Share News

‘దీపం’ లబ్ధిదారులకూ పీఎన్‌జీ

ABN , Publish Date - Apr 11 , 2026 | 03:13 AM

‘దీపం-2’ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు కూడా పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ)ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

‘దీపం’ లబ్ధిదారులకూ పీఎన్‌జీ

  • ఏడాదికి రూ. 2,400 సబ్సిడీ.. ఉత్తర్వులు జారీ.. లబ్ధిదారులకు అవగాహన కల్పించండి: చంద్రబాబు

  • 6 నెలల్లో 10 లక్షల కనెక్షన్లు ఇవ్వాలి

  • ఆయిల్‌ కంపెనీలతో సీఎం సమీక్ష

  • శ్రీకాకుళం-కాకినాడ పైప్‌లైన్‌ కోసం కేంద్ర మంత్రికి ఫోన్‌

అమరావతి, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): ‘దీపం-2’ పథకం కింద ఏడాదికి మూడు ఉచిత గ్యాస్‌ సిలిండర్లు పొందుతున్న లబ్ధిదారులకు కూడా పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌ (పీఎన్‌జీ)ను సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువు (పీఎన్‌జీ) ఎల్పీజీ కంటే సురక్షితమైందని, పర్యావరణ అనుకూలమైందని ప్రభుత్వం చెబుతోంది. పైగా ఎల్పీజీ సిలిండర్ల రవాణా భారం తగ్గడంతో పాటు వినియోగదారులకూ ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని భావిస్తోంది. పీఎన్‌జీకి సబ్సిడీ లేకపోవడంతో ప్రజలు దాని వినియోగంపై పెద్దగా ఆసక్తి కనబర్చడం లేదని ప్రభుత్వం గమనించింది. ఈ నేపథ్యంలో పీఎన్‌జీకి కూడా దీపం-2 సబ్సిడీని విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని ఎల్పీజీ వినియోగదారులను పెద్దఎత్తున పీఎన్‌జీకి మార్చాలనే లక్ష్యంతో ‘ఆంధ్రప్రదేశ్‌ పీఎన్‌జీ సబ్వెన్షన్‌ స్కీం’ అమలుకు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ స్కీం కింద పీఎన్‌జీ కనెక్షన్‌ తీసుకునే దీపం-2 లబ్ధిదారులకు సంవత్సరానికి రూ. 2,400 సబ్సిడీ వర్తిస్తుంది. అయితే దీపం పథకం కింద ప్రస్తుతం ఉన్న ఎల్పీజీ కనెక్షన్‌ను తిరిగి ఇచ్చిన తర్వాతనే లబ్ధిదారులకు పీఎన్‌జీ సబ్సిడీ లభిస్తుంది.

లక్ష్యాలనుచేరుకోవాలి: సీఎం

యుద్ధం కారణంగా ఎల్పీజీ సరఫరాలో తలెత్తిన సమస్యలనుఎదుర్కొనేందుకు మరిం త సమర్థంగా పని చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు, ఆయిల్‌ కంపెనీలకు సూచించారు. రాష్ట్రంలో పీఎన్‌జీ వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో గ్యాస్‌ సరఫరాపై శుక్రవారం సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. దీపం లబ్ధిదారులకు పీఎన్‌జీ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. గ్యాస్‌ సరఫరా ఇబ్బందులను అఽధిగమించడానికి ఆయిల్‌ కంపెనీలు పీఎన్‌జీ కనెక్షన్లను పెంచేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. వచ్చే 6 నెలల్లో మొత్తం 10 లక్షల పీఎన్‌జీ కనెక్షన్లు ఇవ్వాలని స్పష్టం చేశారు. శ్రీకాకుళం-కాకినాడ నేచురల్‌ గ్యాస్‌ పైప్‌లైన్‌ పనుల్లో ఆలస్యంపై అధికారులను వివరణ కోరారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని అధికారులు చెప్పడంతో.. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు శాఖ మంత్రి హర్ది్‌పసింగ్‌ పూరికి ఫోన్‌ చేశారు. ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయినందున వెంటనే పనులు పూర్తి చేసేలా చూడాలని కోరారు. దీనికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి త్వరలోనే తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Updated Date - Apr 11 , 2026 | 03:13 AM