గ్రామీణ యువతకు ఉపాధే లక్ష్యం
ABN , Publish Date - Oct 08 , 2026 | 05:56 AM
గ్రామీణ యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించి, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూజీకేవై)2.0 దక్షిణాది ప్రాంతీయ సదస్సు అభిప్రాయపడింది.
డేటా ఆధారిత నిర్ణయాలతో మెరుగైన ఫలితాలు
బెజవాడలో డీడీయూజీకేవై ప్రాంతీయ సదస్సు
ప్రధానంగా ఐదు సాంకేతిక అంశాలపై చర్చ
అమరావతి, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): గ్రామీణ యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించి, వారికి స్థిరమైన ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యమని దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన(డీడీయూజీకేవై)2.0 దక్షిణాది ప్రాంతీయ సదస్సు అభిప్రాయపడింది. బుధవారం విజయవాడలో సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజ్ డెవల్‌పమెంట్ ఇన్ ఏపీ(సీడాప్) ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. ఏపీ, తమిళనాడు, కేరళ, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, పుదుచ్చేరి, అండమాన్ అండ్ నికోబార్ నుంచి ప్రతినిధులు, ప్రాజెక్టు అమలు ఏజెన్సీలు ఇందులో పాల్గొన్నాయి. తెలుగు వ్యవహారాల సలహాదారు డాక్టర్. రవికుమార్ మాట్లాడుతూ.. శిక్షణ కార్యక్రమాలు కేవలం సర్టిఫికెట్లకే పరిమితం కాకుండా ఉపాధి, ఆదాయం, స్థిరమైన జీవనోపాధికి దారితీసేలా ఉండాలన్నారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ చీఫ్ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ అఖిలేశ్ ఝూ మాట్లాడుతూ... డీడీయూజీకేవై 2.0ను నిర్దేశిత మార్గదర్శకాలు, ఎస్‌వోపీలు, నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. నాణ్యమైన శిక్షణ, సరైన అసె్‌సమెంట్, ప్లేస్‌మెంట్లు, అనంతరం ట్రాకింగ్, ఆర్థిక క్రమశిక్షణ అత్యంత కీలకమన్నారు. నైపుణ్యాభివృద్ధి శాఖ కమిషనర్ జి.గణేశ్‌కుమార్ మాట్లాడుతూ... నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల అమలులో సాంకేతిక, సమన్వయానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు. శిక్షణ, ఉపాధి, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేయడం ద్వారా శిక్షణ పొందే యువత ప్రయాణాన్ని పర్యవేక్షించే అవకాశం ఏర్పడుతుందన్నారు. అభ్యర్థుల ట్రాకింగ్, శిక్షణ, ప్లేస్‌మెంట్‌కు డిజిటల్ వేదికల వినియోగం ద్వారా డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకోవడానికి, ఫలితాలను మెరుగుపరచడానికి అవకాశం ఏర్పడుతుందని అన్నారు. సీడాప్ సీఈవో పాలడుగు నారాయణస్వామి మాట్లాడుతూ... డీడీయూజీకేవై కార్యక్రమం అమలుకు టెక్నాలజీని విస్తృతంగా వినియోగిస్తున్నామన్నారు. సీడాప్ ప్రధాన కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేసి శిక్షణ కేంద్రాల్లోని సీసీటీవీలను అనుసంధానం చేశామన్నారు. అభ్యర్థులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా చర్చిస్తున్నామని తెలిపారు. ప్లేస్‌మెంట్‌ల ధ్రువీకరణకు మూడంచెల విధానం అమలు చేస్తున్నామన్నారు. ఐదు సాంకేతిక అంశాలపై సదస్సులో ప్రధానంగా చర్చించారు.