Share News

బాలుడి మృతి

ABN , Publish Date - Feb 04 , 2026 | 11:08 PM

పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 నెలల బాలుడు మృతి చెందాడు.

   బాలుడి మృతి
కేజీ రోడ్డుపై మృతదేహంతో ఆందోళన చేస్తున్న కుటుంబ సభ్యులు, వామపక్షాల నాయకులు

వైద్యుడి నిర్లక్ష్యమే కారణమని కుటుంబ సభ్యుల ఆందోళన

ఆసుపత్రిపై కేసు నమోదు

నందికొట్కూరు, ఫిబ్రవరి 4(ఆంధ్రజ్యోతి): పట్టణంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ 6 నెలల బాలుడు మృతి చెందాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ మరణించాడని కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు దిగారు. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలివీ.. పట్టణంలోని పగిడ్యాల రోడ్డు కుమ్మరిపేటకు చెందిన షేక్‌ అబిదాభాను, షాకీర్‌బాషాకు వివాహమైన 12 ఏళ్ల తర్వాత ఒక కుమారుడు జన్మించారు. బాబుపేరు అబ్దుల్‌ రహీం అని పేరు పెట్టుకున్నారు. జలుబు, దగ్గు కారణంగా జనవరి 26వ తేదీన పట్టణంలోని ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. బుధవారం డిచ్చార్జి అయి ఇంటికి వెళ్లవచ్చని వైద్యుడు శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే మంగళవారం రాత్రి ఉన్నఫలంగా చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ఆ సమయంలోనే కుటుంబ సభ్యులు వైద్యుడు శ్రీనివాసరెడ్డితో వాదనకు దిగారు. బాలుడిని కర్నూలులోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో చిన్నారి మృతదేహంతో బుధవారం ఉదయం కుటుంబ సభ్యులు, వామపక్షాల నాయకులు అనసూయ చిన్నపిల్లల ఆసుపత్రి ముందు కేజీ రోడ్డుపై మతదేహంతో ఆందోళనకు దిగారు. చిన్నారి మృతికి కారణమైన డాక్టర్‌ శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేసి, ఆసుపత్రిని సీజ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిలో వెంటిలేటర్స్‌ లేవని డాక్టరే చెప్పడంతో సరైన మౌలిక సదుపాయాలు లేని ఆసుపత్రిలో ఇన్ని రోజుల పాటు వైద్యం ఎలా అందించారని కుటుంబ సభ్యులు ప్రశ్నించారు. మౌలిక సదుపాయాలు లేని అనసూయ ఆసుపత్రిని సీజ్‌ చేయాలని, డా.శ్రీనివాసరెడ్డిపై కేసు నమోదు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగ్వేరరావు, కర్ణ, నాగన్న, శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఆసుపత్రిపై పోలీసులు కేసు నమోదు చేసిన అనంతరం నిరసనను విరమించి కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని అంత్యక్రియలకు తరలించారు. కార్యక్రమంలో సీపీఐ శ్రీనివాసులు, విద్యార్థి సంఘం నాయకులు ఆది, ఆవాజ్‌ నాయకులు అబ్దుల్లా, మగ్బూల్‌ బాషా, జాకీర్‌, అబ్దుల్‌ సామత, చాంద్‌బాషా, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Feb 04 , 2026 | 11:08 PM