నిర్మల డీప్ ఫేక్ వీడియోతో టోకరా!
ABN , Publish Date - May 07 , 2026 | 03:49 AM
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపంతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడికి టోకరా వేశారు. క
వృద్ధుడి నుంచి 7.9 లక్షలు దోచేసిన సైబర్ నేరగాళ్లు
బళ్లారి, మే 6(ఆంధ్రజ్యోతి): కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రూపంతో సృష్టించిన డీప్‌ఫేక్ వీడియోతో సైబర్ నేరగాళ్లు ఓ వృద్ధుడికి టోకరా వేశారు. కర్ణాటకలోని బెళగావి నగరం వంటమూరి కాలనీకి చెందిన ప్రకాశ్ గుబ్బి(76) నుంచి రూ.7.9 లక్షలు కాజేశారు. నగర పోలీస్ కమిషనర్ భూషణ్ బోరసే బుధవారం ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. పెట్టుబడులపై భారీ లాభాలు వస్తాయని నిర్మలా సీతారామన్ చెబుతున్నట్టు ఉన్న వీడియోను ప్రకాశ్ గుబ్బి గతేడాది నవంబరులో యూట్యూబ్‌లో చూశారు. అందులో సూచించిన మేరకు వీడియో కింద ఉన్న లింక్‌ను క్లిక్ చేసిన ఆయన తన వివరాలు నమోదు చేశారు. ఆ వెంటనే మహారాష్ట్రకు చెందిన ఆదర్శ్ ఆనంద్ అనే వ్యక్తి ఫోన్ చేసి పెట్టుబడులకు డబ్బు పంపించాలని ఒత్తిడి చేశా డు. తొలుత లాభాలు వస్తున్నట్లు న మ్మించారు. తర్వాత రూ.65 వేలు లాభం వచ్చినట్టు చూపించి, విత్‌డ్రా కోసం కస్టమ్స్ ఫీజు చెల్లించాలంటూ మరో రూ.4 లక్షలు వసూలు చేశారు. అలా మొత్తం రూ.7.9 లక్షలు దోచుకున్నారు. గతేడాది నవంబరు నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు పలు దఫాలుగా ప్రకాశ్ గుబ్బి డబ్బులను పంపించారు. చివరికి సైబర్ మోసం అని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. మ్యూల్ ఖాతాల ద్వారా నగదు బదిలీ చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఏఐ సాయంతో డీప్‌ఫేక్ వీడియో సృష్టించి, మోసం చేసినట్లు భావిస్తున్నారు.