM